Pages

Friday, July 26, 2019

ఉగాది

ఉగాది, యుగాది, గుఢీ పాడవా, పుత్తాండు, విషు, పొహెలా నోబొబోర్షో, పణ సంక్రాంతి, బిఘు, బిఖు, చేతీ చాంద్,..... ఇవన్నీ దేశంలో వివిధ ప్రాంతాలలో సంవత్సరాది పండగకి మారుపేర్లు. అయితే, ఈ సంవత్సరాదిని ఆయా ప్రాంతాలవాళ్ళు వాళ్ళు పాటించే కాలమానం ప్రకారం మార్చి/ఏప్రిల్ నెలల్లో జరుపుకుంటారు. కానీ అందరూ కలసి పాటించే వ్యావహారిక సంవత్సరాది మాత్రం జనవరి ఒకటో తేదిన మాత్రమే. ఆ రోజున దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతంలో ఏ గుడి చూసినా భక్తుల రద్దీతో కిటకిటలాడి పోతుంది. ఆయా దేవస్థానాల వాళ్ళు, భక్తుల రద్దీ తట్టుకోడానికి ప్రత్యేక బస్సులు, రైళ్ళు, ఏర్పాటు చేస్తారు. అయితే, new year అనేది మన సంస్కృతిలో లేని పండగ కదా, మరి ఇదేరోజు విష్ణువూ, శివుడూ, గణపతీ, సుబ్రహ్మణ్యేశ్వరుడూ, అమ్మవారూ, వీళ్ళందరి దేవాలయాలలో ప్రత్యేక పూజలూ, దర్శనాలూ ఎందుకు జరుగుతాయి? ఇది ఏ శాస్త్రంలో ఉంది? ఎవరు చెప్పేరు?
ఆరా తీస్తే... సమాధానాలు తిరుత్తణిలో దొరికేయి.
అరవదేశంలో ఉన్న ఆరు ముఖ్యమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి ఒకటి. ఇది తిరుపతికి దక్షిణంగా 65 కిలోమీటర్ల దూరంలో, కంచికి ఉత్తరంగా 40 కిలోమీటర్ల దూరంలో, ఉన్న పుణ్యక్షేత్రం. ఇక్కడ ఒక చిన్నకొండమీద, విశాలమైన ప్రశాంత ప్రదేశాన పెద్ద సుబ్రహ్మణ్యేశ్వరుడి దేవాలయం ఉంటుంది. తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలలో ఈ దేవాలయం ఒకటి. స్థలపురాణం బట్టి ఇక్కడే కుమారస్వామి బ్రహ్మకి ఓంకార ప్రణవమంత్ర తత్త్వాన్ని బోధించి సుబ్రహ్మణ్యం (సు-బ్రహ్మణ్యం) అనే పేరు గల వాడయ్యేడు. ఇక్కడే ఈయనకి శ్రీవల్లితో పెళ్ళి కూడా అయింది. స్వతంత్ర భారత రెండవ రాష్ట్రపతి అయిన ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మస్థలం కూడా ఈ ఊరే.
విషయానికొస్తే, 18, 19 శతాబ్దాలలో దేశంలో మిగతా ప్రాంతాలలాగే, ఈ తిరుత్తణిలో కూడా బ్రిటిష్ వాళ్ళ పెత్తనం నడిచేది. ప్రతీ ఆఫీసుకీ, ప్రతీ కోర్టుకీ ఒక దొర ఆఫీసరుగా ఉండేవాడు. ఆయనగారికో దొరసాని. అవకాశం వచ్చినప్పుడల్లా స్థానిక భృత్యులు (native subjects) వీళ్ళకి దణ్ణాలు పెడుతూ, బహుమానాలు చదివించుకుంటూ, దొరగారిని ఇంద్రుడూ, చంద్రుడూ అనీ, దొరసానిని రంభా, ఊర్వశీ అనీ పొగుడుతూ ఉండాలి. ఇలా చేసేవాళ్ళు అస్మదీయులు. చెయ్యనివాళ్ళు? తస్మదీయులు! జనవరి ఒకటో తేదీ అయితే ప్రతీ భృత్యుడూ చెయ్యవలసిన మొట్టమొదటి పనే ఇది. ఆ రోజు పొద్దున్నే దొరసానీసమేత దొరవారి దర్శనం చేసుకున్న తర్వాతే వేరే ఏ పనైనా. అసలే వలస పాలకుల దగ్గర ఇష్టంలేని కొలువు. దానికి తోడు శుభమా అని (వ్యావహారికంగా) కొత్త సంవత్సరం ఒక అప్రాచ్యుడి మొహం చూసి మొదలుపెట్టాలి. ఇదెక్కడి శనిరా బాబూ అని స్థానికులు బాధపడుతూన్న సమయాన , అక్కడికి దగ్గర్లోనే ఉన్న వళ్ళిమలై అనే కొండమీద కుటీరంలో ఉండే ఒకానొక యోగీశ్వరుడు స్థానిక ప్రజలకొక మంచి సలహా ఇచ్చేడు. ఏమనంటే, తెల్లవారకముందే లేచి గుడికెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరుడి దర్శనం చేసుకుని అప్పుడు వెళ్ళి దొరని కలవమని. అప్పుడైతే, ఆ అప్రాచ్యుడి మొహం చూసి కొత్త సంవత్సరం మొదలుపెట్టినట్టవదు కదా. ఇదేదో బాగానే ఉంది కదా అని ప్రజలంతా new year's day నాడు సుబ్రహ్మణ్యుడి దర్శనం చేసుకుని దొరని కలవడానికి వెళ్ళడం మొదలు పెట్టేరు. ఈ పద్ధతి మెల్లిగా మిగతా ఊళ్ళకి కూడా ప్రాకింది. ప్రతీ దేవాలయంలో కొత్త సంవత్సరం మొదటిరోజున భక్తుల సందడి మొదలయింది. తర్వాత స్వాతంత్య్రం వచ్చింది. తెల్లదొరలూ, వాళ్ళ దొరసానులూ పోయేరు. కానీ గుళ్ళో దేవుడి దర్శనం చేసుకుని క్రొత్త సంవత్సరం మొదలుపెట్టే పద్ధతి మాత్రం స్థిరంగా ఉండిపోయింది. అదీ సంగతి.
(ఆధారం: పులిగడ్డ వేంకట కుటుంబ వసంతకుమార్ గారి యాత్రికమిత్ర)

