Pages

Sunday, September 17, 2023

దేవీమహాత్మ్యం - మార్కండేయ పురాణం.....అవతారిక

 వాడి పేరు విరించి. కుర్రాడు కష్టపడి చదువుకుంటున్నాడు. పరీక్షలొస్తున్నాయి. బాగా వ్రాయాలి.ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణుడు కావాలి. ఇది కేవలం తన కోరిక మాత్రఁవే కాదు. అమ్మ, నాన్నలు, గురువులు తన నెత్తిమీద పెట్టిన బాధ్యత. పరీక్షల్లో సఫలీకృతుడైతే గురువులకి పేరొస్తుంది. చదువుకున్న బడికి పేరొస్తుంది. ఆ పాఠశాలకి మరింతమంది తల్లిదండ్రులు తమతమ పిల్లల్ని పంపిస్తారు, తనలాగే చదువుకుని పైకొస్తాడనే ఆశతో. అమ్మానాన్నలు వాళ్ళ కలలు ఫలించేయనానందపడతారు. ఇంత బాధ్యతుంది కాబట్టి తను కష్టపడి, ఏకాగ్రతతో చదూకుంటున్నాడు. ఇంతలో బయటనుంచి మోటర్సైకులు హారను. కిటికీలోంచి కిందకు చూస్తే ఇద్దరు ఫ్రెండ్సు. వైనుగాడూ, కైటు గాడూనూ. ఇంతకీ అవి వాళ్ళసలు పేర్లు కాదు. 

మొదటివాడిపేరు మధుసూదన్. వాళ్ళమ్మానాన్నలకి పార్టీలంటే మహాసరదా. మందుకొడితే మహబాగుంటుంది. మర్యాద కూడానూ. అదిగో ఆ సరదాతోనే మధుసూదనాన్ని మధు అన్ని ముందు కొన్నాళ్ళు పిలుచుకుని, అదంత స్టైలుగా లేదని "వైన్" అని పిలవడం మొదలుపెట్టేరు మత్తుగా. అలాగ వాడు వైను గాడయ్యేడు.

ఇంక రెండోవాడు. చిన్నప్పుడు వాళ్ళ తాతగారి అభ్యర్థన మీద విష్ణుమూర్తి పేరని వాడికి  కైటభజిత్ అని నామకరణం చేసేరు. దాన్ని కాస్తా కురచ చేసి కైటబ్ అని పిలిచేవారింట్లో. భ పలకదు కదా మరెవరికీను. ఆ కైటబ్ బళ్ళోకెళ్ళిన తర్వాత కైటు గాడైపోయేడు మరి.

ఇద్దరికిద్దరే. ఇంట్లో అడిగేవాళ్లు లేరు. అమ్మానాన్నలు ఐతే ఉద్యోగాలూ లేకపోతే పార్టీలూనూ. అబ్బాయిలు వాళ్ళ పాటికి వాళ్ళు. మోటరు సైకిళ్ళమీద షికార్లు, సినిమాలు, సిగరెట్లు, సరదాలు. చదవడానికి తీరిక లేదు, దొరకదు. ఇద్దరూ విరించికి స్నేహితుల్లాంటివాళ్ళు. లాంటివాళ్ళెందుకంటే, విరించికి వాళ్ళతో కలిసి తిరగడం ఇష్టం లేదు. కానీ వాళ్ళు మాత్రం హోంవర్కులో హెల్పనీ, పరీక్షల్లో పంజేస్తాడనీ వీడి వెనక పడుతూంటారు. కావలసిన సహాయం తీసుకంటున్నా, పైకి ప్రియంగా మాట్లాడుతూన్నా, లోపల మాత్రం ఒక రకఁవైన అక్కసు, ఈర్ష్య. పాంగాడూ, పిడిగాడు అని అందరి దగ్గిరా ఆడిపోసుకుంటూంటారు. ఇది మామూలుగా అన్ని చోట్లా చూసేదే. బాగా చదివేవాడ్ని చూస్తే వాడిలా మనం ఉండలేకపోతున్నాఁవే అనే బాధతో కూడిన ఈర్ష్య, ఆ ఈర్ష్య వల్లేర్పడిన అసూయతో చేసే దాష్టీకం. దుష్టులకి దూరంగా ఉండమంటారందుకే. 

