Pages

Sunday, December 2, 2018

వేదవిద్యార్థులకి విన్నపం

అవలోకనమంటే చూడడం. ప్రత్యేకించి వెనక్కి లేదా క్రిందకి చూడ్డం.  దీనికి వ్యతిరేక పదం ఆలోకనం. అంటే ముందుచూపన్నమాట. సింహం తనదారిలో నడుస్తూ మధ్యలో ఆగి ఒక్కసారి అలా వెనక్కి చూస్తుంది. తనకి సంబంధించని వాళ్ళెవరైనా తనని రహస్యంగా అనుసరిస్తున్నారా, తనువెళ్లే దారి సరైనదేనా, ఇలాటి కారణాలవల్ల. అలాగే మనుష్యులు కూడా తామేదైనా చదవడమో , వ్రాయడమో, బొమ్మ గీయడమో, శిల్పం చెక్కడమో, లేదా ఇంకేదైనా పని చేసేటప్పుడో మధ్య మధ్యలో తాము చేసే పని ఎంతవరకూ అయిందో, అసలు సరిగా అవుతోందో లేదో అని తేఱిపాఱా చూసుకుంటారు. సింహంలాగే. దీన్నే సింహావలోకనమంటారు. ఉపమానం. అసలలా వెనక్కి తిరిగి చూసుకోక పోతే ఆ చేస్తున్నపని సరిగా అవదుకూడా.

ఈ సింహావలోకనమనేది పాతికేళ్ళు దాటిన పెద్దవాళ్ళు వేదపఠనం, స్తోత్రపాఠం లాంటివి నేర్చుకోవడం మొదలుపెడితే వాళ్ళకి కూడా చాలా అవసరం. క్రమశిక్షణా, మరియూ శుచీ పాటిస్తూ నేర్చుకూంటున్నామా, నేర్చుకున్న పాఠం స్వరబద్ధంగా చదవగల్గుతున్నామా, శబ్దాలని వక్రీకరణ చెయ్యట్లేదు కదా ! ఒత్తులూ, దీర్ఘలూ పెట్టవలసిన చోట పెట్టకుండా, పెట్టకూడని చోట పెట్టీ, చదువుతున్న మంత్ర, శ్లోకాల అర్థాలు మార్చేయట్లేదు కదా! ద్విత్త్వాక్షరాలు సరిగానే పలుకుతున్నామా?  స్వరిత దీర్ఘస్వరితాలూ, ఉదాత్తానుదాత్తాలు చూసుకునే కదా స్వరాలు పలుకుతున్నాం ! ఇలాంటి విషయాలన్నమాట.

అయితే దోషాల్లేకుండా చదువుతున్నామో లేదో మనందరికీ తెలియదు, తెలిసినా తప్పులొప్పుకుని సరిదిద్దుకోడానికి అహం అంగీకరించదు. ఉదాహరణకి చాలామంది లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణుసహస్రనామ స్తోత్రం చదువుతారు. ఎంతో వేగం గానూ, ఎన్నో ఉచ్ఛారణ దోషాలతోనూ. "ఏవండీ, మీరు సరిగ్గా చదవట్లేదు, తప్పులు దొర్లుతున్నాయి" అని చెప్పడానికి ఎవరూ సాహసించరు. ఎవరైనా చెప్పినా ఇవతల వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం కూడా. అదే ఈ స్తోత్రాల గురించి తెలిసిన వాళ్ళెవరి దగ్గరైనా పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఉచ్ఛారణ దోషాలతోనూ, అపస్వరాలతోనూ చదవకుండా ఉండే అవకాశముంటుంది. అదేకాకుండా మనం ఇంతవరకూ నేర్చుకున్నది ఆ గురువు దగ్గరే ప్రదర్శించి చేస్తూన్న తప్పులూ సరిదిద్దుకోవచ్చు. స్తోత్రాల విషయంలో అయితే తప్పులు దిద్దుకోవడం సులువు. అదే వేదమంత్రాల విషయంలో ఒక్కసారి తప్పుగా చదవడం అలవాటైతే మళ్ళీ సరైన దార్లో పడడం చాలా కష్టంతో కూడుకున్న పని. వేదం నేర్చుకోవడానికి ముందు తెలుసుకోవలసిన విషయాలు కొన్నుంటాయి. ముందు సరైన ఉచ్ఛారణ ఉండాలి. ఉదాత్తానుదాత్తాలూ, స్వరితాలూ తెలుసుకోవాలి. శబ్దోచ్ఛారణలో ఏ అక్షరానికి ఎన్ని మాత్రల సమయం వినియోగించాలో నేర్చుకోవాలి. ఛందస్సులెన్నో, అవి ఏంటేంటో, ఒక్కొక్క ఛందస్సుకీ ఎన్ని అక్షరాలుంటాయో అర్థం చేసుకోవాలి. వీటన్నింటికీ మించి శుచి, క్రమశిక్షణ అవసరం. ఇవన్నీ కుదురుతే, అప్పుడు, మంత్రాలూ, సూక్తాలూ, నమక చమకాలూ నేర్చుకోవడం.

