Pages

Wednesday, December 5, 2018

కేరాఫ్ కంచరపాలెం - సమీక్ష

C/o Kancharapalem చూసేరా? బాగుంది కదూ! ఇంకా చూడలేదా! ఐతే వెంటనే వెళ్ళి చూసెయ్యండి. మిగతా తెలుగు సినిమాలలాగా గందరగోళమైన పాటలూ, తొంభై శాతం బట్లరింగ్లీషూ, మిగతా పదిశాతం మహమూద్ హిందీతో కలిసిన తెలుగుతో నాటకఫక్కీలో చెప్పే మాటలూ, ఇవేమీ లేకుండా, మామూలు మనుషులతో మన చుట్టుపక్కల జరిగే విషయాలతో కథనల్లి దాన్ని సినిమాగా చూపించేరు. ఇందులో అనవసరమైన అలౌకిక దెబ్బలాటల్లేవు. చెత్త ఇంగ్లీషుతో కలుషితమైన తెలుగు మాటలేదు. హిందీమాటలుంటాయి కానీ, అవి పాత్రోచితమైనవి. బూతుమాటలుంటాయి కానీ, అవికూడా సందర్భోచితమైనవే. వాటిని బూతులని కూడా అనలేం. అశ్లీలత లేనీ మాండలీకం అంతే. ఇంగ్లీషు, హిందీ, లేదా ఏ ఇతర పైశాచికభాషా కలిసిన పాటల్లేవు. శృతిలేని వీధి పాటలైనా వినడానికి హాయిగా ఉంటాయి. "సొట్టబుగ్గల ఓ చిన్నదీ...", "కలకత్తా కాళి, పరమగయ్యాళి, కాబోయే నా ఆలి..." అనేవి రెండు మచ్చుతునకలు. నలభై ఏళ్ళ సగటుమనిషి ప్రేమ కథా సరిత్సాగరాన్ని రెండున్నర గంటలసేపు రంగులరాట్నంలా తిప్పి చూపించి, ఆహా! ఎంత బాగుందిరా! అని హాలుని వదిలి వెళ్ళేలా చేసేరు. మంచి తెలుగు సినిమా చూడాలనుకునే వాళ్ళందరికీ నచ్చే సినిమా ఇది. ప్రత్యేకించి విశాఖపట్నంలో పుట్టి పెరిగిన వాళ్ళకైతే గుండెలకి హత్తుకుపోతుంది. దీన్నే ఇంగ్లీషువాడు నోస్టాల్జియా అంటాడేమో. అందరూ కొత్తవాళ్ళతో తీయడమే ఈ సినిమాకి బలాన్నిచ్చింది. ఎవరికీ నటించడం రాదూ, నటించలేదు కూడా. ఎవరిపాత్రలో వాళ్ళు దూరిపోయి, రోజూ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో ఎలా నడుచుకుంటారో అలాగే నడిచి, ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడి జీవించేసేరంతే.
కథంతా కంచరపాలెమూ (విశాఖపట్నంలో ఒక ప్రాంతం), చుట్టుపక్కల రెండుమూడు ప్రాంతాలలోనే నడుస్తుంది. గవర కంచర పాలెం, అందులోనే రెండు వీధులకి విస్తరించిన రామ్మూర్తి పంతులుపేట (ఆర్.పి.పేట), జ్ఞానాపురం, మాధవధార, సింహాచం గుడి. అంతే. సంత, దానికానుకునే ఉన్న దుంపల బడి, అందులో పిల్లల ఝండా వందనం, వినాయక చవితి వేడుకల తయారీ, రైల్వేగేటూ, ఇవన్నీ చూపించి, ఆ ప్రాంతంలోనే చిన్నతనం గడిచిన నా లాంటి వాళ్ళందరినీ ఎక్కడికో తీసుకెళ్ళి పోతాడు దర్శకుడు. ఇలాంటి కథ రాసుకుని అస్సలనుభవంలేని నటీనటులతో ఎంతో బాగా తీసిన ఈ సినిమా దర్శకుడికీ, అతని శక్తిసామర్ధ్యాల మీద నమ్మకముంచి ధైర్యంగా పెట్టుబడి పెట్టిన నిర్మాతకీ, విడుదల చేసిన పంపిణీదారులకీ హృదయపూర్వక అభినందనలు.

3 comments:

  1. విశాఖపట్న ప్రాంతం వారు “దుంపలబడి” అంటుంటారు. ఆ పేరెలా వచ్చింది, సుబ్రహ్మణ్యం గారూ?

    ReplyDelete
    Replies
    1. అహ్హహ్హ!మంచి భలేప్రశ్న వేసేరు సార్! నాకు జవాబు తేలీదు కానీ, కొంత ఊహించగలను. కారణం ఏంటో తెలీదు కానీ, మామూలుగా నేను చూసిన ప్రతీ కూరగాయల సంతకీ ఆనుకుని ఒక పురపాలక సంఘం వారి ప్రాథమిక పాఠశాల ఉండేది. అలా ఎందుకు పెట్టేవారో తెలీదు. అందుబాటులో సంత ఉంది కాబట్టి పిల్లలు తాజా దుంపకూరలు (చిలగడ దుంపలూ, తేగలూ, మొ), వేరుశనక్కాయలు గట్రా కొనుక్కుని తినేవారు. బహుశా అందుకే వాటిని దుంపలబళ్ళు అనేవారేమో. ఇది నా ఊహ మాత్రమే. మీకు తెలిస్తే చెప్పగలరు.

      Delete
  2. నాకు తెలియకనే కదా సర్ మిమ్మల్ని అడిగాను 🙂.

    మీరిచ్చిన వివరణ బాగానే ఉందనిపిస్తోంది, థాంక్స్. అలాగే ఆ రోజుల్లో స్కూల్ ఎదురుగా దుంపలు కాల్చి అమ్మే బళ్ళు ఏమన్నా ఉండేవా? ఆ రకంగా కూడా ఆ పేరు వచ్చుండచ్చేమో 🤔? నేను విశాఖపట్నం ప్రాంతానికి చెందినవాడిని కాను కాబట్టి నా ఊహాగానం మినహా ఏమీ ఐడియా లేదు.

    ReplyDelete