Pages

Saturday, March 31, 2018

పుస్తకం వనితా విత్తం -- Pustakam Vanitha Vittam

పుస్తకం వనితా విత్తం, పరహస్తగతం గతం |
అథవా పునరాయాతి, జీర్ణం భ్రష్టా చ ఖణ్డశః ||

పుస్తకం, ఆడమనిషి, డబ్బు. ఇవి మూడూ ఒకసారి చేతులు మారితే మళ్ళీ రావు. ఒకవేళ వచ్చినా, పుస్తకమైతే చిరిగిపోయో, ముడతలు పడిపోయో, అనేకరకాలుగా జీర్ణమైపోయి వస్తుంది. మరి ఆడపిల్లైతే భ్రష్టు పట్టి వస్తుంది. ఇది ప్రస్తుత కాలానికి పూర్తిగా వర్తించదు. పాతరోజుల్లో కన్యాదానం చేసిన తర్వాత అమ్మాయి ఇంటి పేరు మారి అత్తారింటికెళ్ళిపోయేది. మళ్ళీ పుట్టింటికి చుట్టపుచూపుగా రావడం తప్ప శాశ్వతంగా వచ్చేసిందంటే ఏదో తీరని నష్టం వచ్చి దిక్కు లేకుండా పోయినట్టే. దాన్నే భ్రష్టు పట్టిపోవడఁవంటారు. ఇక ఆఖరిదైన డబ్బు. ఎవరైనా అవసరంలో ఉన్నారని ఒక లక్షో ఎంతో చేబదులుగా ఇచ్చేవఁనుకోండి. అదీ మళ్ళీ వస్తే వింతే. ఒకవేళ వచ్చినా ఒకసారి వంద, ఒకసారి  వెయ్యీ గా వస్తుంది తప్పితే, ఇచ్చేటప్పుడు చెప్పిన విధంగా అంత మొత్తమూ ఒకేసారి ఒకే సమయానికందదు.    

Saturday, March 3, 2018

గరికపాటి నరసింహారావు - ప్రసంగ సమీక్ష

ఒక అవధానికీ, ప్రవచనకర్తకీ చాలా తేడా ఉంటుంది. అవధానిగారు వేదికనెక్కి ఆయన ప్రజ్ఞనీ, ధారణ శక్తినీ బాగా ప్రదర్శిస్తూంటే పదిమందీ బాగుందనుకుంటారు. అప్పుడు ఆ పండితుడు చేసేది కేవలం కళాత్మకమైన భాషానైపుణ్య ప్రదర్శనమే తప్ప సమాజం, సంస్కృతి, దైవం, వేదాంతం మొదలైన విషయాల మీద ప్రసంగించటంగానీ (విషయాల్ని విడమర్చి చెప్పడం) ప్రవచించడంగానీ (మంచిమాట) చేయటం లేదు. ఇలాంటి అవధానం చేసే సందర్భంలో సభకి వచ్చినవారిని నవ్వించడానికి వినోదాత్మకమైన చతురోక్తులాడడమూ, మరీ ఇరకాటంలో పెడుతున్న ఒకరో ఇద్దరో పృచ్ఛకుల్నుద్దేశించి వెగటు పుట్టించనివీ, వెకిలిగా అనిపించనివీ అయిన నాలుగు ఛలోక్తులు విసరడమూ మామూలే. బాగుంటుంది కూడా.

అయితే, భాషా సంస్కృతుల విషయాల గురించి మాట్లాడడానికో, విద్యాసంస్థల స్నాతకోత్సవాలలో (graduation ceremonies) ప్రధాన వక్త (keynote speaker) గానో, లేదా ధార్మిక విషయాల ప్రవచనకర్తగానో, వేదికనెక్కినప్పుడు ఆ మనిషికి ఒక ప్రత్యేక గౌరవమివ్వబడుతుంది. గురుస్థానంలో ఉన్న అటువంటి వ్యక్తి, ఆనాడాసభకొచ్చిన వాళ్ళని ప్రత్యక్షంగానూ, ఆ రోజు ప్రసంగాన్ని కొంతకాలం తర్వాత టీవీ, వీడియో, యూట్యూబ్ లాంటి ప్రసార మాధ్యమాలలో చూసేవారిని పరోక్షంగానూ ప్రభావితం చేసే అవకాశముంటుంది. అందువల్ల ఇలాంటి "గురువు" గారిమీద "మంచివిషయాలు" మాత్రమే చెప్పే గురుతరమైన బాధ్యత ఉంటుంది. నో ఇతరాణి. అంటే మంచిమాటలు కానివీ, ద్వంద్వార్థాల మాటలూ, వివాదాస్పదమైన విషయాలూ చెప్పడమూ, ఎవరినీ వారివారి ఆకారవికారాలూ, కుటుంబ పరిస్థితులూ, ముసలి వయస్సూ, మొదలైన వాటి విషయాలపై కించపరిచేలా మాట్లాడడమూ చాలా పెద్ద తప్పు. అలాచేసే వాళ్ళు మళ్ళీ అలాంటి వేదికలెక్కి మాట్లాడడం మానుకుంటే బాగుంటుంది.

ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే, గత కొంత కాలంగా గరికపాటి నరసింహారావు గారి అవధానాలూ, ప్రవచనాలూ, ప్రసంగాలూ, టీవీ, యూట్యూబుల్లో చూసి, మంచి విషయాలు చెప్తుంటే బాగుందని సంతోషించి, అంత మంచివి కానివి చెప్పినప్పుడు, "అయ్యో ఇంత పెద్దాయన ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడూ ప్చ్" అనుకుని,  మరీ చెత్తగా, పదిమంది నవమానం చేస్తూ మాట్లాడినప్పుడు బాగా కోపం వచ్చి జమకూడిన ఆలోచనల్ని పదిమందితో పంచుకోడానికి. చెప్పాలంటే నరసింహారావుగారు సంస్కృతాంధ్ర భాషాసాహిత్యాలపైనా, ధార్మిక, లౌకిక విషయాలపైనా, మంచి పట్టున్నవారు. ఏ విషయం గురించైనా అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యమున్నవారు. ఐతే, చంద్రుడికో చిన్న మచ్చ ఉన్నట్టు, ఈయనక్కూడా ఒక మచ్చ ఉంది. అది రోజురోజుకీ పెద్దదైపోతోంది. పెద్దదైపోతూ, అతని విద్వత్, పాండిత్యాలపై అభిమానమూ గౌరవమూ ఉన్నవాళ్ళని అతని నుంచి దూరం చేస్తున్నాయి. ఎలాగో చూద్దాం. గరికపాటివారు ఏదైనా మంచి విషయం  గురించి చెప్పే సందర్భంలో బోలెడు లౌకికవిషయాలని గుర్తు చేస్తారు. మంచిదే. అలాచేస్తే, చెప్పవలసిన అసలు విషయం బాగా బోధపడుతుంది. అయితే, ఇలాటి సంగతులు చెప్పేటప్పుడు, జనాన్ని నవ్వించాలనో, లేక సంవత్సరాల తరబడి చేస్తూన్న అవధానాల వల్ల అలవాటైన (దుర్)లక్షణమో తెలీదుగానీ, అంతో ఇంతో పేరుగలవారినో, లేదా ఏదో ఒక సామాజిక వర్గానికి చెందిన వారినో, హద్దుకి మించి విమర్శించడం, అవహేళన చేయడం చేస్తారు. ఇలాటి శృతిమించిన ప్రేలాపన అప్పటికి కొంతమందికి నవ్వు తెప్పించొచ్చు. కానీ, లోతుగా ఆలోచిస్తే, నరసింహారావుగారి లాంటి విద్వద్వర్యులూ, గురుతుల్యులూ మాట్లాడవలసిన పద్ధతేనా ఇది అనిపిస్తుంది. ఒకసారి మంథెన సత్యనారాయణగారైతే, ఇంకొకసారి చాగంటి కోటేశ్వరరావుగారు. ఒక సందర్భంలో పిల్లలు దూరప్రదేశాలకో, ఇంకా దూరమైన విదేశాలకో వెళ్ళిపోతే, తమంత తాము స్వతంత్రంగా బ్రతుకుతున్న తలిదండ్రుల మీద. ఒక ప్రసంగంలో హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద ఊళ్ళల్లో కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతూన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులమీదైతే, ఇంకొక సభలో పొట్టపోసుకోవడానికి విదేశాలకి వెళ్ళి అక్కడే స్థిరపడిన ప్రవాసాంధ్రుల పైన. ఈయన వెటకారానికి హద్దులేదు. ఈయన విమర్శలకి ఎవరైనా బలే. పదిమందిని నవ్వించడానికి వేరే పదిమందిని అవమానించినా ఫరవాలేదు. ఇదే ఆయన సిద్ధాంతమనిపిస్తుంది.

https://www.youtube.com/watch?v=4KNr4S4f-uY&t=135s

చిన్న ఉదాహరణ. పై వీడియో చూడండి. సంస్కృతి మీద స్వదేశీ జాగరణ మంచ్ వారి వేదికపై రావుగారు చేసిన ప్రసంగమిది. ఇది సుమారు ఇరవై ఒకటిన్నర నిమిషాలుంటుంది. అంతసేపూ కూడా ఎవర్నో పొడుస్తూన్నట్టుందే తప్ప ఏదైనా మంచి విషయం చెప్పినట్లని వినిపించదు. ఒకవేళ చెప్పినా ఆయన చేసే వెటకారపు దుర్గంధంలో మంచి కొట్టుకుపోయింది.

1. వీడియో మొదలు: అసలు మన సంస్కృతి గూర్చి గొప్పగా చెప్పాలంటే ఇంకొకరి సంస్కృతిని దూషించాలా, తప్పదా? అలా చేయడం, ఎక్కడ్నుంచో వచ్చి, సనాతనధర్మం గూర్చి కొంతవరకూ తెలుసుకుని అందులో (బయటనుంచి) తప్పుగా అనిపించిన ధర్మసూత్రాల్నీ, నియమాల్నీ ఎత్తి చూపించి, కొంతమంది అమాయకుల్ని మోసగించి వారికి తమ మతం అంటగట్టిన సూఫీలదీ, మిషనరీలదీ కదా. మన అలవాటుకాదే. అయినా తెలీక అడుగుతాను. వ్యాపారం చేయడం తప్పా? హోటల్ కట్టి వ్యాపారం చేసేవాడు పాపాత్ముడూ, గుడికట్టే వాడు పుణ్యాత్ముడానా. ఇదెక్కడి వాదన. హోటల్ కట్టి పదిమందికి బ్రతుకుతెరువు చూపెడుతున్నాడు కదా ? అయినా ఈ విషయం నిజంగా వివేకానందస్వామి చెప్పినదేనా? అదెక్కడ వ్రాసేరో కొంచెం చెప్తారా, చదువుకుంటాను? నాకు తెలిసినంత వరకూ స్వామి చికాగోలో సనాతన ధర్మాన్ని పశ్చిమానికి పరిచయం చేశారేగానీ, పరమతాల్ని చులకన చేయలేదు. అలాచేస్తే ఆయన స్వామి అవరు.

