Pages

Wednesday, December 5, 2018

అలమలం అలమలం - alamalam alamalam

ఇది అలనాటి మాయాబజార్ సినిమాలో ఒక అందమైన సన్నివేశం. ఇక్కడ రచయిత పెండ్యాల నాగేంద్రరావు గారు హిడింబ చేత "అలమలం" అనిపిస్తారు. ఈ మాట విండానికి నవ్వుతెప్పించేటట్టుగా ఉండి, అదేదో అర్ధంలేని మాటగానో లేదా అర్ధంకాని ఆటవిక పదజాలం గానో పొరపడే ప్రమాదముంది. నిజానికి ఇది ఎంతో అందమైన సంస్కృతపదం. అలం అంటే సంస్కృతంలో "చాలు" అని అర్ధం. అలమలం అంటే "చాలుచాలు" అని అర్ధమన్నమాట. ఇప్పుడీ సీను మళ్లీ చూస్తే ఈ పదం ఈ సందర్భానికి ఎంతబాగా కుదిరిందో తెలుస్తుంది. ఇదే పదం శ్రీరుద్రనమకం, 8వ అనువాకంలో కూడా వినపడుతుంది.ఇలాంటి అందమైన వైదికపదాలని సినిమా ద్వారా నవ్వు తెప్పించేటట్లుగా వాడుతూ పరిచయం చేయడంలో పెండ్యాలగారు సిద్ధహస్తులు. పాతాళభైరవిలో నేపాళ మాంత్రికుడి నోట అంగన్యాసంలో చెప్పుకునే "అస్త్రాయఫట్" అని చెప్పించిన ఘనత కూడా ఈయనదే.

యథారాజా తథా ప్రజాః

మనలో చాలా మంది “యథారాజా తథా ప్రజాః” అనే నానుడి విని ఉంటాం. అయితే ఇది ఒక మంచి సంస్కృత నీతి శ్లోకంలో చివరి అర్ధభాగమని ఎంతోమందికి తెలియక పోవచ్చు. ఇదిగో మరి ఆ శ్లోకం.
రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః, పాపేపాపా-స్సమే సమాః ।
లోకాస్త మనువర్తంతే, యథారాజా తథాప్రజాః ।।
రాజు ధర్మంగా నడుచుకుంటే ప్రజలు కూడా ధర్మంగా ఉంటారు. రాజు పాపి అయితే ప్రజలూ పాపప్పనులే చేస్తారు. రాజు పాపపుణ్యాలు సమంగా చేస్తే ప్రజలూ ఆ రాజునే అనుసరిస్తారు. మొత్తానికి రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగుంటారు.

లోకపావని

కొఱవి గోపరాజు గారని ఒక మంచి కవిగారుండేవారట, కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఈయన పద్యాలు మంచి సరదాగానూ, తెలివిగానూ చెప్పేవారు. సింహాసన ద్వాత్రింశిక ఈయన రాసిన ఒక మంచి పద్యకావ్యం. త్రింశ అంటే ముప్ఫై. ద్వా అంటే రెండు. కలిపితే ద్వాత్రింశిక. అంటే ముప్ఫైరెండు. విక్రమార్కుడి సింహాసనం మీదనున్న ముప్ఫైరెండు బొమ్మలు చెప్పిన కథల్ని ఆధారంగా చేసి రాసిన కావ్యమిది.
ముందు చెప్పినట్టు ఈయన పద్యాలు కొన్ని చమత్కారంగా ఉంటే మరికొన్ని ఆలోచింప జేసేవిగా ఉంటాయి.
చమత్కారానికి ఉదాహరణ పద్యం:
ఒకనియడుగు జేరియొకని యౌదల నెక్కి
యొకని వెంట వచ్చి యొకని గలిసి
వెడలి పారితనుచు విందు మట్లయ్యునీ
జీవనంబు లోకపావనంబు.
ఔదల (ఔ + తల ) -- నడినెత్తి
గంగ విష్ణువు పాదాల దగ్గర పుట్టి, శివుడి నెత్తినెక్కి, భగీరధుడి వెనక వెళ్ళి, చివరగా సముద్రుడిలో కలిసిపోతుంది. అయినా ఆవిడ లోకపావనే కదా.
అదీ సంగతి.
(చూ. ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి)

రాజ, దీని వివాహము చేయవయ్యా!

ఒక బీద బ్రాహ్మణుడికి ఒక పెళ్ళీడుకొచ్చిన కూతురుంది. ఆ పిల్ల పెళ్ళి విషయమై సాయమడగడానికి విక్రమార్కూడి దగ్గరకొస్తాడు. రాజుని చూస్తూనే ఆయన్ని పొగుడుతూ ఈ కింది సీసపద్యం చెప్తాడాబ్రాహ్మడు. అది వినగానే రాజుకి విషయమర్థమైపోయి, ఆ పేద కవికి అవసరమైనంత డబ్బిచ్చి పంపిస్తాడు. ఆ పద్యమేంటంటే,
రాజ్యంబు వదలక రసికత్వ మెడలక -- జయశీల ముడుగక నయము చెడక
దీనుల జంపక దేశంబు నొంపక -- నిజముజ్జగింపక నేర్పు గలిగి
విప్రుల జుట్టాల నెన్ను సొచ్చినయట్టి -- వారిని గొల్చినవారి ప్రజల
హర్షంబుతో గాచి యన్యాయ -- ముడుపుచు మున్ను జెప్పినరీతి జెన్నుమీరి
చేతలొండులేక పాత్రల విడువక -- యశముకలిమి తమకు వశముగాగ
వసుధ యేలురాజవర్గంబులోనన -- య్యాదివిష్ణుమూర్తి వండ్రు నిన్ను.
పై పద్యాన్ని జాగ్రత్తగా చదువుతే తొందరగానే అర్థమవుతుంది. అయితే, దీన్లో ఉన్న ప్రత్యేకతేమిటంటే, ప్రతీ అర్థభాగంలో (తెలియడానికి -- లతో విడగొట్టేను) మొదటి అక్షరాన్ని తీసుకొని వేరే వరుసలో చదువుతే, "రాజ, దీని వివాహము చేయవయ్యా" అని వస్తుంది.
పై పద్యం పదిహేనవ శతాబ్దపు కవి కొఱవి గోపరాజు గారి సింహాసన ద్వాత్రింశిక లోనిది.
(చూ. ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి)

శ్రీదేవికి శ్రద్ధాంజలి

మానాన్న నిర్దోషని బల్లగుద్ది ఋజువుచేసి,
బూచాడమ్మా బూచాడని బడిపంతుల్నే మురిపించి,
పదహారేళ్ళ వయసులో సిరిమల్లె పువ్వుగా
విరిసి, పంటచేనులో పాలకంకిలా నవ్వి,
వేటగాడితో ఆకుచాటుపిందెగా దోబూచులాడి,
జాబిలితో చెప్తానని బెదిరించి, పరుగెత్తించి,
బుర్రిపాలెం బుల్లోడిని ఘరానాదొంగ చేసి,
కార్తీకదీపపు వెలుతుర్లో గోరింక పిలిస్తే
ముద్దుల చిలకమ్మగా ఓయని పలికి,
హిమ్మతువాలాని వెతుక్కుంటూ ఉత్తరాదికి వెళ్ళి,
విజయవై బొంబాయిలో బావుటా ఎగురవేసి,
మళ్ళీ ఆఖరిపోరాటం చేస్తూన్నవాడితోనే అబ్బ! దీని సోకు! అనిపించుకుని,
జగదేకవీరుడెవరైనా అతిలోకసుందరిని మాత్రం నేనేనంటూ,
క్షణక్షణమూ దేవుడాదేవుడా అని ఆదేవుడ్నే నవ్వించి,
గోపాలవర్మతో గోవిందగోవిందని గోవిందకొట్టించి
పదికాలాలకు సరిపడేంత ప్రేమాభిషేకం చేసివెళ్ళిన
దేవీ, శ్రీదేవీ, మౌనమా! ఇక మౌనమేనా ! 😥