పెద్దపండగ

భోగిమంట, పొయిలో కర్ర
ఇచ్చినమ్మ పుణ్యం, ఇవ్వనమ్మ పాపం
మీ పిల్లల్లేరా, మా ఇంటికి రారా
పిడకల దండలు, చితుకుల పోగులు
చలిచలి మంట, వేద్దామంట
అందరు వచ్చి, చూస్తారంట
------
ఇలాగ వీధిలో కుర్రాళ్ళు చేసే హడావిడీ, రథం ముగ్గులూ, హరిదాసు సంకీర్తనలూ, బసవన్నల మెళ్ళో సవ్వడులూ, గంగిరెడ్ల వాళ్ళ సన్నాయి వాయిద్యాలూ, టైలరు కొట్టు ముందు పడిగాపులూ, పట్టుచీరతో పెద్దక్క, చిరునవ్వుతో చిన్నక్క, మూతి ముడుచుకుని మూడో అక్క (యండమూరి ఆనందోబ్రహ్మ), భోగిపళ్ళూ, పిండివంటలూ, మొదలైన వాటితో సందడిగా జరిగే తెలుగువారి నాలుగు రోజుల పెద్దపండగ - అందరికీ శుభాకాంక్షలు.

కుక్క కాటుకి చెప్పుదెబ్బ

కుక్క కాటుకి చెప్పుదెబ్బ. ఇదొక తెలుగు సామెత. దీన్ని సాధారణంగా టిట్ ఫర్ టాట్ అనే ఇంగ్లీషు సామెతకి సమానార్థకంగా వాడతాం. అయితే, దీని అసలు అర్థం ఆలోచిస్తే ఎవర్నైనా కుక్క కఱిస్తే అది కఱిచిన చోట విరుగుడుగా చెప్పుతో కొట్టాలని. కదా! మరి అలా కొట్టడం నిజంగా మంచిదేనా? కాదని ఈ మధ్యనే గరికపాటి నరసింహారావు గారు యూట్యూబులో చెప్తూంటే తెలిసింది.
విషయానికొస్తే, కొన్నిరకాల చెఱువు చేపలుంటాయి. వాటి సంతానోత్పత్తి చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే, ఆడచేప ఒక ఆకుమీద గుడ్లు పెడుతుంది. మగచేప తనవంతు సాయం చేసి, తర్వాత గుడ్లతో ఉన్న ఆ ఆకుని జాగ్రత్తగా చెఱువు గట్టుకి దగ్గర్లో ఉన్న ఱెల్లుదుబ్బులో దాచి, అవి పగిలి పిల్లలు బయటకొచ్చేదాకా ఆ చుట్టుపక్కలే కాచుక్కూర్చుంటుంది. ఇలాగ చేపగుడ్లున్న ఈ ఱెల్లు గడ్డిని చేపదుబ్బు అంటారు. ఇలాంటి చేపదుబ్బుతో కుక్క కఱిచిన చోట ఒక రెండు వేస్తే, ఆ కుక్కకాటు బాధ తగ్గుతుంది(ట). ఆ విధంగా "కుక్కకాటుకి చేపదుబ్బు" అనే నానుడి ఉండేది. అయితే క్రమంగా అయితే క్రమంగా Louis Pasteur దయవల్ల Rabies Vaccines వచ్చేయి. ఇలా కొట్టే అవసరం లేకుండా పోయింది. అంతే కాకుండా, చెఱువులూ, వాటితో పాటు చేపలూ, ఱెల్లుదుబ్బులూ కూడా కనబడకుండా పోయేయి. కానీ నానుడి మాత్రం కుక్కకాటుకి చెప్పుదెబ్బ అని రూపాంతరం చెంది, వాడే సందర్భం కూడా మార్చుకుని స్థిరపడిపోయింది. అదీ సంగతి.

