Pages

Monday, January 16, 2023

దైవాధీనం జగత్ సర్వం - శనివారం - సత్సాంగత్యం  01/14/23


దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనం తు దైవతం

తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దైవతం


ఈ ప్రపంచఁవంతా దైవాధీనం. అంటే దైవీశక్తుల అధీనంలో ఉంది. పంచ అంటే ఐదు. ప్రపంచము అంటే పంచభూతాలతో ఏర్పడినది, సాగుతున్నదీనూ. ఏంటా ఐదు ప్రకృతి శక్తులు? పృథివ్యాపస్తేజోవాయురాకాశాలు - ఆకాశం, గాలి,  నిప్పు, నీరు, భూమి. ఈ ఐదు శక్తులూ దైవాధీనంలో ఉంటాయి.


మరి ఆ దైవం ఎవరి అధీనంలో ఉంది? వేదమంత్రాల అధీనంలో.

ఆ వేదమంత్రం ఎవరి అధీనంలో ఉంటుంది ?


1. ఆ మంత్రాన్ని దర్శించిన వాళ్ళల్లోనూ. 


దర్శించడఁవంటే?  ఈ సృష్టిలో ఎన్నో నిజాలూ, విషయాలూ ఉంటాయి. కొన్ని కనబడేవి, కొన్ని వినబడేవీనూ. కానీ ఇదే సృష్టిలో కనబడనివి, వినబడనివీ, ఎవరికీ తెలియనివీ అయిన విషయాలెన్నో. అలాగ బయటికి తెలియని విషయాల్ని వెతికి వెలికి తీయడఁవే దర్శించడఁవంటే. 


2. అలా దర్శించిన నిజాల్ని రాద్ధాంతం చేసి సిద్ధాంతీకరించిన వాళ్ళల్లోనూ


3. అలా సిద్ధాంతీకరించి కూర్చబడిన మంత్రాన్ని ప్రతిదినం నేర్చుకుంటూ, నేర్పుతూ, వల్లెవేస్తూ, దాన్ని కలకాలం కాపాడే వాళ్ళలోనూనూ.


ఇలా దర్శించి, సిద్ధాంతీకరించి, నేర్చుకుని, నేర్పించి, ఆ మంత్రాన్ని ఎప్పటికీ సజీవంగా ఉండాలని అహర్నిశలూ (అహః అంటే పగలు, నిశా అంటే రాత్రి) అంటే రాత్రీ పగలూ కష్టపడే బ్రాహ్మణుడి అధీనంలో ఉంటుంది మరి ఈ ప్రపంచాన్ని అధీనంలో ఉంచుకున్న దైవాన్నే తన అధీనంలో ఉంచుకున్న మంత్రం. 


మరి అలాంటి బ్రాహ్మణుడు నాకు పూజనీయుడు. ఇదీ పై సుభాషితానికర్థం.


ఇక్కడ తెలియవలసిన విషయం ఏంటంటే, బ్రాహ్మణుడు అంటే సంఘంలో ఒక కులానికి సంబంధించిన వాడు కాదని. బ్రహ్మ అంటే ఒక అర్థం వేదం. సంహిత. ఆ వేదాన్ని అన్వయించి అందరికి వివరించి చెప్పే గ్రంథాలు బ్రాహ్మణాలైతే చెప్పేవాడు బ్రాహ్మణుడు. శాస్త్రజ్ఞులు, విజ్ఞానవంతులు, పండితులూ, వీళ్ళంతా బ్రాహ్మణులే. కులంతో పనిలేదిక్కడ. 


పై విషయం నాకెలా తెలిసింది మరి? క్రిందటి శనివారం సాయంత్రం పండితులూ, పురోహితులూ ఐన అమరవాది అనిలశర్మతో (Anil Amaravadi | Facebook) చేసిన సత్సాంగత్యంతో. కాస్సేపు తులసితోటలో గడిపితే ఆ సుగంధం మన ఒంటికంటుకుంటుంది. కొంచెంసేపు అత్తరు దుకాణం లో నిలబడి బయటికొస్తే మన ఒళ్ళంతా  ఘుమఘుమలాడిపోతుంది. 


ఇంకా ఉంది....