కేరాఫ్ కంచరపాలెం - సమీక్ష

C/o Kancharapalem చూసేరా? బాగుంది కదూ! ఇంకా చూడలేదా! ఐతే వెంటనే వెళ్ళి చూసెయ్యండి. మిగతా తెలుగు సినిమాలలాగా గందరగోళమైన పాటలూ, తొంభై శాతం బట్లరింగ్లీషూ, మిగతా పదిశాతం మహమూద్ హిందీతో కలిసిన తెలుగుతో నాటకఫక్కీలో చెప్పే మాటలూ, ఇవేమీ లేకుండా, మామూలు మనుషులతో మన చుట్టుపక్కల జరిగే విషయాలతో కథనల్లి దాన్ని సినిమాగా చూపించేరు. ఇందులో అనవసరమైన అలౌకిక దెబ్బలాటల్లేవు. చెత్త ఇంగ్లీషుతో కలుషితమైన తెలుగు మాటలేదు. హిందీమాటలుంటాయి కానీ, అవి పాత్రోచితమైనవి. బూతుమాటలుంటాయి కానీ, అవికూడా సందర్భోచితమైనవే. వాటిని బూతులని కూడా అనలేం. అశ్లీలత లేనీ మాండలీకం అంతే. ఇంగ్లీషు, హిందీ, లేదా ఏ ఇతర పైశాచికభాషా కలిసిన పాటల్లేవు. శృతిలేని వీధి పాటలైనా వినడానికి హాయిగా ఉంటాయి. "సొట్టబుగ్గల ఓ చిన్నదీ...", "కలకత్తా కాళి, పరమగయ్యాళి, కాబోయే నా ఆలి..." అనేవి రెండు మచ్చుతునకలు. నలభై ఏళ్ళ సగటుమనిషి ప్రేమ కథా సరిత్సాగరాన్ని రెండున్నర గంటలసేపు రంగులరాట్నంలా తిప్పి చూపించి, ఆహా! ఎంత బాగుందిరా! అని హాలుని వదిలి వెళ్ళేలా చేసేరు. మంచి తెలుగు సినిమా చూడాలనుకునే వాళ్ళందరికీ నచ్చే సినిమా ఇది. ప్రత్యేకించి విశాఖపట్నంలో పుట్టి పెరిగిన వాళ్ళకైతే గుండెలకి హత్తుకుపోతుంది. దీన్నే ఇంగ్లీషువాడు నోస్టాల్జియా అంటాడేమో. అందరూ కొత్తవాళ్ళతో తీయడమే ఈ సినిమాకి బలాన్నిచ్చింది. ఎవరికీ నటించడం రాదూ, నటించలేదు కూడా. ఎవరిపాత్రలో వాళ్ళు దూరిపోయి, రోజూ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో ఎలా నడుచుకుంటారో అలాగే నడిచి, ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడి జీవించేసేరంతే.
కథంతా కంచరపాలెమూ (విశాఖపట్నంలో ఒక ప్రాంతం), చుట్టుపక్కల రెండుమూడు ప్రాంతాలలోనే నడుస్తుంది. గవర కంచర పాలెం, అందులోనే రెండు వీధులకి విస్తరించిన రామ్మూర్తి పంతులుపేట (ఆర్.పి.పేట), జ్ఞానాపురం, మాధవధార, సింహాచం గుడి. అంతే. సంత, దానికానుకునే ఉన్న దుంపల బడి, అందులో పిల్లల ఝండా వందనం, వినాయక చవితి వేడుకల తయారీ, రైల్వేగేటూ, ఇవన్నీ చూపించి, ఆ ప్రాంతంలోనే చిన్నతనం గడిచిన నా లాంటి వాళ్ళందరినీ ఎక్కడికో తీసుకెళ్ళి పోతాడు దర్శకుడు. ఇలాంటి కథ రాసుకుని అస్సలనుభవంలేని నటీనటులతో ఎంతో బాగా తీసిన ఈ సినిమా దర్శకుడికీ, అతని శక్తిసామర్ధ్యాల మీద నమ్మకముంచి ధైర్యంగా పెట్టుబడి పెట్టిన నిర్మాతకీ, విడుదల చేసిన పంపిణీదారులకీ హృదయపూర్వక అభినందనలు.

శాస్త్రిగారి కాశీ

తెలుగు సినిమా ప్రపంచానికి సుపరిచితుడైన మాటల రచయిత, దర్శకుడు, తెలుగంటే ప్రత్యేకమైన అభిమానమున్నవాడూ అయిన త్రివిక్రమ శ్రీనివాస్ (త్రివిక్రమ్) కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ఒక సభలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూ, సాహిత్య విలువలున్న పాటలకి అంతగా అవకాశం లేని ఉత్త వ్యాపారాత్మకమైన తెలుగు సినిమాలలో కూడా తన సాహిత్య భరిత కవిత్వాన్ని ఎలా ఆవిష్కరిస్తారో చెప్తూ, ఆయన్ని హైదరాబాద్ లో చార్మినార్ ప్రక్కనున్న ఇఱుకు సందుల్లో కోటి రూపాయల విలువైన పెద్ద పోర్షా కారుని వేగంగా నడపగలిగే నేర్పుగల డ్రైవరుతో పోల్చేరు. ఇది ఎంత సరైన పోలికో, సీతారామశాస్త్రిగారు ఇంద్ర సినిమాకి భం భం భోలే అని కాశీ నగరం మీద వ్రాసిన పాటని జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది.

భం భం భోలే శంఖం మ్రోగెలే, ఢం ఢం డోలే చెలరేగిందిలే,
తద్ధినకధిన్ దరువెయ్, సందడి రేగనీ, పొద్దులెరుగని పరుగై, ముందుకు సాగనీ
విలాసంగా శివానంద లహరి, మహాగంగాప్రవాహంగా మారి, విశాలక్షి సమేతంగా చేరి, వరాలిచ్చే కాశీపురి

భోళాశంకరుడైన శివుని గురించీ, ఆయన నివాసస్థానమైన కాశీ గురించీ ఆడి, పాడి, అందరినీ అలరిస్తూన్న ఒకానొక గుంపు నాయకుడు, తన తోటివారిని ఉత్తేజపరుస్తూ అంటున్నాడు, ఎలా? బ్రహ్మాండమైన ఆశుకవిత్వంతో ఇలా.

శంఖం భం భం భోలే (భోళాశంకరుడా) అని మ్రోగుతూంటే, ఢం ఢం అని డోలు కూడా చెలరేగి పోతోంది. ఇంకేం, మనంకూడా తత్-ధినక్-ధిన్ అని దరువేసి సందడి చేసేద్దాం. పగలా, రాత్రా, అని చూసుకోకుండా ఆనందంతో పరుగెడుతూ ముందుకు సాగుదాం. ఎందుకూ? ఎందుకా? అదిగో చూడండి.

శివుడు ఆనందంతో తల ఊగిస్తే, ఆయన సహస్రారం నుండి జారిన ఆనందామృతం ఒక చిన్న లహరై విలాసంగా భూమ్మీదకి జారి (జటాటవీ గల-జ్జలప్రవాహ పావితస్థలే... అంటాడు రావణాసురుడు శివతాండవస్తోత్రంలో), గంగా నదిగా మారి, ఒక మహాజలప్రవాహంగా, విశాలాక్షి అమ్మవారి సమేతంగా అందరికీ వరాలిచ్చే కాశీపురం చేరింది. అందుకు.

వారణాసిని వర్ణించే నా గీతిక, నాటి శ్రీనాథుని కవితే వినిపించగా

నా ఈ ముచ్చటైన పాట వారణాసిని (ఉత్తరాది వాళ్ళు వారాణసి అంటే, మన తెలుగువాళ్ళం వారణాసి అంటాం. ఏదైన కాశీయే) వర్ణించిన అలనాటి శ్రీనాథుని అద్భుత కావ్యం కాశీఖండాన్ని గుర్తు చేయుగాక.

ముక్తికే మార్గం చూపే మణికర్ణిక, అల్లదే అందీ నా ఈ చిరుఘంటికా

ఇంకా ఏమంటోందీ, నా ఈ చిన్న ఘంటిక (కలం. పెన్ను) ? "అదిగో చూసేరా? అదే మణికర్ణికాఘట్టం" అంటోంది. ఏంటి ఆ మణికర్ణిక ప్రత్యేకత అంటారా? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఈ గట్టుమీద కాని దహనం చేయబడితే మరో జన్మ ఎత్తే అవసరమే లేదుట. తిన్నగా మోక్షమే మరి.

నమకచమకాలై ఎదలయలే కీర్తన చేయగా, యమకగమకాలై పదగతులే నర్తన చేయగా.. ప్రతీ అడుగూ, తరిస్తోంది, ప్రదక్షిణగా

లయగా కొట్టుకునే మన గుండె చప్పుళ్ళే నమకమూ చమకమూ (స్తోత్ర, ప్రార్ధనలు) అయి ఆ రుద్రుణ్ణి కీర్తిస్తుండగా, వాటికి మన ఈ పదగతులు యమకగమకాలుగా (ప్రక్కవాయిద్యాలు అనుకోండి) తోడై నర్తన చేస్తూండగా, మనం ప్రదక్షిణగా వేస్తూన్న ప్రతీ అడుగూ తరిస్తోంది మరి.

..........................................................

ఎదురయే శిలఏదైనా శివలింగమే, మన్నుకాదు మహాదేవుని వరదానమే

కాశీలో "కంకర్ కంకర్ మేఁ శంకర్ హైఁ" అని ఒక నానుడి ఉంది. అంటే, "కాశీలో కనిపించే ప్రతీ చిన్న రాయిలో కూడా శంకరుడుంటాడు" అని. అదే అంటున్నాడు కవి ఇక్కడ. ఎదురయే ఏ రాయైనా శివలింగమే. అలాగే, ఇక్కడి మట్టి కూడా ఆ శివుడి వరదానమే. ఎలాగంటారా! మరి ఆయన ఆనందంగా తలాడించబట్టే కదా, గంగ మహానదిగా ప్రవహించింది? మరి ఆ నది ప్రవహించబట్టే కదా ఒండ్రుమట్టి వచ్చి చేరింది? మరి ఆ మన్నే కదా మనమిక్కడ చూసేది. అలాగ.