యాగార్థం

స్వగతం
ఒక సెలవు దినం పొద్దున్న కాఫీ తాగుతూ వర్ణన రత్నాకరం 19వ సంపుటి పుటలు తిరగేస్తున్నాను. ఇది ఒక విలక్షణమైన గ్రంథం. 1930లలో దాసరి లక్ష్మణకవి గారనే సాహిత్యవేత్త ఒకాయన ఒకే వస్తువును గానీ, విషయాన్ని గానీ వేర్వేరు కవులు ఏయే రకాలుగా వర్ణించేరో పరిశోధన చేసి అలాంటి పద్యాలన్నిటినీ ఒక చోట కూర్చి, పొందికగా సంకలనం చేసి నాలుగు సంపుటాలుగా ప్రచురిస్తే, ఇది జరిగిన సుమారు తొంభై సంవత్సరాలకి, హైదరాబాదు విశ్వవిద్యాలయం వాళ్ళు, ఎమెస్కో వాళ్ళు కలిసి, బేతవాలు రామబ్రహ్మం గారు, అద్దంకి శ్రీనివాస్ గారు, మొదలైన తెలుగు పండితులచేత ఈ పద్యాలన్నిటినీ పునస్సంకలనం చేయించి, టీక, తాత్పర్యాలతో సహా ఇరవై మూడు భాగాలుగా, ఒక్కొక్క భాగం ₹200 చొప్పున తెలుగు భాషాభిమానులకి అందజేస్తున్నారు. శెలవునాడు ఇలాంటి పుస్తకాలు కాని చదవడం మొదలుపెడితే అది ఎంతదాకా వెళ్తుందో చెప్పలేం. సరే, ఆ శనివారం పొద్దున్న యజ్ఞాదికం, అంటే యజ్ఞం, దానికి సంబంధించిన విషయాల మీద పద్యాలు చదువుతున్నాను. ఈ పద్యాలన్నీ ఏవేవో కావ్యాలు, ప్రబంధాల నుంచి సంగ్రహించబడినవి. ప్రతీ పద్యం చివర అది ఏ గ్రంథం లోనిదో, ఆ విషయం కూడా రాసేరు. అదిగో అలాంటి పద్యాల్లో ఈ అందమైన కందమొకటి.
కం. యాగార్థ మడిగి నర్థము
యాగమునకుఁ బెట్టవలయు నడియరియై తా
భోగార్థముగా దాఁచిన
యాగమబాహ్యుండు కాకియై జన్మించున్
విజ్ఞానేశ్వరీయం, ఆచా., 87
ఏదైనా యాగం చెయ్యాలని తలపెట్టి దానికి కావలసిన ధనసామగ్రులను విరాళంగా సేకరించి, అలా సేకరించిన వాటిని ఆ యజ్ఞానికి వాడకుండా, లోభంతో (అడయరియై) స్వంతానికి దాచుకున్న వాడు ధర్మం తప్పినవాడై (ఆగమబాహ్యుడు) తర్వాత జన్మలో కాకిగా పుడతాట్ట.
ఇది విజ్ఞానేశ్వరీయం, ఆచారకాండలో 87వ పద్యంట. సరే, ఈ విజ్ఞానేశ్వరీయం గురించి తెలుసుకోవాలని ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం తిరగేస్తే తెలిసిన విషయాలిలా ఉన్నాయి.
పదమూడవ శతాబ్దపు కవి (తిక్కనకి సమకాలికుడు) మూలఘటిక కేతన గారు రచించిన గ్రంథమిది. అయితే, ఈ కేతనగారికో కథ ఉంటే, ఆయన వ్రాసిన విజ్ఞానేశ్వరీయానికి సంస్కృత మాతృక మితాక్షర వెనక ఇంకా పెద్ద కథ ఉంది. సరే అభినవ దండి బిరుదాంకితుడైన కేతన గారి గురించి మళ్ళీ ఎప్పుడైనా. ముందు మితాక్షర గురించి చెప్పుకుందాం.
ప్రాచీన భారత ఋషులలో యాజ్ఞ్యవల్క్యుడు ఒకడు. శుక్ల యజుర్వేదంలో ఈయన దర్శించిన వేదమంత్రాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మహాభారతంలోనూ, అనేక పురాణాల్లోనూ ఈయన ప్రస్తావన చాలా చోట్ల వస్తుంది. ఈయన గురించి వివరంగా ఇంకెప్పుడైనా చెప్పుకోవచ్చు. ఈ ఋషి మనకందించిన ఒక ప్రముఖ గ్రంథం "యాజ్ఞ్యవల్క్య స్మృతి" అనే ధర్మశాస్త్రం. దీన్ని తెలుగులో సరళ వచనంలో అందరికీ అర్థమయ్యేట్లు అనువదించిన వాళ్ళలో పుల్లెల రామచంద్రుడు గారు ఒకరు. ఈ స్మృతికి చాలా మంది భాష్యాలు వ్రాసినా, 12వ శతాబ్దపు విజ్ఞానేశ్వరుడు అనే యోగి రచించిన మితాక్షర చాలా ప్రసిద్ధి చెందింది. ఇందులో మూడు కాండలున్నాయి. ఆచారకాండ, వ్యవహార కాండ, ప్రాయశ్చిత్త కాండ. అదిగో, ఆ ఆచారకాండలోదే నేను చూసిన పై పద్యం.
ఆచారకాండ: సభ్య సమాజంలో ఒక మనిషి చెయ్యవలసినవీ, చెయ్యకూడనివీ (Do's & Dont's) అయిన పనులన్నీ (ఆచారాలు) వివరంగా చెప్పిన కాండ ఇది.
వ్యవహార కాండ: ఒకరు చేసిన పనుల వల్ల ఇంకొకరికి కలిగే కష్టనష్టాల మీద పాలకులు జరపవలసిన న్యాయ విచారణ (Trial & Investigation) . ఇదే వ్యవహారం.
ప్రాయశ్చిత్త కాండ: .నేరనిర్ధారణ జరిగిన తర్వాత అమలుపరచవలసిన శిక్ష, ప్రాయశిత్తం, వాటి వివరాలు.
అయిపోయింది శనివారం సెలవు.