2. 1:55 మార్కరు నుండీ పదిహేను క్షణాలపాటు, ఆయన తూర్పు దిక్కు పడమర కంటే ఎంత గొప్పదో చెప్తున్నారు. నిజమా ? దిక్కులలో ఉచ్ఛనీచాలున్నాయా? మరి తూర్పు సంధ్య, పడమటి సంధ్య అని రెండింటినీ ఎంతో పవిత్రంగా చూస్తాం ? తూర్పువైపు తిరిగి తత్పురుషరూపలో ఉన్న శివుడ్ని పూజిస్తే, పడమరవైపు సద్యోజాత రూపంలో ఉన్న అదే శివుడ్ని పూజిస్తున్నాం ?
మనకి పడమర ఉన్నవారు మనకన్నా హీనులైతే, మనకి తూర్పున ఉన్నవారికన్నా మనం హీనులమా? ఎందుకండీ, లేని వైషమ్యాల్ని చూపించి దిక్కులకి దోషాలు అంటగడతారు?

3. 2:08 మార్కరు : ఎవరికైనా ఎనభయ్యేళ్ళు దాటేయంటే వాళ్ళు స్విచ్చాపేసిన సీలింగ్‌ఫ్యాన్ లాంటి వాళ్ళట. సభలో అనవలసిన మాటేనా ఇది? అదీ గురుస్థానంలో ఉన్న ఒక విద్వాంసుడు. అతనేదో మంచి చెప్తారనే నమ్మకంతో వయసు పైబడిన వృద్ధులెవరైనా ఆయన ప్రసంగం వింటే? లేదా ముసలివారైన తలిదండ్రులున్న వాళ్ళెవరైనా వింటే? అయినా ఏ వయసువార్నైనా ఇంక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండండి అనొచ్చా? చచ్చిపోవడానికి ఏ వయసైతేనేంటి? తప్పు రావుగారూ!

4. 6:08 మార్కరు : కళేబరమంటే శవమా ? నిజమే? మరి మూలకూటత్రయ కళేబరా, అని లలితా సహస్రనామాలలో చెప్పుకుంటాం? కళేబరానికి శరీరము, మేను అని చెప్పేరే గానీ ప్రాణం లేని శరీరము, శవము అని చెప్పలేదే నిఘంటువులో?  గీర్వాణం తెలిసిన గరికపాటి గారు ఏం చెప్తే అదే నిజమనుకుంటారు కదా జనం. తెలుగు పంతులు తప్పు చెప్పొచ్చా?

5. 8:06 మార్కరు : ఇంక ఇక్కడ్నించీ అమెరికా మీద, అమెరికా వలసవెళ్ళిన తెలుగువారిమీద విరుచుకుపడి విశ్వరూపం చూపిస్తారు గురువుగారు. ఇక్కడ అన్నం దొరకదా, అమెరికా వెళ్ళాలా అని అడుగుతున్నారు. ఉద్యోగరీత్యానో, బ్రతుకుతెరువు కోసమో, వేరే కారణాలవల్లో వేర్వేరు దేశాలకీ, ప్రదేశాలకీ వలస వెళతారు మనుషులు. మరి అన్నం దొరక్కేనా గోదావరొదిలి హైదరాబాదులో మకాం పెట్టేరు గరికపాటి వారు ?

పదహారు సార్లు అమెరికా వెళ్ళేరట. ప్రతీసారీ ఒంటరిగా వెళ్ళినా, క్రిందటిసారి మాత్రం తమ భార్యకి కూడా టికెట్టు కొనమని ఎంత నిక్కచ్చిగా చెప్పేరో, ఎంతో నీచమైన గూడార్థంతో చెప్తున్నారు. ఎప్పుడు వెళ్ళినా డబ్బు సంపాదించడానికి వెళ్ళలేదుట. అమెరికాలో ఉన్నవారిని "ఉద్ధరించడానికే" వెళ్ళేరుట. చాలా దయామయులు.

2000 సంవత్సరంలో తానా వాళ్ళు పిలిచేరుట కానీ, వీసా రాలేదుట. అసలు వేరే దేశం వెళ్ళడానికి వీసా అనేదొకటుందని తెలీదుట గురువు గారికి. "మంచి మైకులోనీ చెడు చెవిలోనీ చెప్పమన్నారు" అని చెపుతూనే ఆయనకి చెడు అనిపించిందంతా మైకులేనే చెప్పేరు మహానుభావులు. విషయమేంటంటే చెప్పే చెడ్డంతా వివేకానందుల పేరు చెప్పి చెప్పేరు అన్యాయంగా. తానా ప్రెసిడెంట్ ఫోన్‌చేసి  "మీరు వీసారాని దురదృష్టవంతులు" అని "వెధవ ఇంగ్లీషు" లో  అన్నార్ట. దానికి ఈయనకి చాలాకోపం వచ్చింది. ఇంకేముంది? ఆయనతో ఇంగ్లీషులో మాట్లాడడానికీ, తెలుగులో చెప్పకపోవడానికీ ఆ ప్రెసిడెంట్ గారిని నానా మాటలూ అని, ఆశుకవితాధురీణులు కదా, ఒక పద్యం వ్రాసి పంపిస్తే, తానా వారు ఎంతో గౌరవంతో ఆ పద్యాన్ని వారి ఉత్సవ ప్రత్యేకసంచికలో ప్రచురించేరుట. ఆ పద్యం ఎంత సోత్కర్ష, ఏహ్యభావాలతో ఉందో చూడండి. "మెరిక ముందర (అ)మెరిక గరికపాటి". అమెరిక అంటే దిక్కుమాలిన దేశమూ, తెలివితేటలులేని మందకొడి "వెధవలు" ఉండే దేశమని అర్థంట ఈ పద్యానికి. ఆహ్వానించిన తానావారి ఇంటిపేరుట అమెరిక. ఈయన ఇంత జుగుప్సాకరంగా చవకబారు అర్థంతో వ్రాసిన పద్యమైనా తానా వారు సహృదయంతో, తమ మాతృభాషాభిమానంతో ఆ భాషలో పండితులైన శ్రీ రావు గారి మీద గౌరవంతో ఆ పద్యాన్ని ప్రచురించేరు. అయినా ఈయన అక్కసు తీరలేదు. పన్నెండేళ్ళ తర్వాత ఇంకా వెళ్ళగక్కుతున్నారు. ఇందులో ఎవరిది విశాలహృదయమో, ఎవరివి సంకుచిత భావాలో విజ్ఞులకి తెలియాలి. అసలు ఒకటి జరిగుంటుంది. ఆ తానా ప్రెసిడెంట్‌గారు అలవాటు ప్రకారం ఇంగ్లీషులో "It is unfortunate that you didn't get visa Mr.Narasimha Rao" అని పరామర్శగా అనుంటారు. అది గురువుగారు అపార్థం చేసుకుని పన్నెండేళ్ళ తర్వాత బాధ పడుతునారు.