పూర్వకాలంలో వేదవిద్య గురుకులాల్లోనూ, ప్రత్యేకమైన వేద పాఠశాలల్లోనూ మాత్రమే నేర్పించేవారు. అయితే ప్రస్తుత కాలంలో గురుకులాలు అంతరించి పోయాయి. వేదపాఠశాలలు అక్కడక్కడ కొన ఊపిరితో కొట్టాడుతున్నాయి. ఇలాంటి వైదిక శిక్షణా కేంద్రాలలో విద్యార్థుల్ని ఏడెనిమిది సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగిన తర్వాత చేర్చుకునేవారు. వాళ్ళకి ముందు ఉచ్ఛారణ నేర్పించాలనే ఉద్దేశ్యంతో శబ్దమంజరి, అమరకోశం, చిన్న చిన్న వేదమంత్రాలు, నీతిశ్లోకాలు, మొదలైనవి భట్టీయం (బట్టీ పట్టించడం, లేదా ప్రస్తుత భాషలో పిడి కొట్టించడం) వేయించి, కంఠస్థం అయ్యేలా చేసేవారు. ఆ తర్వాత వయసుతో పాటు మానసిక పరిపక్వత పెరుగుతూ ఉంటే అంతవరకూ నేర్చుకున్న వాటిని విపులీకరించడం, వ్యాకరణ సూత్రాలకర్థం చెప్పడం, మొదలైనవి జరిగేవి.ఈ క్రమంలో శాస్త్రాలు, వేదాలు సాంగోపాంగంగా ఉపనిషదర్థాలతో సహా నేర్పేవారు.

అయితే ఇప్పుడు జరిగేది వయోజన వేదవిద్య. మనమంతా అంతో ఇంతో చదువుకుని ఏదో ఒక ఉద్యోగం చేసుకుని పొట్ట పోసుకుంటూ ఎవరైనా నేర్పించే వాళ్ళుంటే వేదమంత్రాలు నేర్చుకోవాలనీ, మంత్రపుష్పమో, పురుషసూక్తమో, లేకపోతే సూటిగా రుద్రమే నేర్చేసుకుందామని ఉబలాటపడిపోతూంటాం. అమెరికాలాంటి విదేశాలలో ఉండేవాళ్ళకి పద్ధతిగా వేదం నేర్పించే వాళ్ళు దొరకడం అంత సులభం కాదు. చికాగో, ఫొయినిక్స్, లాస్ ఏంజెల్స్ లాంటి పెద్ద ఊళ్ళలో వేద పాఠశాలలూ, శిక్షణా కేంద్రాలూ ఉన్నా, అన్నిచోట్లా ఇలాంటి సౌకర్యముండదు. ఎవరో ఆముదం చెట్టులా ఆ మాత్రం తెలిసిన వాళ్ళుంటారు. అయితే ఇలాంటి వాళ్ళు సనాతన ధర్మానికీ, వేదమాతకీ చేస్తూన్న హాని అంతా ఇంతా కాదు. వీళ్ళలో కొంతమందికి కచటతపలకీ గజడదబలకీ తేడా తెలీదు. కొంతమంది స్వరాలింటి దగ్గర మర్చిపోతారు. కొంతమందికి లింగ వచన విభక్తులంటే తెలియదు. కొంతమంది ఛందస్సంటే కస్సంటారు. ఇలాంటి భాషా జ్ఞానం, స్వరజ్ఞానం లోపించిన వాళ్ళు తప్పుడు పద్ధతిలో పదిమందికి నేర్పేస్తూ ఉంటే, వాళ్ళు ఒక్కొక్కళ్ళూ చెరో పదేసిమందికి నేర్పించేస్తున్నారు. వేల సంవత్సరాలనుంచీ పరంపరగా వస్తూన్న వైదిక శిక్షణా పద్ధతులిలా భ్రష్టు పట్టిపోవడం బాధాకరమైన విషయమే.