అట్నుంచి నరుక్కు రండి

మన ఇంట్లో ఉన్నట్లుండి ఏదో పనిచేయడం మానేస్తుంది. అది టీవీ, ఫ్రిజ్, కుళాయిబుర్ర, టాయ్లెట్ ఫ్లష్, సింకు కింద డ్రైన్ మోటరు, లేదా ఇంకేదైనా. ఏమయిందో, ఎలా బాగుచెయ్యాలో తెలీక బుర్రగోక్కుంటుంటే ఇంట్లో ఎవరో సలహా పారేస్తారు - "అట్నుంచి నరుక్కు రండి" అని. వాళ్ళ ఉద్దేశం రివర్స్ ఇంజినీరింగ్ చెయ్యమని. ఉదా: మిక్సీ పనిచెయ్యట్లేదు. ముందు ప్లగ్గులో కరెంటొస్తోందో లేదో, రాకపోతే ఫ్యూజు పోయిందా, బ్రేకరు ట్రిప్పయ్యిందా, మిక్సీ స్విచ్ ఆన్ పొజిషన్లో ఉందా ఇలాగన్నమాట. అయితే, ఈ అట్నుంచి నరుక్కు రావడమనే నానుడి వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.
తత్కథాప్రారంభంబెట్టిదనిన (ఈ మాట ఆదికవి నన్నయ్యది. భారతకథ మొదలుపెడుతూ అంటాడు. ఆంధ్రభారతం ఆదిపర్వం, 1.27) -
రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారని, 18వ శతాబ్దంలో చింతపల్లి సంస్థానాధీశుడు. అక్కడ్నించి ఆయన తన రాజధానిని ముందు ధరణికోటకీ, తర్వాత అమరావతికీ మార్చుకున్నాడు. ఈరాజు గారు మంచి పాలకుడుగా, కళాపోషకుడుగా, దాతగా చాలామందికి తెలుసు. మంగళగిరి నరసింహస్వామి గుడి గోపురం - 857 అడుగుల ఎత్తు - ఈయన కట్టించినదే. బంగారం పూసిన ధ్వజస్థంభాలు - ఒక్కొక్కటీ ముప్ఫయ్యేసి అడుగులవి - అష్టోత్తర శతం, అంటే నూట ఎనిమిది - ఆంధ్రదేశం దేవాలయాల్లో ప్రతిష్ఠింపజేసేడు. ఈయన నిలువెత్తు శిలావిగ్రహం అమరావతిలో ఇప్పటికీ ఉంది.
నాయుడిగారి రాజ్యంలో ఒకప్పుడు పిండారీలు (ఆటవిక దొంగలు) హఠాత్తుగా ఊళ్ళమీద పడి దోపిడీలు చేసేవారు. అలాగే దారిదోపిడిలు కూడా విపరీతంగా ఉండేవి. తన ప్రజలకి ఈ దొంగలబాధ తప్పించాలనే సదుద్దేశంతో, రాజుగారొకనాడు, చుట్టుపక్కల ఆటవిక గూడేలలో ఉండే సుమారు 600 మంది మగవాళ్ళని విందు భోజనమనే నెపంతో ఒక ప్రదేశానికాహ్వానించి, వాళ్ళొచ్చిన తర్వాత అందర్నీ బంధించి, వరసలో నిలబెట్టించేడు. ప్రజలందరూ చూస్తూండగా తలలు నరికేయమని ఆజ్ఞాపించేడు. ఈ దెబ్బతో ఇంకెవరూ దోపిడిలూ దొంగతనాలూ చెయ్యకూడదు మరి.