చిరంజీవిగా నిలచింది ఈ నగరమే, చరితలకు అందనిది ఈ కైలాసమే

కాశీ చరిత్ర తెలిసిన వారెవరైనా ఇది అనాదిగా ఉన్న నగరమనీ, ఎవరు ఎన్నో రకాలుగా ఎన్నిసార్లు ధ్వంసం చేసినా, మళ్ళీ పూర్వ వైభవంతో లేచి నిలబడుతోందనీ ఒప్పుకుంటారు. ఏడవ శతాబ్దపు చైనా యాత్రీకుడు హుయన్‌త్సాంగ్ ఈ ఊరిని ఒక మహానగరంగా వర్ణించేడు. భారతదేశం మీద పడ్డ ప్రతీ తురకతండా ఈ నగరాన్ని, విశ్వనాథుడి ఆలయాన్నీ ఏదో ఒక రకంగా ధ్వంసం చేసినవాళ్ళే. అయితే ఈ ఆలయాన్ని ఎన్నిసార్లు కూలగొట్టినా మళ్ళీ తిరగకడుతున్నారనే అక్కసుతో దాన్ని పూర్తిగా నాశనం చెయ్యడమేగాక మళ్ళీ పునరుద్ధరించడానికి వీలులేదని ఆంక్ష పెట్టేడు సికందర్ లోఢి అనే ఒక తురక 1494లో. అయినా పూర్వవైభవం సంతరించుకుని మళ్ళీ నిలబడిందీ గుడి 1569లో. ఒక వందేళ్ళ తర్వాత ఔరంగజేబని మరో తురకొచ్చేడు. వాడేం చేసేడూ? దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసేసి దాని స్థానంలో ఒక మసీదు కట్టించేసేడు. కానీ క్షేత్రమహిమనెవరు తగ్గించగలరు? ఏభైయేళ్ళు తిరక్కుండానే, ఆ మసీదు పక్కనే మళ్ళీ విశ్వనాథుడి గుడి కట్టించింది రాణి అహల్యాబాయ్. మరి ఇలాంటి ఊరినీ, అక్కడ ఉన్న ఆలయాన్నీ చిరంజీవి అని అనకుండా ఎలా ఉండగలం?

గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే, గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే, తరలి రండి, తెలుసుకోండి కాశిమహిమ

గంగానది గట్టుమీద నడుస్తూంటే, ఆగకుండా వినిపిస్తూంటుంది ఓంకారనాదం. ప్రశాంతమైన గంగాప్రవాహం మరి ఆ శివుడి కారుణ్యమే కదా. మరింకేం? బయల్దేరండి కాశీకి. వెళ్ళి తెలుసుకోండి ఆ క్షేత్రమహత్మ్యాన్ని.

ఒక పుణ్యతీర్థం గురించి ఇంత గొప్పగా ఎవరు చెప్పగలరండీ, ఒక్క సీతారామశాస్త్రిగారు తప్ప? అసలు ఈ పాట గురించి యోగి ఆదిత్యనాథ్ కో , లేక నరేంద్రమోదీకో తెలిస్తే, వాళ్ళు వెంటనే శాస్త్రిగారిని కాశీకి బ్రాండ్ ఎంబాసడర్ గా పెట్టేసుకుంటారు. శాస్త్రిగారికి శిరసా అభివందనాలు. 

Sunday, December 2, 2018

వేదవిద్యార్థులకి విన్నపం

అవలోకనమంటే చూడడం. ప్రత్యేకించి వెనక్కి లేదా క్రిందకి చూడ్డం.  దీనికి వ్యతిరేక పదం ఆలోకనం. అంటే ముందుచూపన్నమాట. సింహం తనదారిలో నడుస్తూ మధ్యలో ఆగి ఒక్కసారి అలా వెనక్కి చూస్తుంది. తనకి సంబంధించని వాళ్ళెవరైనా తనని రహస్యంగా అనుసరిస్తున్నారా, తనువెళ్లే దారి సరైనదేనా, ఇలాటి కారణాలవల్ల. అలాగే మనుష్యులు కూడా తామేదైనా చదవడమో , వ్రాయడమో, బొమ్మ గీయడమో, శిల్పం చెక్కడమో, లేదా ఇంకేదైనా పని చేసేటప్పుడో మధ్య మధ్యలో తాము చేసే పని ఎంతవరకూ అయిందో, అసలు సరిగా అవుతోందో లేదో అని తేఱిపాఱా చూసుకుంటారు. సింహంలాగే. దీన్నే సింహావలోకనమంటారు. ఉపమానం. అసలలా వెనక్కి తిరిగి చూసుకోక పోతే ఆ చేస్తున్నపని సరిగా అవదుకూడా.

ఈ సింహావలోకనమనేది పాతికేళ్ళు దాటిన పెద్దవాళ్ళు వేదపఠనం, స్తోత్రపాఠం లాంటివి నేర్చుకోవడం మొదలుపెడితే వాళ్ళకి కూడా చాలా అవసరం. క్రమశిక్షణా, మరియూ శుచీ పాటిస్తూ నేర్చుకూంటున్నామా, నేర్చుకున్న పాఠం స్వరబద్ధంగా చదవగల్గుతున్నామా, శబ్దాలని వక్రీకరణ చెయ్యట్లేదు కదా ! ఒత్తులూ, దీర్ఘలూ పెట్టవలసిన చోట పెట్టకుండా, పెట్టకూడని చోట పెట్టీ, చదువుతున్న మంత్ర, శ్లోకాల అర్థాలు మార్చేయట్లేదు కదా! ద్విత్త్వాక్షరాలు సరిగానే పలుకుతున్నామా?  స్వరిత దీర్ఘస్వరితాలూ, ఉదాత్తానుదాత్తాలు చూసుకునే కదా స్వరాలు పలుకుతున్నాం ! ఇలాంటి విషయాలన్నమాట.

అయితే దోషాల్లేకుండా చదువుతున్నామో లేదో మనందరికీ తెలియదు, తెలిసినా తప్పులొప్పుకుని సరిదిద్దుకోడానికి అహం అంగీకరించదు. ఉదాహరణకి చాలామంది లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణుసహస్రనామ స్తోత్రం చదువుతారు. ఎంతో వేగం గానూ, ఎన్నో ఉచ్ఛారణ దోషాలతోనూ. "ఏవండీ, మీరు సరిగ్గా చదవట్లేదు, తప్పులు దొర్లుతున్నాయి" అని చెప్పడానికి ఎవరూ సాహసించరు. ఎవరైనా చెప్పినా ఇవతల వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం కూడా. అదే ఈ స్తోత్రాల గురించి తెలిసిన వాళ్ళెవరి దగ్గరైనా పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఉచ్ఛారణ దోషాలతోనూ, అపస్వరాలతోనూ చదవకుండా ఉండే అవకాశముంటుంది. అదేకాకుండా మనం ఇంతవరకూ నేర్చుకున్నది ఆ గురువు దగ్గరే ప్రదర్శించి చేస్తూన్న తప్పులూ సరిదిద్దుకోవచ్చు. స్తోత్రాల విషయంలో అయితే తప్పులు దిద్దుకోవడం సులువు. అదే వేదమంత్రాల విషయంలో ఒక్కసారి తప్పుగా చదవడం అలవాటైతే మళ్ళీ సరైన దార్లో పడడం చాలా కష్టంతో కూడుకున్న పని. వేదం నేర్చుకోవడానికి ముందు తెలుసుకోవలసిన విషయాలు కొన్నుంటాయి. ముందు సరైన ఉచ్ఛారణ ఉండాలి. ఉదాత్తానుదాత్తాలూ, స్వరితాలూ తెలుసుకోవాలి. శబ్దోచ్ఛారణలో ఏ అక్షరానికి ఎన్ని మాత్రల సమయం వినియోగించాలో నేర్చుకోవాలి. ఛందస్సులెన్నో, అవి ఏంటేంటో, ఒక్కొక్క ఛందస్సుకీ ఎన్ని అక్షరాలుంటాయో అర్థం చేసుకోవాలి. వీటన్నింటికీ మించి శుచి, క్రమశిక్షణ అవసరం. ఇవన్నీ కుదురుతే, అప్పుడు, మంత్రాలూ, సూక్తాలూ, నమక చమకాలూ నేర్చుకోవడం.