ఇలాగే సాగుతుందీ ప్రసంగమంతా. ఒకటో రెండో మంచిమాటలు చెప్పకపోలేదు. కానీ.... అదీ సంగతి!








Monday, January 15, 2018

వెఱ్ఱిగొల్లడు అంటే తప్పేంటి?

ఇది జరిగి అప్పుడే కొంతకాలమైంది. చాగంటి కోటేశ్వరరావుగారు అందరికీ తెలిసిన మంచి ప్రవచన కర్త. ఆయన పదిమంది మంచికోరి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం తన తృప్తికోసం తనకి తెలిసిన పౌరాణిక, ధార్మిక విషయాలని వాటి వెనుక నిగూఢంగా ఉన్న తత్త్వార్థంతో సహా మామూలు మనుషులకర్థమయ్యే భాషలో విడమర్చి చెప్తూ తనకి తెలియకుండానే ఎంతోమందికి మార్గదర్శకులైన మంచిమనిషి. అలాంటి చాగంటిగారు ఆ మధ్య ఒకానొక సందర్భంలో విష్ణుమూర్తి అవతారాలైన రామకృష్ణులిద్దరినీ, వాళ్ళు పుట్టిపెరిగిన వాతావరణ పరిస్థితుల బట్టి పోలుస్తూ కృష్ణుడ్ని "వెఱ్ఱి గొల్లడు, తలకడిగితే మొలకడగడం తెలియని వాడు" అన్నారు. అంతే. ఆ మాటమీద తెలుగుదేశంలో పెద్దపెద్ద గొడవలయిపోయేయి. రాస్తారోకోలు, చాగంటిగారి బొమ్మని అందరూ చూస్తూండగా అవమానించడాలూ, ఆయన్ని నానా మాటలూ అనడాలూ, టీవీలో చర్చలూ, వాదోపవాదాలూ, ఒకటేంటి. ఎంత హడావిడి జరగొచ్చో అంతా జరిగింది. ఎవరితోనూ గొడవకి దిగడం ఇష్టంలేని మంచాయన చాగంటిగారు, ఈ విషయం వెంటనే సద్దుమణిగి పోవాలనే మంచి ఉద్దేశ్యంతో గొల్లకులం వారందరికీ క్షమాపణ చెప్పుకున్నారు.

ఇంతకీ గొల్ల అనే మాట మంచిదో కాదో చూద్దాం. గోపాలః అనేది సంస్కృత పదం. దీని అర్థం గోవులను పాలించేవాడు లేదా పశుపాలనే వృత్తిగా బ్రతికేవాడు అని. ఇది తెలుగులోకి వచ్చేసరికి గోపాలుడు అయ్యింది. దీనికి బహువచనం గోపాలురు అవుతుంది. అయితే, ఏ భాషలోనైనా ప్రకృతి, వికృతి అని ఉంటాయి. గ్రాంథికపదాలు ఆ భాష నుడికారానికి అనుగుణంగా వాడుకలోకి వచ్చినప్పుడు కొంతమారడం సహజం. శిష్టపదాల్ని ప్రకృతులనీ, వాడుకపదాల్ని వికృతులనీ అంటాం.
ఉదా: బ్రాహ్మణుడు -- బాపడు, శ్రేష్ఠి -- శెట్టి, నాయకుడు  -- నాయుడు. అలాగే గోపాలుడు గొల్లడు గానూ, గొల్ల గానూ వికృతి చెందిన పదం. ఈ పదాలు తెలుగులో ఎప్పట్నుంచో వాడుకలో ఉన్నవి. అన్నమాచార్యులుగారు ఆయన వ్రాసిన కీర్తనలలో చాలాచోట్ల గొల్ల, గొల్లడు, గొల్లెత అనే పదాలు వాడేరు. శ్రీకృష్ణుడిని తమ కులస్థుడిగా భావించేవాళ్ళు వాళ్ళని వాళ్ళే "మేము గొల్లలం" అని చెప్పుకుంటారు. గొల్లపేరుతో మొదలయ్యే ఊళ్ళూ గుళ్ళూ చాలా కనపడతాయి. విశాఖపట్నంలో "గొల్ల కంచరపాలెం" అనే ప్రాంతముంది. కాకినాడ పొలిమేర దగ్గిర "గొల్లల మామిడాడ" అనే ప్రఖ్యాత సూర్యక్షేత్రముంది. ఇంక తిరుమలలో గొల్లవారికున్న ప్రాముఖ్యత, విలువ అందరికీ తెలిసిందే. మరి  ఇంత చరిత్ర, అస్తిత్వం, పేరుప్రఖ్యాతులూ ఉన్న వర్గం వారు తమని తాము వేరే విధంగా పిలుచుకోవాలని ఎందుకనుకుంటున్నారో, వాళ్ళకే తెలియాలి.

