Pages

Monday, January 15, 2018

వెఱ్ఱిగొల్లడు అంటే తప్పేంటి?

ఇది జరిగి అప్పుడే కొంతకాలమైంది. చాగంటి కోటేశ్వరరావుగారు అందరికీ తెలిసిన మంచి ప్రవచన కర్త. ఆయన పదిమంది మంచికోరి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం తన తృప్తికోసం తనకి తెలిసిన పౌరాణిక, ధార్మిక విషయాలని వాటి వెనుక నిగూఢంగా ఉన్న తత్త్వార్థంతో సహా మామూలు మనుషులకర్థమయ్యే భాషలో విడమర్చి చెప్తూ తనకి తెలియకుండానే ఎంతోమందికి మార్గదర్శకులైన మంచిమనిషి. అలాంటి చాగంటిగారు ఆ మధ్య ఒకానొక సందర్భంలో విష్ణుమూర్తి అవతారాలైన రామకృష్ణులిద్దరినీ, వాళ్ళు పుట్టిపెరిగిన వాతావరణ పరిస్థితుల బట్టి పోలుస్తూ కృష్ణుడ్ని "వెఱ్ఱి గొల్లడు, తలకడిగితే మొలకడగడం తెలియని వాడు" అన్నారు. అంతే. ఆ మాటమీద తెలుగుదేశంలో పెద్దపెద్ద గొడవలయిపోయేయి. రాస్తారోకోలు, చాగంటిగారి బొమ్మని అందరూ చూస్తూండగా అవమానించడాలూ, ఆయన్ని నానా మాటలూ అనడాలూ, టీవీలో చర్చలూ, వాదోపవాదాలూ, ఒకటేంటి. ఎంత హడావిడి జరగొచ్చో అంతా జరిగింది. ఎవరితోనూ గొడవకి దిగడం ఇష్టంలేని మంచాయన చాగంటిగారు, ఈ విషయం వెంటనే సద్దుమణిగి పోవాలనే మంచి ఉద్దేశ్యంతో గొల్లకులం వారందరికీ క్షమాపణ చెప్పుకున్నారు.

ఇంతకీ గొల్ల అనే మాట మంచిదో కాదో చూద్దాం. గోపాలః అనేది సంస్కృత పదం. దీని అర్థం గోవులను పాలించేవాడు లేదా పశుపాలనే వృత్తిగా బ్రతికేవాడు అని. ఇది తెలుగులోకి వచ్చేసరికి గోపాలుడు అయ్యింది. దీనికి బహువచనం గోపాలురు అవుతుంది. అయితే, ఏ భాషలోనైనా ప్రకృతి, వికృతి అని ఉంటాయి. గ్రాంథికపదాలు ఆ భాష నుడికారానికి అనుగుణంగా వాడుకలోకి వచ్చినప్పుడు కొంతమారడం సహజం. శిష్టపదాల్ని ప్రకృతులనీ, వాడుకపదాల్ని వికృతులనీ అంటాం.
ఉదా: బ్రాహ్మణుడు -- బాపడు, శ్రేష్ఠి -- శెట్టి, నాయకుడు  -- నాయుడు. అలాగే గోపాలుడు గొల్లడు గానూ, గొల్ల గానూ వికృతి చెందిన పదం. ఈ పదాలు తెలుగులో ఎప్పట్నుంచో వాడుకలో ఉన్నవి. అన్నమాచార్యులుగారు ఆయన వ్రాసిన కీర్తనలలో చాలాచోట్ల గొల్ల, గొల్లడు, గొల్లెత అనే పదాలు వాడేరు. శ్రీకృష్ణుడిని తమ కులస్థుడిగా భావించేవాళ్ళు వాళ్ళని వాళ్ళే "మేము గొల్లలం" అని చెప్పుకుంటారు. గొల్లపేరుతో మొదలయ్యే ఊళ్ళూ గుళ్ళూ చాలా కనపడతాయి. విశాఖపట్నంలో "గొల్ల కంచరపాలెం" అనే ప్రాంతముంది. కాకినాడ పొలిమేర దగ్గిర "గొల్లల మామిడాడ" అనే ప్రఖ్యాత సూర్యక్షేత్రముంది. ఇంక తిరుమలలో గొల్లవారికున్న ప్రాముఖ్యత, విలువ అందరికీ తెలిసిందే. మరి  ఇంత చరిత్ర, అస్తిత్వం, పేరుప్రఖ్యాతులూ ఉన్న వర్గం వారు తమని తాము వేరే విధంగా పిలుచుకోవాలని ఎందుకనుకుంటున్నారో, వాళ్ళకే తెలియాలి.