సరే, దొంగలందర్నీ వరసలో నిలబెట్టేరు కదా, కొంచం దూరంలో రాజుగారు ఎత్తైన ఆసనం మీద కూర్చున్నారు. ప్రక్కన బంధుమిత్రులూ, మంత్రులూ, ఇతర పరివారమూ కూర్చున్నారు. ప్రజలందరూ కూడా గుమిగూడేరు. తలారి కత్తుల్ని పదును పెట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. ఆఱువందల తలకాయలు వాటంగా నరికెయ్యడానికి. గంట కొట్టేవాడు కూడా సిద్ధమే. రాజుగారు ఆజ్ఞ ఇవ్వడం, గంట కొట్టడం. ఒక్కొక్క గంటకి ఒక్కొక్క తల. తఱుగుడే తఱుగుడు. పాపం కోయవాళ్ళు. వాళ్ళలో కొందరే దొంగలు. మిగతావాళ్ళు ఏ పాపం ఎఱగరు. కానీ అందరూ ఇప్పుడు ప్రాణభయంతో గజగజలాడిపోతున్నారు. కొందరు ఆ భయంతో వణికిపోతూ ఉంటే, ఇంకొందరు దేవుడికి దణ్ణాలు పెట్టుకుంటున్నారు, కళ్ళు గట్టిగా మూసుకుని. కొందరు పూనకం వచ్చినట్లూగిపోతున్నారు. వరసలో మొదట నిలబడ్డ వాడి పరిస్థితి వీళ్ళందరికన్నా కొంచెం భిన్నంగా ఉంది. అతనికి భయపడ్డానికీ, బిక్కచచ్చిపోవడానికీ సమయం లేదు. మొదటితల అతనిదే కదా మరి. రకరకాలైన ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోయింది. ఎలాగైనా బతకాలి. ఒకరికో, ఇద్దరికో, లేదా పదిమందికో శిరచ్ఛేదం అయిన తర్వాత రాజుగారి మనసు మారవచ్చు కదా. మిగతావాళ్ళకి శిక్ష ఆపుచేయించ వచ్చు కదా. కానీ తాను ముందున్నాడే మరి. తన శిక్ష అమలైపోయుంటుందే, అప్పటికి.
ఏదో ఒకటి చేసి కొంచం కాలయాపన చెయ్యాలంతే. చివరికి ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చి తలారితో అన్నాడు - "తలవరి గారూ, ఒక చిన్న విన్నపం. తమరు దయ చేసి వరసకి అట్నుంచి (తను నించున్న చివర కాకుండా, అవతల చివర్నించి) నరుక్కు రండి. తమకొక నమస్కారం" అని. చావు తెలివితేటలంటారు, ఇందుకేనేమో మరి.
మరి ఎంతమంది నరకబడ్డారో, ఈ తెలివైన ఆటవికుడు బతికేడో, లేదో తెలీదు కానీ, "అట్నుంచి నరుక్కు రావడం" అనేది మాత్రం నానుడిగా మిగిలిపోయింది.
అలా రాజావారు శిక్షవేసి తలలు నరికించిన ప్రదేశమే, ఇప్పటి గుంటూరు జిల్లా అమరావతి మండలం "నరుకుళ్ళపాడు". అంతమంది మనుషుల తలలు కళ్ళెదురుగా, వాళ్ళు నిజంగా తప్పుచేసేరో లేదో అని ఎలాంటి విచారణా లేకుండా నరికించిన నాయుడు తర్వాత అంత బాగా బతకలేదు. పశ్చాత్తాపంతో కుమిలిపోయేడు . ఆ తర్వాత తన జీవితమంతా దేవుడిసేవలో గడిపి అరవై సంవత్సరాల వయస్సులోపే తనూ చనిపోయేడు. అదీ సంగతి.
(చూ. తెలుగు చాటువు - పుట్టుపూర్వోత్తరాలు, 2006 - పు.144, పొ.శ్రీ.తెలుగు విశ్వవిద్యాలయం)