ఇప్పుడు వెఱ్ఱిగొల్లడు అనే పదం సరైన మాటో కాదో చూద్దాం. వెఱ్ఱి అనే పదానికి మతిలేనివాడు అనే కాకుండా అమాయకుడూ, కల్మషంలేనివాడూ అనే అర్థం కూడా ఉంది. ఒకప్పుడు మనదేశంలో ఎవరిమటుకు వారు వాళ్ళవాళ్ళ కులవృత్తులు మాత్రమే చేసుకుని బ్రతికేవాళ్ళు. ఒకమనిషి గొడ్లు కాచుకోవడం, వాటిపాడిమీద ఆధారపడి బ్రతికేవారి కులంలో పుడితే తనూ చిన్నప్పట్నుంచీ గొడ్లకి సంబంధించిన పనులే చేస్తూ పెరిగేవాడు. అతనికి వేరే చదువు, విద్యలతో పనీ, పరిచయం ఉండేవికాదు. ఆ రోజుల్లో ఈ గోపాలన అనేది అతిమామూలు వృత్తి కాబట్టీ, పెద్దగా ఆలోచన ఉపయోగించి చేయాల్సిన పనికాదు కాబట్టీ, అటువంటి గొల్లవానికి లోకజ్ఞానం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఇలాగ పెద్దగా ప్రాపంచిక విషయాలు తెలియకుండా కల్లాకపటంలేని జీవనం గడిపేవాడిని "వెఱ్ఱిగొల్లడు" అనడం వాడుకలో ఉండేది. ఇదేదో అతన్ని కించపరచడానికో, అవమానించడానికో అనేమాటకాదు. ఆ మాటకొస్తే, వెఱ్ఱిగొల్లడే కాదు, వెఱ్ఱిబాపడనే మాటకూడా ఉంది.  రోజూ గుళ్ళో దేవుడ్ని సేవించుకుంటూ, వాళ్ళూ వీళ్ళూ ఇచ్చిన దక్షిణతోనూ, గుళ్ళో ప్రసాదంతోనూ బ్రతికే నిష్కల్మషమైన బ్రాహ్మణుడ్ని అలా అనేవారు.

ఇంక తలకడిగితే మొలకడగడం తెలియని వాడు అన్న విషయం. భాష తెలియకపోతే వచ్చే చిక్కులివి. ఇక్కడ ఏదో కడుక్కోడం గురించి ప్రస్తావించట్లేదాయన. తలకి అడిగితే మొలకి అడగడు అని అర్థం వచ్చేమాట కాస్తా అనర్థం అయికూర్చుంది తెలుగుభాషా మూఢులకి. కథ ఏంటంటే,  అమాయకుడూ, లోకజ్ఞానంలేనివాడూ అయిన ఒకానొక పేదవాడు ఈశ్వరుడి గురించి తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాట్ట. ఒంటిమీద కట్టుకోడానికి కూడా లేని ఈ పేదభక్తుడు స్వామిని ఒక తలపాగా ఇప్పించమన్నాట్ట. అప్పుడీశ్వరుడు నవ్వి, "తలకిస్తానుగానీ మొలకేం కడతావ్ మరి!" అన్నాడు. అప్పుడీ అమాయకుడు "సరే అయితే, మొలకి కట్టుకోవడానికొక గుడ్డ ఇవ్వండి స్వామీ, తలకొద్దులెండి" అన్నాట్ట. తలకీ, మొలకీ రెంటికీ ఇమ్మని కూడా దేవుణ్ణడగలేనంత అమాయకుడు మరి.

ఇదంతా చూస్తే ఉత్తిపుణ్యానికి ఒక మంచిమనిషిమీద బురద చల్లడానికి తప్పితే ఈ గొడవకి అర్థం లేదనిపిస్తుంది. అదీ సంగతి.

Saturday, January 13, 2018

శంకరా నాదశరీరా పరా

శంకరా నాదశరీరా పరా

శంకరాభరణం సినిమా గురించి తెలియనివాళ్ళూ, కనీసం అందులోని పాటలు విననివాళ్ళూ తెలుగువాళ్ళలో ఉండరేమో. సుమారు 38 సంవత్సరాల క్రితం, 1980 ఫిబ్రవరి 12వ తేదీ న విడుదలై, అప్పట్లో వచ్చే సినిమాకథలకి పూర్తి విరుద్ధంగా, సాంప్రదాయ సంగీతసాహిత్యాలకి సంబంధించిన కథతో వచ్చి, దేశాన్ని ఒక్క ఊపు ఊపి, గాయకుడు బాలసుబ్రహ్మణ్యానికి అస్తిత్వాన్నీ, దర్శకుడు విశ్వనాథ్ కి అమరత్వాన్నీ, కవి వేటూరి పాటలకీ, మహదేవన్ సంగీతానికీ అజరామరత్వాన్నీ సంపాదించిపెట్టిన, ఎప్పటికీ జ్ఞాపకముండిపోయే మంచి తెలుగు సినిమా శంకరాభరణం.

సాధారణంగా తెలుగులో ఎప్పుడూ వినే, పాడుకునే పాతపాటలన్నీ (క్లాసిక్స్) ఘంటసాల యుగంలో వచ్చినవే. కానీ శంకరాభరణం పాటల విషయంలో మాత్రం ఈ వాదన చెల్లదు. సంగీత సాహిత్యాలు రెండింట్లోనూ అవి అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మరిచిపోలేనంత గొప్పవి. అయితే, ఆ పాటల సాహిత్యాన్ని ఆస్వాదించేవాళ్ళకన్నా, వాటిని విని ఆ సంగీతాన్ని మెచ్చుకొనేవాళ్ళే ఎక్కువ. కానీ ఒక్కసారి ఆ సాహిత్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకుంటే, ఆహా! అనకుండా ఉండలేం. ఉదాహరణకి శంకరా నాదశరీరా పరా అనే పాట వెనుక సాహిత్యాన్ని పరిశీలనగా చూద్దాం.

శంకరశాస్త్రిగారు ఒక నిశిరాత్రివేళ శివుడికి నివేదనగా వినిపిస్తున్న పాట ఇది.చూడండి ఏమని పిలుస్తునాడో శివుణ్ణి.