ఈ మధ్య ఇంకొక ఘోరం చూడాల్సొచ్చింది. ఒకాయననున్నాడు. 25 - 35 ఏళ్ళ వయసుంటుంది. ఇంకా పెళ్ళి కూడా కాలేదు. ఆంజనేయ భక్తుడు. గంటల తరబడి పాడగలడు. మంచి గొంతు, లయజ్ఞానం ఉన్నాయి. కంజీర, గొట్టువాద్యం చాలా బాగా వాయిస్తాడు. హనుమాన్ చాలీసా, రామదాసు కీర్తనలూ, త్యాగరాయ కీర్తనలూ, కంఠస్థం. మంచి శిష్యగణం కూడా ఉంది. ఊళ్ళో ప్రజల ఇళ్ళల్లో హనుమాన్ భజనలూ అవీ చేస్తాడు. చాలా మంచివాడు కూడా. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే, ఆయన వేదం ఎవరి దగ్గరా పద్ధతి ప్రకారం నేర్చుకున్నట్టనిపించదు. అయినా సూక్తాలూ, నమకమూ చమకమూ అతనిష్టం వచ్చినట్టు స్వరం మార్చీ, శబ్దాలు మార్చీ చదివేస్తాడు, పైగా అదే పద్ధతిలో శిష్యులకి నేర్పించేస్తాడు కూడా. ఇదంతా సరిపోకుండా జనం ఇళ్ళల్లో హనుమంతుడికి అభిషేకాలు చేయిస్తాడు. హనుమంతుడు భజనప్రియుడే. ఆయనకి భజన ఎలా అయినా చెయ్యొచ్చు. కానీ అభిషేకం అంటే వేరు కదా. దానికి ఒక పద్ధతీ, ఒక మర్యాదా ఉంటాయి. వేదప్రోక్తంగా, ఎంతో నిష్ఠగా ఇంటి యజమాని, అతని భార్య చేతా చేయించాల్సింది. అంతేకానీ రామదాసు కీర్తనలనిష్టం వచ్చిన వరసలో పాడేస్తూ, డప్పు వాయిస్తూ, చూడ్డానికొచ్చిన వాళ్ళు శుచిగా ఉన్నారో లేదో, అసలు స్నానం కూడా చేసేరో లేదో తెలుసుకోకుండా ఆంజనేయుడి మూర్తికి పంచామృతాలతోనూ, పానీయాలతోనూ అభిషేకం చేయించేయడం ఎంతవరకూ సబబో ఆయనకే తెలియాలి. ఇంక అది సరిపోక నమక చమకాలతో కూడా అభిషేకం మొదలుపెట్టేడు. కానీ స్వరయుక్తంగా చదవాలనే విషయాన్ని విస్మరించేడు. ఆశయం మంచిదే. ఆచరణ విషయంలోనే కొంచెం తప్పు జరుగుతోందనిపిస్తుంది.