పూర్వకాలంలో వేదవిద్య గురుకులాల్లోనూ, ప్రత్యేకమైన వేద పాఠశాలల్లోనూ మాత్రమే నేర్పించేవారు. అయితే ప్రస్తుత కాలంలో గురుకులాలు అంతరించి పోయాయి. వేదపాఠశాలలు అక్కడక్కడ కొన ఊపిరితో కొట్టాడుతున్నాయి. ఇలాంటి వైదిక శిక్షణా కేంద్రాలలో విద్యార్థుల్ని ఏడెనిమిది సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగిన తర్వాత చేర్చుకునేవారు. వాళ్ళకి ముందు ఉచ్ఛారణ నేర్పించాలనే ఉద్దేశ్యంతో శబ్దమంజరి, అమరకోశం, చిన్న చిన్న వేదమంత్రాలు, నీతిశ్లోకాలు, మొదలైనవి భట్టీయం (బట్టీ పట్టించడం, లేదా ప్రస్తుత భాషలో పిడి కొట్టించడం) వేయించి, కంఠస్థం అయ్యేలా చేసేవారు. ఆ తర్వాత వయసుతో పాటు మానసిక పరిపక్వత పెరుగుతూ ఉంటే అంతవరకూ నేర్చుకున్న వాటిని విపులీకరించడం, వ్యాకరణ సూత్రాలకర్థం చెప్పడం, మొదలైనవి జరిగేవి.ఈ క్రమంలో శాస్త్రాలు, వేదాలు సాంగోపాంగంగా ఉపనిషదర్థాలతో సహా నేర్పేవారు.

అయితే ఇప్పుడు జరిగేది వయోజన వేదవిద్య. మనమంతా అంతో ఇంతో చదువుకుని ఏదో ఒక ఉద్యోగం చేసుకుని పొట్ట పోసుకుంటూ ఎవరైనా నేర్పించే వాళ్ళుంటే వేదమంత్రాలు నేర్చుకోవాలనీ, మంత్రపుష్పమో, పురుషసూక్తమో, లేకపోతే సూటిగా రుద్రమే నేర్చేసుకుందామని ఉబలాటపడిపోతూంటాం. అమెరికాలాంటి విదేశాలలో ఉండేవాళ్ళకి పద్ధతిగా వేదం నేర్పించే వాళ్ళు దొరకడం అంత సులభం కాదు. చికాగో, ఫొయినిక్స్, లాస్ ఏంజెల్స్ లాంటి పెద్ద ఊళ్ళలో వేద పాఠశాలలూ, శిక్షణా కేంద్రాలూ ఉన్నా, అన్నిచోట్లా ఇలాంటి సౌకర్యముండదు. ఎవరో ఆముదం చెట్టులా ఆ మాత్రం తెలిసిన వాళ్ళుంటారు. అయితే ఇలాంటి వాళ్ళు సనాతన ధర్మానికీ, వేదమాతకీ చేస్తూన్న హాని అంతా ఇంతా కాదు. వీళ్ళలో కొంతమందికి కచటతపలకీ గజడదబలకీ తేడా తెలీదు. కొంతమంది స్వరాలింటి దగ్గర మర్చిపోతారు. కొంతమందికి లింగ వచన విభక్తులంటే తెలియదు. కొంతమంది ఛందస్సంటే కస్సంటారు. ఇలాంటి భాషా జ్ఞానం, స్వరజ్ఞానం లోపించిన వాళ్ళు తప్పుడు పద్ధతిలో పదిమందికి నేర్పేస్తూ ఉంటే, వాళ్ళు ఒక్కొక్కళ్ళూ చెరో పదేసిమందికి నేర్పించేస్తున్నారు. వేల సంవత్సరాలనుంచీ పరంపరగా వస్తూన్న వైదిక శిక్షణా పద్ధతులిలా భ్రష్టు పట్టిపోవడం బాధాకరమైన విషయమే.

ఈ మధ్య ఇంకొక ఘోరం చూడాల్సొచ్చింది. ఒకాయననున్నాడు. 25 - 35 ఏళ్ళ వయసుంటుంది. ఇంకా పెళ్ళి కూడా కాలేదు. ఆంజనేయ భక్తుడు. గంటల తరబడి పాడగలడు. మంచి గొంతు, లయజ్ఞానం ఉన్నాయి. కంజీర, గొట్టువాద్యం చాలా బాగా వాయిస్తాడు. హనుమాన్ చాలీసా, రామదాసు కీర్తనలూ, త్యాగరాయ కీర్తనలూ, కంఠస్థం. మంచి శిష్యగణం కూడా ఉంది. ఊళ్ళో ప్రజల ఇళ్ళల్లో హనుమాన్ భజనలూ అవీ చేస్తాడు. చాలా మంచివాడు కూడా. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే, ఆయన వేదం ఎవరి దగ్గరా పద్ధతి ప్రకారం నేర్చుకున్నట్టనిపించదు. అయినా సూక్తాలూ, నమకమూ చమకమూ అతనిష్టం వచ్చినట్టు స్వరం మార్చీ, శబ్దాలు మార్చీ చదివేస్తాడు, పైగా అదే పద్ధతిలో శిష్యులకి నేర్పించేస్తాడు కూడా. ఇదంతా సరిపోకుండా జనం ఇళ్ళల్లో హనుమంతుడికి అభిషేకాలు చేయిస్తాడు. హనుమంతుడు భజనప్రియుడే. ఆయనకి భజన ఎలా అయినా చెయ్యొచ్చు. కానీ అభిషేకం అంటే వేరు కదా. దానికి ఒక పద్ధతీ, ఒక మర్యాదా ఉంటాయి. వేదప్రోక్తంగా, ఎంతో నిష్ఠగా ఇంటి యజమాని, అతని భార్య చేతా చేయించాల్సింది. అంతేకానీ రామదాసు కీర్తనలనిష్టం వచ్చిన వరసలో పాడేస్తూ, డప్పు వాయిస్తూ, చూడ్డానికొచ్చిన వాళ్ళు శుచిగా ఉన్నారో లేదో, అసలు స్నానం కూడా చేసేరో లేదో తెలుసుకోకుండా ఆంజనేయుడి మూర్తికి పంచామృతాలతోనూ, పానీయాలతోనూ అభిషేకం చేయించేయడం ఎంతవరకూ సబబో ఆయనకే తెలియాలి. ఇంక అది సరిపోక నమక చమకాలతో కూడా అభిషేకం మొదలుపెట్టేడు. కానీ స్వరయుక్తంగా చదవాలనే విషయాన్ని విస్మరించేడు. ఆశయం మంచిదే. ఆచరణ విషయంలోనే కొంచెం తప్పు జరుగుతోందనిపిస్తుంది.

విషయానికొస్తే, వైదిక, ధార్మిక విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళూ, వేదమంత్రాలు చదవడం నేర్చుకోవాలనుకునే వాళ్ళూ, కొన్ని విషయాలు పాటిస్తే బాగుంటుంది. నేర్చుకోవాలనే ఆత్రుతలో ఎవర్ని పడితే వాళ్ళని ఆశ్రయించకండి. మీ పిల్లల్ని కేజీ స్కూల్లో వేసేముందు, ఆ బడి గురించీ, టీచర్ల గురించీ విచారిస్తారా లేదా? ఏదైనా యూనివర్సిటీలోనో లేదా కమ్యూనిటీ కాలేజ్ లోనో కోర్స్ రిజిస్టర్ చేసుకునే ముందు ఆ ఇన్స్ట్రక్టర్ ఎలాంటివాడో తెలుసుకుంటామా లేదా? అలాగే, వేదం నేర్పించే గురువు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీరు నేర్చుకున్నదంతా అపస్వరాలతోనూ, వ్యాకరణదోషాలతోనూ నిండి ఉండే ప్రమాదం ఉంటుంది.  అలా నేర్చుకున్నది ఏ గుళ్ళోనో, లేదా ఇంకెవరి సమక్షంలోనో శ్రవణం చేస్తే, వినేవాళ్ళకి అంతో ఇంతో వేదం తెలుస్తే, వాళ్ళకి మీ దోషభూయిష్టమైన వేదఘోష విని కడుపులో దేవినట్టవుతుంది. అది మీకూ, వాళ్ళకీ ఇద్దరికీ మంచిది కాదు.

అదే ఒక మంచి గురువుగారి దగ్గర నేర్చుకోవడం మొదలుపెట్టేరనుకోండి. ఆయన మీకు ఒక పద్ధతిలో నేర్పిస్తారు. ఉచ్ఛారణ, స్వరం, భాష, భావన ఇలా అన్నీ బాగుంటాయి. అయితే అందరు గురువులకీ అన్నీ తెలియాలని లేదు. వాళ్ళకి తెలియని విషయాలని మాటిమాటికీ అడిగి వాళ్ళనిబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది. కాని నేర్చుకున్న వేదమంత్రాలకి వీలయినంతవరకూ అర్థం తెలుసునే ప్రయత్నం చేస్తే మంచిది. వేదాలకర్థం తెలియడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. విశాల భారతంలో వేదపండితులూ, భాష్యకారులూ చాలామందే ఉన్నారు. వాళ్ళనీ, వాళ్ళు వ్రాసిన భాష్యగ్రంథాల్నీ శోధించి సాధించాలి.

సంస్కృతభాష నేర్చుకోండి. అంతే. దీనికి ప్రత్యామ్నాయం లేదు. భాష తెలియకపోతే భావమర్థమవదు. అర్థం కాని చదువు వ్యర్థం అని తెలుగు సామెత. అలాగే సంస్కృతంలో ఒక మంచి సుభాషితముంది.