"శంకరా, నాదశరీరా, పరా, వేదవిహారా, హరా. జీవేశ్వరా..."

శుభం కలిగించేవాడా, ఓంకార స్వరూపా, వేదాలలో విహరించేవాడా, అజ్ఞానాన్ని హరించేవాడా, జీవులందరికీ ఈశ్వరుడా...

ఎందుకు పిలుస్తునాడు? తను పాడే పాట వినడానికి. అయితే మరీ చప్పగా, "పాట పాడతాను, విందువుగాని రా" అంటే ఆయన శంకరశాస్త్రి గారు ఎందుకవుతారు? ఎంతో కొంత ఉపోద్ఘాతమివ్వాలి. అది కూడా కవితాత్మకమైయ్యుండాలి. ఇదిగో ఇలాగన్నమాట.

"ప్రాణము నీవని, గానమే నీదని, ప్రాణమే గానమని,
మౌన విచక్షణ, గానవిలక్షణ, రాగమే యోగమని,
నాదోపాసన చేసినవాడను, నీ వాడను నేనైతే"

ఓంకారాత్మకమైన శివుడే నా శ్వాసలో ఉన్న ప్రాణశక్తి అని, ఆ ఓంకారంలోంచి పుట్టినదే నేను చేసే గానమని, శబ్దబ్రహ్మమైన రాగాలాపనే యోగమని భావించి నాదోపాసన (సంగీతాన్నే దైవంగా భావించి సాధన చేయడం) చేసే నేను నిజంగా నీ భక్తుడనైతే,

దిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కంధరా నీలకంథరా

అష్టదిగ్గజాలకధిపతివీ (దిక్ + కరి + ఇంద్ర + జిత = దిక్కరీంద్రజిత. అష్టదిక్కులు మోస్తూన్న ఎనిమిది ఏనుగులకి అధిపతులైన అష్టదిక్పాలకుల పైనున్నవాడివి), కైలాసాధిపతివీ (హిమగిరి = కైలాసం), తెల్లనివాడివీ లేదా స్వచ్ఛమైనవాడివీ (సిత), కపాలధారీవీ(కం-ధరా), నీలకంఠుడివీ (నీలకంథరా) .... (అయిన ఓ శివుడా)

క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధరించరా విని తరించరా

అజ్ఞానులకు అర్థంగానిదైన అర్ధరాత్రి నేను చేసే ఈ రుద్రవీణా గానం (అనుమానం: బహుశా అసలు కథ ప్రకారం రుద్రవీణ వాయిస్తూ పాడాలేమో శాస్త్రిగారు. దానికనుగుణంగా పాట వ్రాయడమూ, రికార్డింగ్ చేసెయ్యడమూ అయిపోయుంటుంది. తీరా షాట్ తీసేటప్పుడు చూస్తే రుద్రవీణ అందుబాటులో ఉండుండదు. తుంబురతో సరిబెట్టేసుంటారు. అనుకుంటా...) ఇదిగో నీకే (అవధరించు), బాగా విని ఆనందించవయ్యా

అని పాడుతూంటే, ఇంతలో ఉరుములూ, మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది. అదిచూసి, ఆ శివుడు తన పాట విన్నాడనీ, దాని ఫలితమే ఈ కుండపోత అనీ అనుకుని మహదానందంతో మళ్ళీ ఇలా అందుకున్నాడు మన శంకరశాస్త్రిగారు.

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నగవులు కాబోలు,
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా, ధరకు జారెనా శివగంగా
నా గాన లహరి నువు మునుగంగా ఆనందవృష్టి నే తడవంగా

శివా! నా కవిత్వానికి నువ్వు ముసిముసిగా చిరునవ్వులు నవ్వితే ఒక్కసారి కనిపించి మాయమైన నీ పంటికాంతులేనేమో ఈ మెరుపులు?
నా పాటకి నువ్వు నాట్యం చేయ్యడం మొదలెడితే, నీ కాలి అందెల మువ్వలు శబ్దమనుకుంటా, ఈ ఉరుములు.
నా గానమాధుర్యానికి నువ్వు పరవశించి ఒక్కసారి తలవిదిలించినట్టున్నావు, అంతే. నీ తలమీదున్న గంగ నేలకి జారి వర్షమై పడుతోంది.
నా పాటవెల్లువలో నువ్వు మునిగిపోయి, ఆ ఆనందంలో కురిపించిన ఈ వానలో నేను తడిసిపోయి, భలే!

ఇంతగొప్ప కవిత్వాన్ని మనకందించి వెళ్ళిన వేటూరి గారికి నమస్తే!

Sunday, December 3, 2017

కొఱవి గోపరాజు గారి చమత్కార కవిత్వం

కొఱవి గోపరాజు గారని ఒక మంచి కవిగారు. ఈయన కాలం క్రీ.శ. 1430 - 1530 ల మధ్య. ఈయన సులువుగా అర్థం చేసుకునేలా  ఉండే మామూలు తెలుగుమాటలతో, మంచి చమత్కారంగానూ, సమయస్ఫూర్తి తోనూ పద్యాలు చెప్పేవారు.సింహాసన ద్వాత్రింశిక ఈయన రాసిన ఒక మంచి పద్యకావ్యం. త్రింశ అంటే ముప్ఫై. ద్వా అంటే రెండు. కలిపితే ద్వాత్రింశిక. అంటే ముప్ఫైరెండు. విక్రమార్కుడి సింహాసనం మీదనున్న ముప్ఫైరెండు బొమ్మలు చెప్పిన కథల్ని ఆధారంగా చేసి రాసిన కావ్యమిది.

ముందు చెప్పినట్టు ఈయన పద్యాలు కొన్ని చమత్కారంగా ఉంటే మరికొన్ని ఆలోచింప జేసేవిగా ఉంటాయి.