విషయానికొస్తే, వైదిక, ధార్మిక విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళూ, వేదమంత్రాలు చదవడం నేర్చుకోవాలనుకునే వాళ్ళూ, కొన్ని విషయాలు పాటిస్తే బాగుంటుంది. నేర్చుకోవాలనే ఆత్రుతలో ఎవర్ని పడితే వాళ్ళని ఆశ్రయించకండి. మీ పిల్లల్ని కేజీ స్కూల్లో వేసేముందు, ఆ బడి గురించీ, టీచర్ల గురించీ విచారిస్తారా లేదా? ఏదైనా యూనివర్సిటీలోనో లేదా కమ్యూనిటీ కాలేజ్ లోనో కోర్స్ రిజిస్టర్ చేసుకునే ముందు ఆ ఇన్స్ట్రక్టర్ ఎలాంటివాడో తెలుసుకుంటామా లేదా? అలాగే, వేదం నేర్పించే గురువు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీరు నేర్చుకున్నదంతా అపస్వరాలతోనూ, వ్యాకరణదోషాలతోనూ నిండి ఉండే ప్రమాదం ఉంటుంది.  అలా నేర్చుకున్నది ఏ గుళ్ళోనో, లేదా ఇంకెవరి సమక్షంలోనో శ్రవణం చేస్తే, వినేవాళ్ళకి అంతో ఇంతో వేదం తెలుస్తే, వాళ్ళకి మీ దోషభూయిష్టమైన వేదఘోష విని కడుపులో దేవినట్టవుతుంది. అది మీకూ, వాళ్ళకీ ఇద్దరికీ మంచిది కాదు.

అదే ఒక మంచి గురువుగారి దగ్గర నేర్చుకోవడం మొదలుపెట్టేరనుకోండి. ఆయన మీకు ఒక పద్ధతిలో నేర్పిస్తారు. ఉచ్ఛారణ, స్వరం, భాష, భావన ఇలా అన్నీ బాగుంటాయి. అయితే అందరు గురువులకీ అన్నీ తెలియాలని లేదు. వాళ్ళకి తెలియని విషయాలని మాటిమాటికీ అడిగి వాళ్ళనిబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది. కాని నేర్చుకున్న వేదమంత్రాలకి వీలయినంతవరకూ అర్థం తెలుసునే ప్రయత్నం చేస్తే మంచిది. వేదాలకర్థం తెలియడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. విశాల భారతంలో వేదపండితులూ, భాష్యకారులూ చాలామందే ఉన్నారు. వాళ్ళనీ, వాళ్ళు వ్రాసిన భాష్యగ్రంథాల్నీ శోధించి సాధించాలి.

సంస్కృతభాష నేర్చుకోండి. అంతే. దీనికి ప్రత్యామ్నాయం లేదు. భాష తెలియకపోతే భావమర్థమవదు. అర్థం కాని చదువు వ్యర్థం అని తెలుగు సామెత. అలాగే సంస్కృతంలో ఒక మంచి సుభాషితముంది.

యథా ఖరశ్చందనభారవాహీ, భారస్య వేత్తా న తు చందనస్య
ఏవం హి శాస్త్రాణి బహు న్యధీత్య, చార్థేషు మూఢా: ఖరద్వహంతి

అర్థమేంటంటే, మంచిగంధం చెక్కలు మోసుకెళ్ళే గాడిదకి ఆ చెక్కల బరువైతే తెలుస్తుంది కానీ, ఆ గంధ పరిమళం మాత్రం తెలియదు. అలాగే ఎన్నో శాస్త్రాలు చదివినవాళ్ళు కూడా అర్థం తెలియకపోతే అలాంటి గాడిదతో సమానం.

పైన చెప్పిన విషయాన్నే, లలితాసహస్రనామస్తోత్రానికి భాష్యం వ్రాసిన ప్రసిద్ధ పండితులైన భాస్కరాచార్యులు గారు ఆయన వ్రాసిన "శ్రీ వరివస్యా రహస్యం" అనే గ్రంథంలో 54, 55 శ్లోకాలలో ఈ క్రింది విధంగా అంటారు.

