Pages

Wednesday, April 29, 2009

శ్రీకృష్ణుని అష్ట భార్యలు

1. రుక్మిణి: విదర్భరాజు భీష్మకుని కూతురు. వాళ్ళ అన్న రుక్మిని ఎదిరించి కృష్ణుణ్ణి పెళ్ళాడింది. 2. జాంబవతి: జాంబవంతుడికి అడవిలో ఒక పాప దొరికితే తెచ్చుకొని పెంచుకున్నాడు. ఆమె పేరే జాంబవతి. కృష్ణుడు సత్రాజిత్తు పోగొట్టుకున్న శమంతకమణిని వెతికితెచ్చే ప్రయత్నంలో జాంబవంతునితో యుద్ధంచేసి గెలిచిన తర్వాత పెళ్ళాడినావిడ. 3. సత్యభామ: సత్రాజిత్తు కూతురు. కృష్ణుణ్ణి అపనిందలకి గురిచేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కూతుర్నిచ్చి పెళ్ళిచేస్తాడు. 4. కాళింది: సూర్యుని కుమార్తె. విష్ణువుని భర్తగా కోరి తపస్సుచేస్తే ఈ అవతారంలో ఆమె కోరిక తీర్చాడు. 5.మిత్రవింద: కృష్ణుడికి ఐదుగురు మేనత్తలు. వాళ్ళపేర్లు పృథ (కుంతి), శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ, రాజాథిదేవి.
పృథని శూరసేనుని దగ్గరచుట్టం కుంతిభోజుడు దత్తత చేసుకోవడం వలన కుంతి అని పిలువబడింది. పాండవుల తల్లి. శృతదేవ కరూశదేశపురాజు వృద్ధశర్ముని భార్య. దంతవక్త్ర, విదూరథుల తల్లి. శృతకీర్తి (శృతసేన) కేకయరాజు భార్య. ఈవిడకి సంతర్థనుడూ మొదలైన కొడుకులూ, భద్ర అనే కూతురూ ఉన్నారు. ఈమె ఇంకో కొడుకే ఏకలవ్యుడు. ఎందుచేతనో నిషాథరాజు హిరణ్యధన్వుడి దగ్గర పెరుగుతాడు. ద్రోణుడికి కుడిచేతి బొటనవేలు గురుదక్షిణగా ఇస్తాడు. తర్వాత జరాసంథుడి తరఫున కృష్ణుడితో యుద్ధంచేసి ఆయనచేతిలో మరణిస్తాడు. శృతశ్రవ చేదిదేశపురాజు దమఘోషుడి భార్య. శిశుపాలుని తల్లి. ఈ శిశుపాలుడు, దంతవక్త్రులే ఒకప్పుడు వైకుంఠంలో కాపలాభటులైన జయవిజయులు. సనకసనందుల (సనక,సనంద,సనత్కుమార,సనత్సుజాతులు) శాపంవల్ల మొదటిజన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా,రెండవజన్మలో రావణ కుంభకర్ణులుగా, ఆఖరిజన్మలో శిశుపాల దంతవక్త్రులుగా పుడతారు. రాజాథిదేవి అవంతీదేశపు రాజు జయశేనుడి భార్య. ఈవిడ కొడుకులు విందానువిందులు, కూతురు మిత్రవింద. విందానువిందులు మహాభారత యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడతారు. వీళ్ళ చెల్లెలు మిత్రవింద అన్నల కోరికకి వ్యతిరేకంగా స్వయంవరంలో కృష్ణుని వరించి పెళ్ళిచేసుకుంటుంది.
పై విషయాలబట్టి తెలుస్తున్నదేమిటంటే, పాండవులు తప్ప, మిగతా మేనత్తల కొడుకులంతా కృష్ణుని శత్రువులే.
6.భద్ర: కృష్ణుని మేనత్త శృతకీర్తి కూతురు.
7.నాగ్నజిత్తి: అసలుపేరు సత్య. కోసలరాజు నగ్నజిత్తు కుమార్తె. ఈ రాజు తన దగ్గరున్న బలమైన ఏడు గిత్తల్ని ఎవరు లొంగదీసుకుంటే వాళ్ళకి తన కుమార్తెనిచ్చి పెళ్ళిచేస్తానని వీర్యశుల్కం ఏర్పాటుచేశాడు. కృష్ణుడు ఆ పనిచేసి నాగ్నజితిని పెళ్ళాడతాడు.
8.లక్ష్మణ : మద్రదేశ రాకుమారి. స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఛేదించి పెళ్ళాడతాడు.

గర్గ సంహిత గోలోకఖండం తృతీయాధ్యాయములో ఈ క్రింది శ్లోకాన్ని చూడొచ్చు.

శ్రీః సాక్షాద్రుక్మిణీబైమీ శివాజాం బవతీ తథా
సత్యాచతులసీ భూమౌ సత్యభామా వసుంధరా
దక్షిణా లక్ష్మణాచైవ కాలిందీ విరజా తథా
భద్రాహ్రీర్మిత్ర విందాచ జాహ్నవీ పాపనాశినీ.

No comments:

Post a Comment