చమత్కారానికి ఉదాహరణ పద్యం:

 ఒకనియడుగు జేరియొకని యౌదల నెక్కి యొకని వెంట వచ్చి యొకని గలిసి
 వెడలి పారితనుచు విందు మట్లయ్యునీ జీవనంబు లోకపావనంబు.

ఔదల (ఔ + తల ) -- నడినెత్తి

గంగ విష్ణువు పాదాల దగ్గర పుట్టి, శివుడి నెత్తినెక్కి, భగీరధుడి వెనక వెళ్ళి, చివరగా సముద్రుడిలో కలిసిపోతుంది. అయినా ఆవిడ లోకపావనే కదా.

గోపరాజుగారు చెప్పిన తెలివైన పద్యం ఎలా ఉంటుందో చూద్దాం. ఒక బీద బ్రాహ్మణుడికి ఒక పెళ్ళీడుకొచ్చిన కూతురుందిట. ఆ పిల్ల పెళ్ళి విషయమై సాయమడగడానికి విక్రమార్కూడి దగ్గరకొస్తాడు. రాజుని చూస్తూనే ఆయన్ని పొగుడుతూ ఈ కింది సీసపద్యం చెప్తాడు. అది వినగానే రాజుకి విషయమర్థమైపోయి, ఆ పేద కవికి అవసరమైనంత డబ్బిచ్చి పంపిస్తాడు. ఆ పద్యమేంటంటే,

రాజ్యంబు వదలక రసికత్వ మెడలక -- జయశీల ముడుగక నయము చెడక
దీనుల జంపక దేశంబు నొంపక -- నిజముజ్జగింపక నేర్పు గలిగి
విప్రుల జుట్టాల నెన్ను సొచ్చినయట్టి -- వారిని గొల్చినవారి ప్రజల
హర్షంబుతో గాచి యన్యాయ -- ముడుపుచు మున్ను జెప్పినరీతి జెన్నుమీరి
చేతలొండులేక పాత్రల విడువక -- యశముకలిమి తమకు వశముగాగ
వసుధ యేలురాజవర్గంబులోనన -- య్యాదివిష్ణుమూర్తి వండ్రు నిన్ను.

పై పద్యాన్ని జాగ్రత్తగా చదువుతే తొందరగానే అర్థమవుతుంది. అయితే, దీన్లో ఉన్న ప్రత్యేకతేమిటంటే, ప్రతీ అర్థభాగంలో (తెలియడానికి -- లతో విడగొట్టేను) మొదటి అక్షరాన్ని తీసుకొని వేరే వరుసలో చదువుతే, "రాజ, దీని వివాహము చేయవయ్యా" అని వస్తుంది.

అదీ సంగతి.

(చూ. ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి)





Sunday, November 19, 2017

మంచి మంగళశ్లోకం

శ్రీవాణిగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహంత్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వ స్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజభవశ్రీకంథరా శ్శ్రేయశే ||

పై శ్లోకం నన్నయగారు తెలుగించిన ఆంధ్రభారతం, ఆదిపర్వంలో మొదటిది. ఇది ఒక మంగళశ్లోకం. మొత్తం సంస్కృతమే. భారతం తెలుగులో వ్రాస్తానని మొదలు పెట్టడమే సంస్కృతంలో అవడం కొంత ఆలోచించవలసిన విషయమే. సంస్కృతం దేవతల భాష అనో, లేక "తల్లి సంస్కృతంబు సర్వ భాషలకును" అనో, ఆ భాష మీద గౌరవంతో అలా వ్రాసుంటారు. లేదా, ఇప్పుడెలా ప్రతి రెండు ఇంగ్లీష్ మాటలకీ ఒక తెలుగు ప్రత్యయం చెప్పి, తర్వాత OK అనేసి ముగించి అదే తెలుగని ఎలా అనుకుంటున్నామో, అప్పట్లో చదువుకున్నవారు సంస్కృతం ఎక్కువవాడి తెలుగు తక్కువ వాడే వారేమో.

ఏది ఏమైనా, ఏ భాషలో వ్రాసినా, ఒక బ్రహ్మాండమైన పద్యమని చెప్పితీరాలి.

పై పద్యానికి అర్థమేంటంటే, ఎవరైతే లక్ష్మి-సరస్వతి-పార్వతులను ఎప్పటినుంచో  గుండెలమీదా, నాలుకమీదా, సగం ఒంటిమీదా పెట్టుకుని, మర్త్యలోకాలకి స్థిరత్వాన్ని ఆపకుండా కలుగజేస్తున్నారో, ఆ వేదత్రయ మూర్తులైన వారు, దేవతలచేత పూజింపబడేవారూ అయిన త్రిమూర్తులు
           పురుషోత్తముడు -- విష్ణువు,
           అంబుజభవుడు   -- అంబుజమంటే, నీటిలోంచి పుట్టినదైన తామరపువ్వు. అలాంటి
                             పద్మంలోంచి పుట్టేడు కాబట్టి బ్రహ్మ అంబుజభవుడు అయ్యేడు
           శ్రీకంథరుడు  -- ఇక్కడ శ్రీ అంటే విషమని అర్థం చేసుకోవాలి. విషాన్ని గొంతులో
                             పెట్టుకున్నవాడు కాబట్టి శివుడు శ్రీకంథరుడయ్యేడు
మీకు మేలు కలుగించేవారు అగుగాక అని.

ఈ శ్లోకంలో వేదత్రయమనే పదం కొంచం ఆలోచింపచేసేది. వేదత్రయమూర్తులంటే, మూర్తీభవించిన ఋగ్యజుస్సామవేదాలనే మూడు వేదాలుగా అర్థం చేసుకోవచ్చు.