కానీ వాళ్ళని వెళ్ళగొట్టలేకపోతున్నాడు విరించెంత ప్రయత్నించినా. నాన్నని పిలుద్దాఁవంటే నైట్‌షిఫ్ట్నుంచొచ్చి న్యాపు తీసుకుంటున్నాడు. ఆ అబ్బాయి బాధ పక్కింటి బాల్కనీలోంచి చూసింది పెద్దత్త కాళేశ్వరి. అక్కాతమ్ముళ్ళిద్దరూ ఒకటే అపార్ట్‌మెంట్ కాంప్లెక్సులో ఉంటారు మరి. వెంటనే ఫోన్‌జేసి తమ్ముడ్ని నిద్రలేపింది. అలా నిద్రలేచిన నాన్న బయటికి రావడం చూసిన వైనుకైటులిద్దరూ మరి వెనక్కి చూడకుండా బైకు లంకించుకున్నారు.

అందుకే అంటారు కూసేగాడిదొచ్చి మేసే గాడిదని చెరిపిందని. అలా చెరపకుండా ఉండాలంటే పెద్దత్తలాంటి వాళ్ళు, నాన్నలాంటి వాళ్ళు ఉండాలి మరి. ఇలాగ దైనందిన జీవితంలో మనపని మనం సజావుగా చేసుకుపోవడానికి అడ్డంకులేఁవీ లేకుండా, రాకుండా ఉండడానికి దైవాన్ని ప్రార్థించమని చెప్పేదే మార్కండేయపురాణంలోని దేవీమహాత్మ్యం అనే భాగంలో వ్యాసుడు వ్రాసిన ఉపాఖ్యానం - మధుకైటభ సంహారం. ఈ దేవీమహాత్మ్యాన్నే వ్యవహారభాషలో కలోక్వియల్‌గా చండీ సప్తశతీ, దుర్గాసప్తశతీ అని పిలవడఁవే కాకుండా చండీహోమం, చండియాగం అనే పేర్లతో హవనక్రియ కూడా చేస్తాం. 

ఏంటా కథ? అసలు దేవీ మహాత్మ్యం సంగతేంటి? అది ఏ సందర్భంలో ఎవరు ఎవరికి చెప్తారు మార్కండేయ మహాపురాణంలో? మార్కండేయ మహాపురాణం కథేంటి? అసలీ పురాణాల కథేంటి. ఎన్ని పురాణాలున్నాయి? పురాణానికీ పురాణానికీ భేదాలేఁవైనా ఉన్నాయా, అన్నీ ఒకటేనా? చండీ సప్తశతిలో ఉన్నవి శ్లోకాలా, మంత్రాలా? సప్తశతి అంటే 700 కదా. నిజంగా 700 శ్లోకాలు కానీ మంత్రాలు కానీ ఉన్నాయా? హవనం ఎలా చెయ్యాలి, ఎలా చెయ్యకూడదు ? ఈ యాగం చేయించే బ్రహ్మగారైన పురోహితుడి కూడా ఋత్త్విక్కుల్లా వెళ్ళే వాళ్ళకి విద్యుక్తధర్మాలు, నిషిద్ధాలూ ఏఁవైనా ఉన్నాయా? ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని, తప్పులు చదవకుండా, అరిచి నోరుపారేసుకున్నట్టు కాకుండా, ఆవేశపడకుండా, మంద్రస్థాయిలో, అర్థం చేసుకుని నిశ్చల మనస్సుతో, ఏకాగ్రతగా పారాయణ చెయ్యడం కానీ, మంత్రం చదవడం కానీ చెయ్యాలంటారు కదా. అదెంతవరకూ అవసరం ? చివర్లో యదక్షర పదభ్రష్టం అని క్షమాప్రార్థన ఎలాగా చేస్తాం కదా, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరఁవా? ఈ విషయాలన్నీ మెల్లిగా చర్చించుకుదాం.  