ఇప్పుడు వెఱ్ఱిగొల్లడు అనే పదం సరైన మాటో కాదో చూద్దాం. వెఱ్ఱి అనే పదానికి మతిలేనివాడు అనే కాకుండా అమాయకుడూ, కల్మషంలేనివాడూ అనే అర్థం కూడా ఉంది. ఒకప్పుడు మనదేశంలో ఎవరిమటుకు వారు వాళ్ళవాళ్ళ కులవృత్తులు మాత్రమే చేసుకుని బ్రతికేవాళ్ళు. ఒకమనిషి గొడ్లు కాచుకోవడం, వాటిపాడిమీద ఆధారపడి బ్రతికేవారి కులంలో పుడితే తనూ చిన్నప్పట్నుంచీ గొడ్లకి సంబంధించిన పనులే చేస్తూ పెరిగేవాడు. అతనికి వేరే చదువు, విద్యలతో పనీ, పరిచయం ఉండేవికాదు. ఆ రోజుల్లో ఈ గోపాలన అనేది అతిమామూలు వృత్తి కాబట్టీ, పెద్దగా ఆలోచన ఉపయోగించి చేయాల్సిన పనికాదు కాబట్టీ, అటువంటి గొల్లవానికి లోకజ్ఞానం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఇలాగ పెద్దగా ప్రాపంచిక విషయాలు తెలియకుండా కల్లాకపటంలేని జీవనం గడిపేవాడిని "వెఱ్ఱిగొల్లడు" అనడం వాడుకలో ఉండేది. ఇదేదో అతన్ని కించపరచడానికో, అవమానించడానికో అనేమాటకాదు. ఆ మాటకొస్తే, వెఱ్ఱిగొల్లడే కాదు, వెఱ్ఱిబాపడనే మాటకూడా ఉంది.  రోజూ గుళ్ళో దేవుడ్ని సేవించుకుంటూ, వాళ్ళూ వీళ్ళూ ఇచ్చిన దక్షిణతోనూ, గుళ్ళో ప్రసాదంతోనూ బ్రతికే నిష్కల్మషమైన బ్రాహ్మణుడ్ని అలా అనేవారు.

ఇంక తలకడిగితే మొలకడగడం తెలియని వాడు అన్న విషయం. భాష తెలియకపోతే వచ్చే చిక్కులివి. ఇక్కడ ఏదో కడుక్కోడం గురించి ప్రస్తావించట్లేదాయన. తలకి అడిగితే మొలకి అడగడు అని అర్థం వచ్చేమాట కాస్తా అనర్థం అయికూర్చుంది తెలుగుభాషా మూఢులకి. కథ ఏంటంటే,  అమాయకుడూ, లోకజ్ఞానంలేనివాడూ అయిన ఒకానొక పేదవాడు ఈశ్వరుడి గురించి తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాట్ట. ఒంటిమీద కట్టుకోడానికి కూడా లేని ఈ పేదభక్తుడు స్వామిని ఒక తలపాగా ఇప్పించమన్నాట్ట. అప్పుడీశ్వరుడు నవ్వి, "తలకిస్తానుగానీ మొలకేం కడతావ్ మరి!" అన్నాడు. అప్పుడీ అమాయకుడు "సరే అయితే, మొలకి కట్టుకోవడానికొక గుడ్డ ఇవ్వండి స్వామీ, తలకొద్దులెండి" అన్నాట్ట. తలకీ, మొలకీ రెంటికీ ఇమ్మని కూడా దేవుణ్ణడగలేనంత అమాయకుడు మరి.

ఇదంతా చూస్తే ఉత్తిపుణ్యానికి ఒక మంచిమనిషిమీద బురద చల్లడానికి తప్పితే ఈ గొడవకి అర్థం లేదనిపిస్తుంది. అదీ సంగతి.

2 comments:

  1. అజ్ఞానానికి ఎల్లలు లేవు. ఏదో మంచి చెప్పి మనల్ని బాగుచేద్దామని పూనుకున్న ప్రతి వ్యక్తికి ఈ రాళ్లదెబ్బలు తప్పవేమో? ముఖ్యంగా గురువుగారికి.

    ReplyDelete