యథా ఖరశ్చందనభారవాహీ, భారస్య వేత్తా న తు చందనస్య
ఏవం హి శాస్త్రాణి బహు న్యధీత్య, చార్థేషు మూఢా: ఖరద్వహంతి

అర్థమేంటంటే, మంచిగంధం చెక్కలు మోసుకెళ్ళే గాడిదకి ఆ చెక్కల బరువైతే తెలుస్తుంది కానీ, ఆ గంధ పరిమళం మాత్రం తెలియదు. అలాగే ఎన్నో శాస్త్రాలు చదివినవాళ్ళు కూడా అర్థం తెలియకపోతే అలాంటి గాడిదతో సమానం.

పైన చెప్పిన విషయాన్నే, లలితాసహస్రనామస్తోత్రానికి భాష్యం వ్రాసిన ప్రసిద్ధ పండితులైన భాస్కరాచార్యులు గారు ఆయన వ్రాసిన "శ్రీ వరివస్యా రహస్యం" అనే గ్రంథంలో 54, 55 శ్లోకాలలో ఈ క్రింది విధంగా అంటారు.

    నా2ర్థజ్ఞానవిహీనం శబ్దస్యోచ్ఛారణం ఫలతి |
    భస్మని వహ్నివిహీనే, నప్రక్షిప్తం హవిర్జలతి || 54 ||      

    అర్థమాజానానానాం, నానావిధ శబ్దమాత్ర పాఠవతాం |
    ఉపమేయశ్చక్రీవానా, మలయజ భారస్య వోఢైవ || 55 ||

అర్థం

54. అర్థం తెలియని వారికి వాళ్ళు చేసే శబ్దోచ్ఛారణ ఫలించదు.
బూడిదలో హవిస్సు కలిపితే అగ్ని జ్వలించదు కదా!

55. అర్థం తెలియకుండా రకరకాల శబ్దాల్ని మాత్రం పఠించేవాళ్ళు గంధపుచెక్కలు మోసే గాడిదతో పోల్చదగినవారు.

ఒక్క విషయం. వేదమంత్రాలకర్థం గూగుల్ లో మాత్రం వెతకొద్దండి. గూగుల్ అన్ని విషయాలలో మేలు చేసినా సనాతన ధార్మిక విషయాలలో మాత్రం అది చేసే కీడే ఎక్కువ.

ఒక శ్లోకం గానీ, సూక్తంగానీ, మాట గానీ, మంత్రం గానీ, ఏదైనా సరే, మీకు "క్షుణ్ణంగా" తెలియక పోతే ఇంకొకరికి నేర్పించవద్దు. దీనివల్ల మీరు వాళ్ళకి మేలు చేయకపోగా, కీడు మాత్రం చాలా చేస్తున్నారు.

సెలవు.

Saturday, March 31, 2018

పుస్తకం వనితా విత్తం -- Pustakam Vanitha Vittam

పుస్తకం వనితా విత్తం, పరహస్తగతం గతం |
అథవా పునరాయాతి, జీర్ణం భ్రష్టా చ ఖణ్డశః ||

పుస్తకం, ఆడమనిషి, డబ్బు. ఇవి మూడూ ఒకసారి చేతులు మారితే మళ్ళీ రావు. ఒకవేళ వచ్చినా, పుస్తకమైతే చిరిగిపోయో, ముడతలు పడిపోయో, అనేకరకాలుగా జీర్ణమైపోయి వస్తుంది. మరి ఆడపిల్లైతే భ్రష్టు పట్టి వస్తుంది. ఇది ప్రస్తుత కాలానికి పూర్తిగా వర్తించదు. పాతరోజుల్లో కన్యాదానం చేసిన తర్వాత అమ్మాయి ఇంటి పేరు మారి అత్తారింటికెళ్ళిపోయేది. మళ్ళీ పుట్టింటికి చుట్టపుచూపుగా రావడం తప్ప శాశ్వతంగా వచ్చేసిందంటే ఏదో తీరని నష్టం వచ్చి దిక్కు లేకుండా పోయినట్టే. దాన్నే భ్రష్టు పట్టిపోవడఁవంటారు. ఇక ఆఖరిదైన డబ్బు. ఎవరైనా అవసరంలో ఉన్నారని ఒక లక్షో ఎంతో చేబదులుగా ఇచ్చేవఁనుకోండి. అదీ మళ్ళీ వస్తే వింతే. ఒకవేళ వచ్చినా ఒకసారి వంద, ఒకసారి  వెయ్యీ గా వస్తుంది తప్పితే, ఇచ్చేటప్పుడు చెప్పిన విధంగా అంత మొత్తమూ ఒకేసారి ఒకే సమయానికందదు.    

Saturday, March 3, 2018

గరికపాటి నరసింహారావు - ప్రసంగ సమీక్ష

ఒక అవధానికీ, ప్రవచనకర్తకీ చాలా తేడా ఉంటుంది. అవధానిగారు వేదికనెక్కి ఆయన ప్రజ్ఞనీ, ధారణ శక్తినీ బాగా ప్రదర్శిస్తూంటే పదిమందీ బాగుందనుకుంటారు. అప్పుడు ఆ పండితుడు చేసేది కేవలం కళాత్మకమైన భాషానైపుణ్య ప్రదర్శనమే తప్ప సమాజం, సంస్కృతి, దైవం, వేదాంతం మొదలైన విషయాల మీద ప్రసంగించటంగానీ (విషయాల్ని విడమర్చి చెప్పడం) ప్రవచించడంగానీ (మంచిమాట) చేయటం లేదు. ఇలాంటి అవధానం చేసే సందర్భంలో సభకి వచ్చినవారిని నవ్వించడానికి వినోదాత్మకమైన చతురోక్తులాడడమూ, మరీ ఇరకాటంలో పెడుతున్న ఒకరో ఇద్దరో పృచ్ఛకుల్నుద్దేశించి వెగటు పుట్టించనివీ, వెకిలిగా అనిపించనివీ అయిన నాలుగు ఛలోక్తులు విసరడమూ మామూలే. బాగుంటుంది కూడా.

అయితే, భాషా సంస్కృతుల విషయాల గురించి మాట్లాడడానికో, విద్యాసంస్థల స్నాతకోత్సవాలలో (graduation ceremonies) ప్రధాన వక్త (keynote speaker) గానో, లేదా ధార్మిక విషయాల ప్రవచనకర్తగానో, వేదికనెక్కినప్పుడు ఆ మనిషికి ఒక ప్రత్యేక గౌరవమివ్వబడుతుంది. గురుస్థానంలో ఉన్న అటువంటి వ్యక్తి, ఆనాడాసభకొచ్చిన వాళ్ళని ప్రత్యక్షంగానూ, ఆ రోజు ప్రసంగాన్ని కొంతకాలం తర్వాత టీవీ, వీడియో, యూట్యూబ్ లాంటి ప్రసార మాధ్యమాలలో చూసేవారిని పరోక్షంగానూ ప్రభావితం చేసే అవకాశముంటుంది. అందువల్ల ఇలాంటి "గురువు" గారిమీద "మంచివిషయాలు" మాత్రమే చెప్పే గురుతరమైన బాధ్యత ఉంటుంది. నో ఇతరాణి. అంటే మంచిమాటలు కానివీ, ద్వంద్వార్థాల మాటలూ, వివాదాస్పదమైన విషయాలూ చెప్పడమూ, ఎవరినీ వారివారి ఆకారవికారాలూ, కుటుంబ పరిస్థితులూ, ముసలి వయస్సూ, మొదలైన వాటి విషయాలపై కించపరిచేలా మాట్లాడడమూ చాలా పెద్ద తప్పు. అలాచేసే వాళ్ళు మళ్ళీ అలాంటి వేదికలెక్కి మాట్లాడడం మానుకుంటే బాగుంటుంది.

ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే, గత కొంత కాలంగా గరికపాటి నరసింహారావు గారి అవధానాలూ, ప్రవచనాలూ, ప్రసంగాలూ, టీవీ, యూట్యూబుల్లో చూసి, మంచి విషయాలు చెప్తుంటే బాగుందని సంతోషించి, అంత మంచివి కానివి చెప్పినప్పుడు, "అయ్యో ఇంత పెద్దాయన ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడూ ప్చ్" అనుకుని,  మరీ చెత్తగా, పదిమంది నవమానం చేస్తూ మాట్లాడినప్పుడు బాగా కోపం వచ్చి జమకూడిన ఆలోచనల్ని పదిమందితో పంచుకోడానికి. చెప్పాలంటే నరసింహారావుగారు సంస్కృతాంధ్ర భాషాసాహిత్యాలపైనా, ధార్మిక, లౌకిక విషయాలపైనా, మంచి పట్టున్నవారు. ఏ విషయం గురించైనా అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యమున్నవారు. ఐతే, చంద్రుడికో చిన్న మచ్చ ఉన్నట్టు, ఈయనక్కూడా ఒక మచ్చ ఉంది. అది రోజురోజుకీ పెద్దదైపోతోంది. పెద్దదైపోతూ, అతని విద్వత్, పాండిత్యాలపై అభిమానమూ గౌరవమూ ఉన్నవాళ్ళని అతని నుంచి దూరం చేస్తున్నాయి. ఎలాగో చూద్దాం. గరికపాటివారు ఏదైనా మంచి విషయం  గురించి చెప్పే సందర్భంలో బోలెడు లౌకికవిషయాలని గుర్తు చేస్తారు. మంచిదే. అలాచేస్తే, చెప్పవలసిన అసలు విషయం బాగా బోధపడుతుంది. అయితే, ఇలాటి సంగతులు చెప్పేటప్పుడు, జనాన్ని నవ్వించాలనో, లేక సంవత్సరాల తరబడి చేస్తూన్న అవధానాల వల్ల అలవాటైన (దుర్)లక్షణమో తెలీదుగానీ, అంతో ఇంతో పేరుగలవారినో, లేదా ఏదో ఒక సామాజిక వర్గానికి చెందిన వారినో, హద్దుకి మించి విమర్శించడం, అవహేళన చేయడం చేస్తారు. ఇలాటి శృతిమించిన ప్రేలాపన అప్పటికి కొంతమందికి నవ్వు తెప్పించొచ్చు. కానీ, లోతుగా ఆలోచిస్తే, నరసింహారావుగారి లాంటి విద్వద్వర్యులూ, గురుతుల్యులూ మాట్లాడవలసిన పద్ధతేనా ఇది అనిపిస్తుంది. ఒకసారి మంథెన సత్యనారాయణగారైతే, ఇంకొకసారి చాగంటి కోటేశ్వరరావుగారు. ఒక సందర్భంలో పిల్లలు దూరప్రదేశాలకో, ఇంకా దూరమైన విదేశాలకో వెళ్ళిపోతే, తమంత తాము స్వతంత్రంగా బ్రతుకుతున్న తలిదండ్రుల మీద. ఒక ప్రసంగంలో హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద ఊళ్ళల్లో కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతూన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులమీదైతే, ఇంకొక సభలో పొట్టపోసుకోవడానికి విదేశాలకి వెళ్ళి అక్కడే స్థిరపడిన ప్రవాసాంధ్రుల పైన. ఈయన వెటకారానికి హద్దులేదు. ఈయన విమర్శలకి ఎవరైనా బలే. పదిమందిని నవ్వించడానికి వేరే పదిమందిని అవమానించినా ఫరవాలేదు. ఇదే ఆయన సిద్ధాంతమనిపిస్తుంది.

https://www.youtube.com/watch?v=4KNr4S4f-uY&t=135s

చిన్న ఉదాహరణ. పై వీడియో చూడండి. సంస్కృతి మీద స్వదేశీ జాగరణ మంచ్ వారి వేదికపై రావుగారు చేసిన ప్రసంగమిది. ఇది సుమారు ఇరవై ఒకటిన్నర నిమిషాలుంటుంది. అంతసేపూ కూడా ఎవర్నో పొడుస్తూన్నట్టుందే తప్ప ఏదైనా మంచి విషయం చెప్పినట్లని వినిపించదు. ఒకవేళ చెప్పినా ఆయన చేసే వెటకారపు దుర్గంధంలో మంచి కొట్టుకుపోయింది.

1. వీడియో మొదలు: అసలు మన సంస్కృతి గూర్చి గొప్పగా చెప్పాలంటే ఇంకొకరి సంస్కృతిని దూషించాలా, తప్పదా? అలా చేయడం, ఎక్కడ్నుంచో వచ్చి, సనాతనధర్మం గూర్చి కొంతవరకూ తెలుసుకుని అందులో (బయటనుంచి) తప్పుగా అనిపించిన ధర్మసూత్రాల్నీ, నియమాల్నీ ఎత్తి చూపించి, కొంతమంది అమాయకుల్ని మోసగించి వారికి తమ మతం అంటగట్టిన సూఫీలదీ, మిషనరీలదీ కదా. మన అలవాటుకాదే. అయినా తెలీక అడుగుతాను. వ్యాపారం చేయడం తప్పా? హోటల్ కట్టి వ్యాపారం చేసేవాడు పాపాత్ముడూ, గుడికట్టే వాడు పుణ్యాత్ముడానా. ఇదెక్కడి వాదన. హోటల్ కట్టి పదిమందికి బ్రతుకుతెరువు చూపెడుతున్నాడు కదా ? అయినా ఈ విషయం నిజంగా వివేకానందస్వామి చెప్పినదేనా? అదెక్కడ వ్రాసేరో కొంచెం చెప్తారా, చదువుకుంటాను? నాకు తెలిసినంత వరకూ స్వామి చికాగోలో సనాతన ధర్మాన్ని పశ్చిమానికి పరిచయం చేశారేగానీ, పరమతాల్ని చులకన చేయలేదు. అలాచేస్తే ఆయన స్వామి అవరు.

2. 1:55 మార్కరు నుండీ పదిహేను క్షణాలపాటు, ఆయన తూర్పు దిక్కు పడమర కంటే ఎంత గొప్పదో చెప్తున్నారు. నిజమా ? దిక్కులలో ఉచ్ఛనీచాలున్నాయా? మరి తూర్పు సంధ్య, పడమటి సంధ్య అని రెండింటినీ ఎంతో పవిత్రంగా చూస్తాం ? తూర్పువైపు తిరిగి తత్పురుషరూపలో ఉన్న శివుడ్ని పూజిస్తే, పడమరవైపు సద్యోజాత రూపంలో ఉన్న అదే శివుడ్ని పూజిస్తున్నాం ?
మనకి పడమర ఉన్నవారు మనకన్నా హీనులైతే, మనకి తూర్పున ఉన్నవారికన్నా మనం హీనులమా? ఎందుకండీ, లేని వైషమ్యాల్ని చూపించి దిక్కులకి దోషాలు అంటగడతారు?

3. 2:08 మార్కరు : ఎవరికైనా ఎనభయ్యేళ్ళు దాటేయంటే వాళ్ళు స్విచ్చాపేసిన సీలింగ్‌ఫ్యాన్ లాంటి వాళ్ళట. సభలో అనవలసిన మాటేనా ఇది? అదీ గురుస్థానంలో ఉన్న ఒక విద్వాంసుడు. అతనేదో మంచి చెప్తారనే నమ్మకంతో వయసు పైబడిన వృద్ధులెవరైనా ఆయన ప్రసంగం వింటే? లేదా ముసలివారైన తలిదండ్రులున్న వాళ్ళెవరైనా వింటే? అయినా ఏ వయసువార్నైనా ఇంక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండండి అనొచ్చా? చచ్చిపోవడానికి ఏ వయసైతేనేంటి? తప్పు రావుగారూ!

4. 6:08 మార్కరు : కళేబరమంటే శవమా ? నిజమే? మరి మూలకూటత్రయ కళేబరా, అని లలితా సహస్రనామాలలో చెప్పుకుంటాం? కళేబరానికి శరీరము, మేను అని చెప్పేరే గానీ ప్రాణం లేని శరీరము, శవము అని చెప్పలేదే నిఘంటువులో?  గీర్వాణం తెలిసిన గరికపాటి గారు ఏం చెప్తే అదే నిజమనుకుంటారు కదా జనం. తెలుగు పంతులు తప్పు చెప్పొచ్చా?

5. 8:06 మార్కరు : ఇంక ఇక్కడ్నించీ అమెరికా మీద, అమెరికా వలసవెళ్ళిన తెలుగువారిమీద విరుచుకుపడి విశ్వరూపం చూపిస్తారు గురువుగారు. ఇక్కడ అన్నం దొరకదా, అమెరికా వెళ్ళాలా అని అడుగుతున్నారు. ఉద్యోగరీత్యానో, బ్రతుకుతెరువు కోసమో, వేరే కారణాలవల్లో వేర్వేరు దేశాలకీ, ప్రదేశాలకీ వలస వెళతారు మనుషులు. మరి అన్నం దొరక్కేనా గోదావరొదిలి హైదరాబాదులో మకాం పెట్టేరు గరికపాటి వారు ?

పదహారు సార్లు అమెరికా వెళ్ళేరట. ప్రతీసారీ ఒంటరిగా వెళ్ళినా, క్రిందటిసారి మాత్రం తమ భార్యకి కూడా టికెట్టు కొనమని ఎంత నిక్కచ్చిగా చెప్పేరో, ఎంతో నీచమైన గూడార్థంతో చెప్తున్నారు. ఎప్పుడు వెళ్ళినా డబ్బు సంపాదించడానికి వెళ్ళలేదుట. అమెరికాలో ఉన్నవారిని "ఉద్ధరించడానికే" వెళ్ళేరుట. చాలా దయామయులు.

