Pages

Saturday, January 13, 2018

శంకరా నాదశరీరా పరా

శంకరా నాదశరీరా పరా

శంకరాభరణం సినిమా గురించి తెలియనివాళ్ళూ, కనీసం అందులోని పాటలు విననివాళ్ళూ తెలుగువాళ్ళలో ఉండరేమో. సుమారు 38 సంవత్సరాల క్రితం, 1980 ఫిబ్రవరి 12వ తేదీ న విడుదలై, అప్పట్లో వచ్చే సినిమాకథలకి పూర్తి విరుద్ధంగా, సాంప్రదాయ సంగీతసాహిత్యాలకి సంబంధించిన కథతో వచ్చి, దేశాన్ని ఒక్క ఊపు ఊపి, గాయకుడు బాలసుబ్రహ్మణ్యానికి అస్తిత్వాన్నీ, దర్శకుడు విశ్వనాథ్ కి అమరత్వాన్నీ, కవి వేటూరి పాటలకీ, మహదేవన్ సంగీతానికీ అజరామరత్వాన్నీ సంపాదించిపెట్టిన, ఎప్పటికీ జ్ఞాపకముండిపోయే మంచి తెలుగు సినిమా శంకరాభరణం.

సాధారణంగా తెలుగులో ఎప్పుడూ వినే, పాడుకునే పాతపాటలన్నీ (క్లాసిక్స్) ఘంటసాల యుగంలో వచ్చినవే. కానీ శంకరాభరణం పాటల విషయంలో మాత్రం ఈ వాదన చెల్లదు. సంగీత సాహిత్యాలు రెండింట్లోనూ అవి అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మరిచిపోలేనంత గొప్పవి. అయితే, ఆ పాటల సాహిత్యాన్ని ఆస్వాదించేవాళ్ళకన్నా, వాటిని విని ఆ సంగీతాన్ని మెచ్చుకొనేవాళ్ళే ఎక్కువ. కానీ ఒక్కసారి ఆ సాహిత్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకుంటే, ఆహా! అనకుండా ఉండలేం. ఉదాహరణకి శంకరా నాదశరీరా పరా అనే పాట వెనుక సాహిత్యాన్ని పరిశీలనగా చూద్దాం.

శంకరశాస్త్రిగారు ఒక నిశిరాత్రివేళ శివుడికి నివేదనగా వినిపిస్తున్న పాట ఇది.చూడండి ఏమని పిలుస్తునాడో శివుణ్ణి.

"శంకరా, నాదశరీరా, పరా, వేదవిహారా, హరా. జీవేశ్వరా..."

శుభం కలిగించేవాడా, ఓంకార స్వరూపా, వేదాలలో విహరించేవాడా, అజ్ఞానాన్ని హరించేవాడా, జీవులందరికీ ఈశ్వరుడా...

ఎందుకు పిలుస్తునాడు? తను పాడే పాట వినడానికి. అయితే మరీ చప్పగా, "పాట పాడతాను, విందువుగాని రా" అంటే ఆయన శంకరశాస్త్రి గారు ఎందుకవుతారు? ఎంతో కొంత ఉపోద్ఘాతమివ్వాలి. అది కూడా కవితాత్మకమైయ్యుండాలి. ఇదిగో ఇలాగన్నమాట.

"ప్రాణము నీవని, గానమే నీదని, ప్రాణమే గానమని,
మౌన విచక్షణ, గానవిలక్షణ, రాగమే యోగమని,
నాదోపాసన చేసినవాడను, నీ వాడను నేనైతే"

ఓంకారాత్మకమైన శివుడే నా శ్వాసలో ఉన్న ప్రాణశక్తి అని, ఆ ఓంకారంలోంచి పుట్టినదే నేను చేసే గానమని, శబ్దబ్రహ్మమైన రాగాలాపనే యోగమని భావించి నాదోపాసన (సంగీతాన్నే దైవంగా భావించి సాధన చేయడం) చేసే నేను నిజంగా నీ భక్తుడనైతే,

దిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కంధరా నీలకంథరా

అష్టదిగ్గజాలకధిపతివీ (దిక్ + కరి + ఇంద్ర + జిత = దిక్కరీంద్రజిత. అష్టదిక్కులు మోస్తూన్న ఎనిమిది ఏనుగులకి అధిపతులైన అష్టదిక్పాలకుల పైనున్నవాడివి), కైలాసాధిపతివీ (హిమగిరి = కైలాసం), తెల్లనివాడివీ లేదా స్వచ్ఛమైనవాడివీ (సిత), కపాలధారీవీ(కం-ధరా), నీలకంఠుడివీ (నీలకంథరా) .... (అయిన ఓ శివుడా)

క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధరించరా విని తరించరా

అజ్ఞానులకు అర్థంగానిదైన అర్ధరాత్రి నేను చేసే ఈ రుద్రవీణా గానం (అనుమానం: బహుశా అసలు కథ ప్రకారం రుద్రవీణ వాయిస్తూ పాడాలేమో శాస్త్రిగారు. దానికనుగుణంగా పాట వ్రాయడమూ, రికార్డింగ్ చేసెయ్యడమూ అయిపోయుంటుంది. తీరా షాట్ తీసేటప్పుడు చూస్తే రుద్రవీణ అందుబాటులో ఉండుండదు. తుంబురతో సరిబెట్టేసుంటారు. అనుకుంటా...) ఇదిగో నీకే (అవధరించు), బాగా విని ఆనందించవయ్యా

అని పాడుతూంటే, ఇంతలో ఉరుములూ, మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది. అదిచూసి, ఆ శివుడు తన పాట విన్నాడనీ, దాని ఫలితమే ఈ కుండపోత అనీ అనుకుని మహదానందంతో మళ్ళీ ఇలా అందుకున్నాడు మన శంకరశాస్త్రిగారు.

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నగవులు కాబోలు,
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా, ధరకు జారెనా శివగంగా
నా గాన లహరి నువు మునుగంగా ఆనందవృష్టి నే తడవంగా

శివా! నా కవిత్వానికి నువ్వు ముసిముసిగా చిరునవ్వులు నవ్వితే ఒక్కసారి కనిపించి మాయమైన నీ పంటికాంతులేనేమో ఈ మెరుపులు?
నా పాటకి నువ్వు నాట్యం చేయ్యడం మొదలెడితే, నీ కాలి అందెల మువ్వలు శబ్దమనుకుంటా, ఈ ఉరుములు.
నా గానమాధుర్యానికి నువ్వు పరవశించి ఒక్కసారి తలవిదిలించినట్టున్నావు, అంతే. నీ తలమీదున్న గంగ నేలకి జారి వర్షమై పడుతోంది.
నా పాటవెల్లువలో నువ్వు మునిగిపోయి, ఆ ఆనందంలో కురిపించిన ఈ వానలో నేను తడిసిపోయి, భలే!

ఇంతగొప్ప కవిత్వాన్ని మనకందించి వెళ్ళిన వేటూరి గారికి నమస్తే!

No comments:

Post a Comment