Monday, January 16, 2023

దైవాధీనం జగత్ సర్వం - శనివారం - సత్సాంగత్యం  01/14/23


దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనం తు దైవతం

తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దైవతం


ఈ ప్రపంచఁవంతా దైవాధీనం. అంటే దైవీశక్తుల అధీనంలో ఉంది. పంచ అంటే ఐదు. ప్రపంచము అంటే పంచభూతాలతో ఏర్పడినది, సాగుతున్నదీనూ. ఏంటా ఐదు ప్రకృతి శక్తులు? పృథివ్యాపస్తేజోవాయురాకాశాలు - ఆకాశం, గాలి,  నిప్పు, నీరు, భూమి. ఈ ఐదు శక్తులూ దైవాధీనంలో ఉంటాయి.


మరి ఆ దైవం ఎవరి అధీనంలో ఉంది? వేదమంత్రాల అధీనంలో.

ఆ వేదమంత్రం ఎవరి అధీనంలో ఉంటుంది ?


1. ఆ మంత్రాన్ని దర్శించిన వాళ్ళల్లోనూ. 


దర్శించడఁవంటే?  ఈ సృష్టిలో ఎన్నో నిజాలూ, విషయాలూ ఉంటాయి. కొన్ని కనబడేవి, కొన్ని వినబడేవీనూ. కానీ ఇదే సృష్టిలో కనబడనివి, వినబడనివీ, ఎవరికీ తెలియనివీ అయిన విషయాలెన్నో. అలాగ బయటికి తెలియని విషయాల్ని వెతికి వెలికి తీయడఁవే దర్శించడఁవంటే. 


2. అలా దర్శించిన నిజాల్ని రాద్ధాంతం చేసి సిద్ధాంతీకరించిన వాళ్ళల్లోనూ


3. అలా సిద్ధాంతీకరించి కూర్చబడిన మంత్రాన్ని ప్రతిదినం నేర్చుకుంటూ, నేర్పుతూ, వల్లెవేస్తూ, దాన్ని కలకాలం కాపాడే వాళ్ళలోనూనూ.


ఇలా దర్శించి, సిద్ధాంతీకరించి, నేర్చుకుని, నేర్పించి, ఆ మంత్రాన్ని ఎప్పటికీ సజీవంగా ఉండాలని అహర్నిశలూ (అహః అంటే పగలు, నిశా అంటే రాత్రి) అంటే రాత్రీ పగలూ కష్టపడే బ్రాహ్మణుడి అధీనంలో ఉంటుంది మరి ఈ ప్రపంచాన్ని అధీనంలో ఉంచుకున్న దైవాన్నే తన అధీనంలో ఉంచుకున్న మంత్రం. 


మరి అలాంటి బ్రాహ్మణుడు నాకు పూజనీయుడు. ఇదీ పై సుభాషితానికర్థం.


ఇక్కడ తెలియవలసిన విషయం ఏంటంటే, బ్రాహ్మణుడు అంటే సంఘంలో ఒక కులానికి సంబంధించిన వాడు కాదని. బ్రహ్మ అంటే ఒక అర్థం వేదం. సంహిత. ఆ వేదాన్ని అన్వయించి అందరికి వివరించి చెప్పే గ్రంథాలు బ్రాహ్మణాలైతే చెప్పేవాడు బ్రాహ్మణుడు. శాస్త్రజ్ఞులు, విజ్ఞానవంతులు, పండితులూ, వీళ్ళంతా బ్రాహ్మణులే. కులంతో పనిలేదిక్కడ. 


పై విషయం నాకెలా తెలిసింది మరి? క్రిందటి శనివారం సాయంత్రం పండితులూ, పురోహితులూ ఐన అమరవాది అనిలశర్మతో (Anil Amaravadi | Facebook) చేసిన సత్సాంగత్యంతో. కాస్సేపు తులసితోటలో గడిపితే ఆ సుగంధం మన ఒంటికంటుకుంటుంది. కొంచెంసేపు అత్తరు దుకాణం లో నిలబడి బయటికొస్తే మన ఒళ్ళంతా  ఘుమఘుమలాడిపోతుంది. 


ఇంకా ఉంది....