2000 సంవత్సరంలో తానా వాళ్ళు పిలిచేరుట కానీ, వీసా రాలేదుట. అసలు వేరే దేశం వెళ్ళడానికి వీసా అనేదొకటుందని తెలీదుట గురువు గారికి. "మంచి మైకులోనీ చెడు చెవిలోనీ చెప్పమన్నారు" అని చెపుతూనే ఆయనకి చెడు అనిపించిందంతా మైకులేనే చెప్పేరు మహానుభావులు. విషయమేంటంటే చెప్పే చెడ్డంతా వివేకానందుల పేరు చెప్పి చెప్పేరు అన్యాయంగా. తానా ప్రెసిడెంట్ ఫోన్‌చేసి  "మీరు వీసారాని దురదృష్టవంతులు" అని "వెధవ ఇంగ్లీషు" లో  అన్నార్ట. దానికి ఈయనకి చాలాకోపం వచ్చింది. ఇంకేముంది? ఆయనతో ఇంగ్లీషులో మాట్లాడడానికీ, తెలుగులో చెప్పకపోవడానికీ ఆ ప్రెసిడెంట్ గారిని నానా మాటలూ అని, ఆశుకవితాధురీణులు కదా, ఒక పద్యం వ్రాసి పంపిస్తే, తానా వారు ఎంతో గౌరవంతో ఆ పద్యాన్ని వారి ఉత్సవ ప్రత్యేకసంచికలో ప్రచురించేరుట. ఆ పద్యం ఎంత సోత్కర్ష, ఏహ్యభావాలతో ఉందో చూడండి. "మెరిక ముందర (అ)మెరిక గరికపాటి". అమెరిక అంటే దిక్కుమాలిన దేశమూ, తెలివితేటలులేని మందకొడి "వెధవలు" ఉండే దేశమని అర్థంట ఈ పద్యానికి. ఆహ్వానించిన తానావారి ఇంటిపేరుట అమెరిక. ఈయన ఇంత జుగుప్సాకరంగా చవకబారు అర్థంతో వ్రాసిన పద్యమైనా తానా వారు సహృదయంతో, తమ మాతృభాషాభిమానంతో ఆ భాషలో పండితులైన శ్రీ రావు గారి మీద గౌరవంతో ఆ పద్యాన్ని ప్రచురించేరు. అయినా ఈయన అక్కసు తీరలేదు. పన్నెండేళ్ళ తర్వాత ఇంకా వెళ్ళగక్కుతున్నారు. ఇందులో ఎవరిది విశాలహృదయమో, ఎవరివి సంకుచిత భావాలో విజ్ఞులకి తెలియాలి. అసలు ఒకటి జరిగుంటుంది. ఆ తానా ప్రెసిడెంట్‌గారు అలవాటు ప్రకారం ఇంగ్లీషులో "It is unfortunate that you didn't get visa Mr.Narasimha Rao" అని పరామర్శగా అనుంటారు. అది గురువుగారు అపార్థం చేసుకుని పన్నెండేళ్ళ తర్వాత బాధ పడుతునారు.

ఇలాగే సాగుతుందీ ప్రసంగమంతా. ఒకటో రెండో మంచిమాటలు చెప్పకపోలేదు. కానీ.... అదీ సంగతి!








Monday, January 15, 2018

వెఱ్ఱిగొల్లడు అంటే తప్పేంటి?

ఇది జరిగి అప్పుడే కొంతకాలమైంది. చాగంటి కోటేశ్వరరావుగారు అందరికీ తెలిసిన మంచి ప్రవచన కర్త. ఆయన పదిమంది మంచికోరి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం తన తృప్తికోసం తనకి తెలిసిన పౌరాణిక, ధార్మిక విషయాలని వాటి వెనుక నిగూఢంగా ఉన్న తత్త్వార్థంతో సహా మామూలు మనుషులకర్థమయ్యే భాషలో విడమర్చి చెప్తూ తనకి తెలియకుండానే ఎంతోమందికి మార్గదర్శకులైన మంచిమనిషి. అలాంటి చాగంటిగారు ఆ మధ్య ఒకానొక సందర్భంలో విష్ణుమూర్తి అవతారాలైన రామకృష్ణులిద్దరినీ, వాళ్ళు పుట్టిపెరిగిన వాతావరణ పరిస్థితుల బట్టి పోలుస్తూ కృష్ణుడ్ని "వెఱ్ఱి గొల్లడు, తలకడిగితే మొలకడగడం తెలియని వాడు" అన్నారు. అంతే. ఆ మాటమీద తెలుగుదేశంలో పెద్దపెద్ద గొడవలయిపోయేయి. రాస్తారోకోలు, చాగంటిగారి బొమ్మని అందరూ చూస్తూండగా అవమానించడాలూ, ఆయన్ని నానా మాటలూ అనడాలూ, టీవీలో చర్చలూ, వాదోపవాదాలూ, ఒకటేంటి. ఎంత హడావిడి జరగొచ్చో అంతా జరిగింది. ఎవరితోనూ గొడవకి దిగడం ఇష్టంలేని మంచాయన చాగంటిగారు, ఈ విషయం వెంటనే సద్దుమణిగి పోవాలనే మంచి ఉద్దేశ్యంతో గొల్లకులం వారందరికీ క్షమాపణ చెప్పుకున్నారు.

ఇంతకీ గొల్ల అనే మాట మంచిదో కాదో చూద్దాం. గోపాలః అనేది సంస్కృత పదం. దీని అర్థం గోవులను పాలించేవాడు లేదా పశుపాలనే వృత్తిగా బ్రతికేవాడు అని. ఇది తెలుగులోకి వచ్చేసరికి గోపాలుడు అయ్యింది. దీనికి బహువచనం గోపాలురు అవుతుంది. అయితే, ఏ భాషలోనైనా ప్రకృతి, వికృతి అని ఉంటాయి. గ్రాంథికపదాలు ఆ భాష నుడికారానికి అనుగుణంగా వాడుకలోకి వచ్చినప్పుడు కొంతమారడం సహజం. శిష్టపదాల్ని ప్రకృతులనీ, వాడుకపదాల్ని వికృతులనీ అంటాం.
ఉదా: బ్రాహ్మణుడు -- బాపడు, శ్రేష్ఠి -- శెట్టి, నాయకుడు  -- నాయుడు. అలాగే గోపాలుడు గొల్లడు గానూ, గొల్ల గానూ వికృతి చెందిన పదం. ఈ పదాలు తెలుగులో ఎప్పట్నుంచో వాడుకలో ఉన్నవి. అన్నమాచార్యులుగారు ఆయన వ్రాసిన కీర్తనలలో చాలాచోట్ల గొల్ల, గొల్లడు, గొల్లెత అనే పదాలు వాడేరు. శ్రీకృష్ణుడిని తమ కులస్థుడిగా భావించేవాళ్ళు వాళ్ళని వాళ్ళే "మేము గొల్లలం" అని చెప్పుకుంటారు. గొల్లపేరుతో మొదలయ్యే ఊళ్ళూ గుళ్ళూ చాలా కనపడతాయి. విశాఖపట్నంలో "గొల్ల కంచరపాలెం" అనే ప్రాంతముంది. కాకినాడ పొలిమేర దగ్గిర "గొల్లల మామిడాడ" అనే ప్రఖ్యాత సూర్యక్షేత్రముంది. ఇంక తిరుమలలో గొల్లవారికున్న ప్రాముఖ్యత, విలువ అందరికీ తెలిసిందే. మరి  ఇంత చరిత్ర, అస్తిత్వం, పేరుప్రఖ్యాతులూ ఉన్న వర్గం వారు తమని తాము వేరే విధంగా పిలుచుకోవాలని ఎందుకనుకుంటున్నారో, వాళ్ళకే తెలియాలి.

ఇప్పుడు వెఱ్ఱిగొల్లడు అనే పదం సరైన మాటో కాదో చూద్దాం. వెఱ్ఱి అనే పదానికి మతిలేనివాడు అనే కాకుండా అమాయకుడూ, కల్మషంలేనివాడూ అనే అర్థం కూడా ఉంది. ఒకప్పుడు మనదేశంలో ఎవరిమటుకు వారు వాళ్ళవాళ్ళ కులవృత్తులు మాత్రమే చేసుకుని బ్రతికేవాళ్ళు. ఒకమనిషి గొడ్లు కాచుకోవడం, వాటిపాడిమీద ఆధారపడి బ్రతికేవారి కులంలో పుడితే తనూ చిన్నప్పట్నుంచీ గొడ్లకి సంబంధించిన పనులే చేస్తూ పెరిగేవాడు. అతనికి వేరే చదువు, విద్యలతో పనీ, పరిచయం ఉండేవికాదు. ఆ రోజుల్లో ఈ గోపాలన అనేది అతిమామూలు వృత్తి కాబట్టీ, పెద్దగా ఆలోచన ఉపయోగించి చేయాల్సిన పనికాదు కాబట్టీ, అటువంటి గొల్లవానికి లోకజ్ఞానం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఇలాగ పెద్దగా ప్రాపంచిక విషయాలు తెలియకుండా కల్లాకపటంలేని జీవనం గడిపేవాడిని "వెఱ్ఱిగొల్లడు" అనడం వాడుకలో ఉండేది. ఇదేదో అతన్ని కించపరచడానికో, అవమానించడానికో అనేమాటకాదు. ఆ మాటకొస్తే, వెఱ్ఱిగొల్లడే కాదు, వెఱ్ఱిబాపడనే మాటకూడా ఉంది.  రోజూ గుళ్ళో దేవుడ్ని సేవించుకుంటూ, వాళ్ళూ వీళ్ళూ ఇచ్చిన దక్షిణతోనూ, గుళ్ళో ప్రసాదంతోనూ బ్రతికే నిష్కల్మషమైన బ్రాహ్మణుడ్ని అలా అనేవారు.