"మా" ఆయన, "మా" ఆవిడ

ఇది "మన" దేశం. ఇదే "మా" ఊరు. అదిగో, అదే "మా" ఇల్లు. అక్కడ తలుపు దగ్గర నుంచున్నారే, ఆవిడే "మా" అమ్మగారు. "మా" నాన్నగారు ఇంకా రాలేదనుకుంటా.
ఇదే మన తెలుగువాళ్ళం మామ్మూలుగా మాట్లాడే పద్ధతి.
నేను, నాది అనేవి అలవాటు లేని మాటలు. ఏం చెప్పినా అదేదో అందరికీ చెందినట్లు సమిష్ఠిగా చెప్పడమే.
మరి "మా" ఆయన, "మా" ఆవిడ అంటారు, ఆ సంగతో? ఇక్కడ సమిష్ఠిగా చెప్పే విషయం ఏం లేదే? తెలుసుకోవలసినదేంటంటే, ఇక్కడ మా కి, ఆయనకి (లేదా ఆవిడకి) మధ్య "ఇంటి" అనే మాట ఉండాలి, కానీ వాడుకలో లుప్తం అంటే సైలెంట్ అయిపోందని. అంటే తన అర్థభాగం గురించి చెప్పేటప్పుడు, తన గృహానికి తనతో పాటు యజమాని (యజమానురాలు) అనే అర్థం స్ఫురించేలాగ "మా" వాడతారు.
ఇక్కడ "మా (ఇంటి) ఆయన" అనే సర్వనామం ఆ చెప్పే ఆవిడ భర్తకి మాత్రమే సుమా! ఒకవేళ వాళ్ళు ఇంకెవరి ఇంట్లోనో అద్దెకుంటే, వారికా ఇల్లు అద్దెకిచ్చినవాళ్ళ గురించి చెప్పాలంటే "మా ఆయన", "మా ఆవిడ" అనకూడదు మరి.
"మా ఇంటిగలాయన", "మా ఇంటిగలావిడ" అనడం పద్ధతి. అదే సబబుగా ఉంటుంది కూడా. అదీ సంగతి.

శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణీ...

శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణీ...
ఈ మాటలు చాలామంది అంటూంటారు. ఎప్పుడంటే, ఎక్కడైనా మంచి సంగీతం వినబడుతూంటే, సరిగ్గా సంవత్సరం వయస్సు కూడా లేని ఏ చిన్నపిల్లడో, పిల్లో కేరింతలు కొడుతూంటేనో, లేదా మంచి పాటకి ఏ కుక్కపిల్లో చెవులు రిక్కించితేనో, లేకపోతే ఎవరైనా పాములాడించే మనిషి నాదస్వరం ఊదుతూంటే పాము తలాడించిన సందర్భంలోనో. అంతే కాకుండా "చూసేరా! ఆ సంగీత రసానుభూతి! శిశువులకీ, పశువులకీ, చివరకి పాములక్కూడా అలా తెలిసిపోతోందంతే" అని కూడా అనేస్తారు.
అసలు ఈ వాక్యం ఒక మంచి సంస్కృతశ్లోకంలోనిది. పూర్తి శ్లోకం ఇక్కడ చూడండి.
శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణీ
కోవేత్తి కవితాతత్త్వం, శివో జానాతి వా న వా
పై శ్లోకానికి రెండురకాలుగా అర్థం చెప్పుకోవచ్చు. ఒకటి అర్థం, రెండోది గంభీరార్థం.
మొదటి అర్థం - సంగీతం వల్ల శిశువులకీ, పశువులకీ, చివరకి పాములకి కూడా రసానుభుతి కలుగుతుంది. అయితే, ఆ విన్న సంగీతానికొక సాహిత్యమూ అలా రసాలొలికించిన పాట వెనుక ఒక కవిత్వమూ ఉంటాయి. అది మాత్రం అంత త్వరగా కొరుకుడు పడదు. అసలు ఆ పరమశివుడైనా ఆ కవితాతత్త్వాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతాడో, లేదో!
ఇక రెండవ అర్థం. ఇక్కడ శిశువు అంటే కుమారస్వామి (సు-బ్రహ్మణ్యం, స్వచ్ఛమైన జ్ఞానం కలిగినవాడు), పశువు అంటే నందీశ్వరుడు (నందివిద్య - లలితకళలు. వాటికి అధిపతి), ఫణి అంటే పాములరాజైన వాసుకి, గానం అంటే సామవేదం, లేదా క్లుప్తంగా వేదం -- అనీ అర్థం చేసుకుంటే, అప్పుడు ఈ శ్లోకానికి ఎంత గంభీరమైన అర్థం వస్తుందో చూద్దాం.
వేదం తెలిసినవాళ్ళు (శ్రావ్యంగా శ్రుతి, స్వరాలతో వేదమంత్రాలు చెప్పగలిగినవాళ్ళు) గొప్పవాళ్ళైన కుమారస్వామి, నందీశ్వరుడు, వాసుకి. కానీ ఆ వేదవాజ్ఞ్మయానికి సరైన అర్థం వాళ్ళ ముగ్గురికి పై వాడైన ఆ శివుడికైనా తెలుసో, లేదో. వేదమంత్రాలు అంత గంభీరమైనవీ గుహ్యమైనవీ నిగూఢమైనవీ అని అర్థం.
ఇంతుంది ఈ శిశుర్వేత్తి..... శ్లోకంలో. అదీ సంగతి.

రేవుపట్నం

నాగ పట్టణం, చెన్న పట్టణం; కృష్ణ పట్టణం, మచిలీ పట్టణం; విశాఖ పట్టణం, భీముని పట్టణం, ప్రతీ పట్టణమూ ఒక రేవు పట్నమే. అసలు రేవు ప్రాంతాన్ని పట్టణం అని ఎందుకంటారో! ఆరా తీస్తే....
సంస్కృతంలో క్రియాధాతువులని, (Root Verbs) ఒక 1,943 మూలపదాలున్నాయి. అందులో పత అనేది ఒకటి. ఈ పదానికి అర్థం - కదలడం, జారడం, దిగి వెళ్ళడం. పూర్వకాలం "ఎగు"మతి, "దిగు"మతి (సరుకులు ఎక్కించడం, దించడం, ex"port", im"port") అంతా నౌకల ద్వారానే జరిగేది. నౌకలు రేవులో ఆగుతాయి. అలా ఆగిన నౌకల్లోంచి వర్తకులు "దిగబడతారు". ఇలా దిగబడే ప్రక్రియ "పత" చెందడం, దిగిన ప్రదేశం "పత్తనం" జరిగిన ప్రాంతం, లేదే పత్తనం లేదా పట్టణం లేదా పట్నం అయింది. అదీ సంగతి.