    నా2ర్థజ్ఞానవిహీనం శబ్దస్యోచ్ఛారణం ఫలతి |
    భస్మని వహ్నివిహీనే, నప్రక్షిప్తం హవిర్జలతి || 54 ||      

    అర్థమాజానానానాం, నానావిధ శబ్దమాత్ర పాఠవతాం |
    ఉపమేయశ్చక్రీవానా, మలయజ భారస్య వోఢైవ || 55 ||

అర్థం

54. అర్థం తెలియని వారికి వాళ్ళు చేసే శబ్దోచ్ఛారణ ఫలించదు.
బూడిదలో హవిస్సు కలిపితే అగ్ని జ్వలించదు కదా!

55. అర్థం తెలియకుండా రకరకాల శబ్దాల్ని మాత్రం పఠించేవాళ్ళు గంధపుచెక్కలు మోసే గాడిదతో పోల్చదగినవారు.

ఒక్క విషయం. వేదమంత్రాలకర్థం గూగుల్ లో మాత్రం వెతకొద్దండి. గూగుల్ అన్ని విషయాలలో మేలు చేసినా సనాతన ధార్మిక విషయాలలో మాత్రం అది చేసే కీడే ఎక్కువ.

ఒక శ్లోకం గానీ, సూక్తంగానీ, మాట గానీ, మంత్రం గానీ, ఏదైనా సరే, మీకు "క్షుణ్ణంగా" తెలియక పోతే ఇంకొకరికి నేర్పించవద్దు. దీనివల్ల మీరు వాళ్ళకి మేలు చేయకపోగా, కీడు మాత్రం చాలా చేస్తున్నారు.

సెలవు.

2 comments:

  1. శ్రమ తీసుకుని మంచి విషయం మీద వ్యాసం వ్రాసారు. తప్పొప్పులు చక్కగా చూపెట్టారు. జిజ్ఞాస ఉండి సరైన గురువులు దొరకని వారికి ఏమైనా మార్గాలు సూచించవలసినది.

    ReplyDelete
  2. చదివినందుకు ధన్యవాదాలు. జిజ్ఞాస కలిగడం మంచి విషయమే. మీరు ఎక్కాడుంటారో నాకు తెలియదు. ఇండియాలో అయితే చాలామంది మంచి గురువులు అందుబాట్లో ఉంటారు. ఒకవేళ అమెరికాలో అయితే, కొన్నిరకాలుగా ప్రయత్నించవచ్చు. Phoenix, AZ లో Atmaveda Gana Foundation (facebook: @AVGFoundation) అని నేను నేర్చుకున్న మంచి వేదపాఠశాల ఉంది. అక్కడ ప్రధాన గురువుగారే కాక వేదం బాగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగి చూడండి. స్కైప్ లో నేర్పిస్తారేమో. మొదలు పెట్టేటప్పుడు ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం, దీర్ఘస్వరితం అనే స్వరాల గురించి, notations గురించి బాగా ఎవరిదగ్గరైనా నేర్చుకోవాలి. తర్వాత పురుషసూక్తం, నారాయణ సూక్తం, శ్రీ సూక్తం, మొదలైన కొన్ని సూక్తాలు కష్టపడి నేర్చువాలి. ఇలా ఒక్క సంవత్సరం కష్టపడితే నమక చమకాలు నేర్చుకునే స్థితికి వస్తారు. ఒకసారి ఇలా ఎవరో ఒక మంచి గురువు దగ్గర నేర్చుకుంటూ రోజూ సాధన చేయడానికి, Challakere Brothers Youtube లో పెట్టిన ఆడియోలు పెట్టుకుని సాధన చెయ్యొచ్చు.

    GRD Iyer అని Canada లో ఒకాయన ఉన్నారు (https://grdiyers.weebly.com) ఆయననైనా సంప్రదించండి. రామకృష్ణ మఠం వాళ్ళ సస్వర వేదమంత్రాలు అని ఒక పుస్తకం ఉంటుంది. దాన్ని కరదీపికగా ఉపయోగించుకోవచ్చు.

    San Diego లో vedageetha foundation (https://www.vedageethafoundation.org) వాళ్ళని కూడా సంప్రదించ్చొచ్చు. ఇంకేమైనా సహాయం కావాలంటే నన్నడగండి.

    ReplyDelete