ఇంక తలకడిగితే మొలకడగడం తెలియని వాడు అన్న విషయం. భాష తెలియకపోతే వచ్చే చిక్కులివి. ఇక్కడ ఏదో కడుక్కోడం గురించి ప్రస్తావించట్లేదాయన. తలకి అడిగితే మొలకి అడగడు అని అర్థం వచ్చేమాట కాస్తా అనర్థం అయికూర్చుంది తెలుగుభాషా మూఢులకి. కథ ఏంటంటే,  అమాయకుడూ, లోకజ్ఞానంలేనివాడూ అయిన ఒకానొక పేదవాడు ఈశ్వరుడి గురించి తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాట్ట. ఒంటిమీద కట్టుకోడానికి కూడా లేని ఈ పేదభక్తుడు స్వామిని ఒక తలపాగా ఇప్పించమన్నాట్ట. అప్పుడీశ్వరుడు నవ్వి, "తలకిస్తానుగానీ మొలకేం కడతావ్ మరి!" అన్నాడు. అప్పుడీ అమాయకుడు "సరే అయితే, మొలకి కట్టుకోవడానికొక గుడ్డ ఇవ్వండి స్వామీ, తలకొద్దులెండి" అన్నాట్ట. తలకీ, మొలకీ రెంటికీ ఇమ్మని కూడా దేవుణ్ణడగలేనంత అమాయకుడు మరి.

ఇదంతా చూస్తే ఉత్తిపుణ్యానికి ఒక మంచిమనిషిమీద బురద చల్లడానికి తప్పితే ఈ గొడవకి అర్థం లేదనిపిస్తుంది. అదీ సంగతి.

Saturday, January 13, 2018

శంకరా నాదశరీరా పరా

శంకరా నాదశరీరా పరా

శంకరాభరణం సినిమా గురించి తెలియనివాళ్ళూ, కనీసం అందులోని పాటలు విననివాళ్ళూ తెలుగువాళ్ళలో ఉండరేమో. సుమారు 38 సంవత్సరాల క్రితం, 1980 ఫిబ్రవరి 12వ తేదీ న విడుదలై, అప్పట్లో వచ్చే సినిమాకథలకి పూర్తి విరుద్ధంగా, సాంప్రదాయ సంగీతసాహిత్యాలకి సంబంధించిన కథతో వచ్చి, దేశాన్ని ఒక్క ఊపు ఊపి, గాయకుడు బాలసుబ్రహ్మణ్యానికి అస్తిత్వాన్నీ, దర్శకుడు విశ్వనాథ్ కి అమరత్వాన్నీ, కవి వేటూరి పాటలకీ, మహదేవన్ సంగీతానికీ అజరామరత్వాన్నీ సంపాదించిపెట్టిన, ఎప్పటికీ జ్ఞాపకముండిపోయే మంచి తెలుగు సినిమా శంకరాభరణం.

సాధారణంగా తెలుగులో ఎప్పుడూ వినే, పాడుకునే పాతపాటలన్నీ (క్లాసిక్స్) ఘంటసాల యుగంలో వచ్చినవే. కానీ శంకరాభరణం పాటల విషయంలో మాత్రం ఈ వాదన చెల్లదు. సంగీత సాహిత్యాలు రెండింట్లోనూ అవి అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మరిచిపోలేనంత గొప్పవి. అయితే, ఆ పాటల సాహిత్యాన్ని ఆస్వాదించేవాళ్ళకన్నా, వాటిని విని ఆ సంగీతాన్ని మెచ్చుకొనేవాళ్ళే ఎక్కువ. కానీ ఒక్కసారి ఆ సాహిత్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకుంటే, ఆహా! అనకుండా ఉండలేం. ఉదాహరణకి శంకరా నాదశరీరా పరా అనే పాట వెనుక సాహిత్యాన్ని పరిశీలనగా చూద్దాం.

శంకరశాస్త్రిగారు ఒక నిశిరాత్రివేళ శివుడికి నివేదనగా వినిపిస్తున్న పాట ఇది.చూడండి ఏమని పిలుస్తునాడో శివుణ్ణి.

"శంకరా, నాదశరీరా, పరా, వేదవిహారా, హరా. జీవేశ్వరా..."

శుభం కలిగించేవాడా, ఓంకార స్వరూపా, వేదాలలో విహరించేవాడా, అజ్ఞానాన్ని హరించేవాడా, జీవులందరికీ ఈశ్వరుడా...

ఎందుకు పిలుస్తునాడు? తను పాడే పాట వినడానికి. అయితే మరీ చప్పగా, "పాట పాడతాను, విందువుగాని రా" అంటే ఆయన శంకరశాస్త్రి గారు ఎందుకవుతారు? ఎంతో కొంత ఉపోద్ఘాతమివ్వాలి. అది కూడా కవితాత్మకమైయ్యుండాలి. ఇదిగో ఇలాగన్నమాట.

"ప్రాణము నీవని, గానమే నీదని, ప్రాణమే గానమని,
మౌన విచక్షణ, గానవిలక్షణ, రాగమే యోగమని,
నాదోపాసన చేసినవాడను, నీ వాడను నేనైతే"

ఓంకారాత్మకమైన శివుడే నా శ్వాసలో ఉన్న ప్రాణశక్తి అని, ఆ ఓంకారంలోంచి పుట్టినదే నేను చేసే గానమని, శబ్దబ్రహ్మమైన రాగాలాపనే యోగమని భావించి నాదోపాసన (సంగీతాన్నే దైవంగా భావించి సాధన చేయడం) చేసే నేను నిజంగా నీ భక్తుడనైతే,

దిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కంధరా నీలకంథరా

అష్టదిగ్గజాలకధిపతివీ (దిక్ + కరి + ఇంద్ర + జిత = దిక్కరీంద్రజిత. అష్టదిక్కులు మోస్తూన్న ఎనిమిది ఏనుగులకి అధిపతులైన అష్టదిక్పాలకుల పైనున్నవాడివి), కైలాసాధిపతివీ (హిమగిరి = కైలాసం), తెల్లనివాడివీ లేదా స్వచ్ఛమైనవాడివీ (సిత), కపాలధారీవీ(కం-ధరా), నీలకంఠుడివీ (నీలకంథరా) .... (అయిన ఓ శివుడా)

క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధరించరా విని తరించరా

అజ్ఞానులకు అర్థంగానిదైన అర్ధరాత్రి నేను చేసే ఈ రుద్రవీణా గానం (అనుమానం: బహుశా అసలు కథ ప్రకారం రుద్రవీణ వాయిస్తూ పాడాలేమో శాస్త్రిగారు. దానికనుగుణంగా పాట వ్రాయడమూ, రికార్డింగ్ చేసెయ్యడమూ అయిపోయుంటుంది. తీరా షాట్ తీసేటప్పుడు చూస్తే రుద్రవీణ అందుబాటులో ఉండుండదు. తుంబురతో సరిబెట్టేసుంటారు. అనుకుంటా...) ఇదిగో నీకే (అవధరించు), బాగా విని ఆనందించవయ్యా

అని పాడుతూంటే, ఇంతలో ఉరుములూ, మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది. అదిచూసి, ఆ శివుడు తన పాట విన్నాడనీ, దాని ఫలితమే ఈ కుండపోత అనీ అనుకుని మహదానందంతో మళ్ళీ ఇలా అందుకున్నాడు మన శంకరశాస్త్రిగారు.

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నగవులు కాబోలు,
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా, ధరకు జారెనా శివగంగా
నా గాన లహరి నువు మునుగంగా ఆనందవృష్టి నే తడవంగా

శివా! నా కవిత్వానికి నువ్వు ముసిముసిగా చిరునవ్వులు నవ్వితే ఒక్కసారి కనిపించి మాయమైన నీ పంటికాంతులేనేమో ఈ మెరుపులు?
నా పాటకి నువ్వు నాట్యం చేయ్యడం మొదలెడితే, నీ కాలి అందెల మువ్వలు శబ్దమనుకుంటా, ఈ ఉరుములు.
నా గానమాధుర్యానికి నువ్వు పరవశించి ఒక్కసారి తలవిదిలించినట్టున్నావు, అంతే. నీ తలమీదున్న గంగ నేలకి జారి వర్షమై పడుతోంది.
నా పాటవెల్లువలో నువ్వు మునిగిపోయి, ఆ ఆనందంలో కురిపించిన ఈ వానలో నేను తడిసిపోయి, భలే!

ఇంతగొప్ప కవిత్వాన్ని మనకందించి వెళ్ళిన వేటూరి గారికి నమస్తే!