అంటే వేదత్రయమంటే మూడు వేదాలనేనా. అంటే మరి నాలుగోదైన అథర్వణ వేదమో ? అది ఇంతకు ముందు లేదా ? తర్వాత ఎవరో పుట్టించారా ? చాలామంది తెల్ల దొరలైన పండితులు అలాగే చెప్పేరు మరి.

అసలు విషయం అదికాదు. వేదమంత్రాలను ఒక పద్ధతిలో మూడు రకాలుగా చెప్పుకోవచ్చు - శ్లోకం, గానం, గద్యం అని. శ్లోకరూపంలో ఉన్నవాటిని ఋక్కులనీ, గానరూపంలో ఉండే మంత్రాలని సామాలనీ, గద్యరూపంలో ఉండేవాటిని యజుస్సులనీ, కలిపి ఋగ్గ్యజుస్సామాలని అంటారు. ఈ శ్లోకం, గానం, గద్యం అనేవి నాలుగు వేదలలోనూ ఉంటాయి. కాబట్టి, వేదాలు అథర్వణ వేదంతో కలిపి నాలుగని తెలుసుకోవడం మంచిది. ఇదే విషయన్ని పండితులూ, ప్రవచన కర్తా అయిన సామవేదం షణ్ముఖ శర్మ గారు ఎన్నో వేదికలమీద మరీమరీ చెప్పేరు.

అదీ సంగతి మరి.

Monday, October 17, 2016

పాపనివారకా మన్త్రాః

దేవకృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |
మనుష్య-కృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |
పితృకృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |
ఆత్మకృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |
అన్యకృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |
అస్మత్‍కృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |
యద్దివా చ నక్తం చైనశ్చకృమ తస్యావయజన-మసి స్వాహా |
యథ్స్వపన్తశ్చ జాగ్రతశ్చైనశ్చకృమ తస్యావయజన-మసి స్వాహా |
యథ్సుషుప్తశ్చ జాగ్రతశ్చైనశ్చకృమ తస్యావయజన-మసి స్వాహా |
 యద్విద్వాగ్ంస-శ్చావిద్వాగ్ంస-శ్చైనశ్చకృమ తస్యావయజన-మసి స్వాహా |
ఏనస ఏనసోఽవయజన-మసి స్వాహా ||

పాప నివారక మన్త్రాః అంటే పాపాలు చుట్టుకోకుండా ఆపే మంత్రాలు అని అర్థం. ఈ మంత్రాలు మహానారాయణోపనిషత్తు లో 59వ అనువాకములో వస్తాయి. తాను రకరకాల కర్మలకు సంబంధించి చేసిన అనేక విధములైన పాపముల నుండి తన్ను విముక్తుడ్ని చేయమని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ యజ్ఞగుండం లో ఆజ్యం పోస్తూ చదువుతూన్న మంత్రాలివి. ఈ మంత్రాల్ని పదవిభజన చేసి చూస్తే, ఒక్కొక్క వాక్యం ఈ క్రింది విధంగా కనబడుతుంది.

దేవ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
మనుష్య కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
పితృ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
ఆత్మ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
అన్య కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
అస్మత్ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
యత్ దివా చ నక్తం చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
యత్ స్వపన్తః చ జాగృతః చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
యత్ సుషుప్తః చ జాగృతః చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
యత్ విద్వాంసః చ అవిద్వాంసః చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
ఏనసః ఏనసః అవయజనం అసి స్వాహా

పై వాక్యాల్ని జాగ్రత్తగా గమనిస్తే కొన్ని పదాలు పదేపదే వస్తూన్నట్టు తెలుస్తుంది. అవేంటో, వాటి అర్థాలేంటో ఒకసారి చూద్దాం.
కృతస్య = పనుల సంబంధమైన;
అవయజనం = అగ్నిపునీతం చేయడం,లేదా అగ్ని ప్రక్షాళన చేయడం, లేదా యజ్ఞము ద్వారా వదిలించుకోవడము.
ఏనసః = తప్పు లేదా పాపము; దోషి లేదా పాపి
అసి = ఉన్నావు (అహం అస్మి, త్వం అసి, సః అస్తి )
స్వాహా = దేవతల్ని (ఇక్కడ అగ్నిదేవుడు) అహ్వానించడం

ఇప్పుడు పై పదాల్ని ఒక్కొక్క మంత్రవాక్యానికీ అన్వయించి చూస్తే వచ్చే అర్థాల్ని చూద్దాం.

దేవ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా

  దైవసంబంధ కార్యాలు (పూజలు, మంత్రపఠనం, హోమాలు, వ్రతాలు, మొదలైనవి) చేసేటప్పుడు మేము చేసిన తప్పులను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
సనాతన ధర్మశాస్త్రాలు 32 సేవపరాధాల్ని సూచించాయి. అవేంటంటే,
1. చెప్పులతో గుడి లోపలికి వెళ్ళడం,
2. పర్వదినాలలో దేవదర్శనం చేయకపోవడం,
3. దేవవిగ్రహాలు చూసి నమస్కరించకపోడం,
4. అశుచిగా దేవదర్శనం చెయ్యడం,
5. ఒక్కచేత్తో దేవతా నమస్కారం చెయ్యడం (అర్థంలేని పని),
6.ప్రార్థనారహిత ప్రదక్షిణం చెయ్యడం,
దేవతా విగ్రహం ముందు
  7.కాళ్ళు చాచి కూర్చోడం,
  8.అవిధేయతతో కూర్చోవడం,
  9. పడుకోడం,
 10. అన్నం తినడం,
 11. అబద్ధాలు చెప్పడం,
 12. వ్యర్థప్రసంగాలు (సొల్లు కబుర్లు) చెయ్యడం,
 13. కేకలు పెట్టడం,
14. గట్టిగా మాట్లాడడం,
15. దెబ్బలాడుకోవడం,
16. ఇంకొకరిని బాధపెట్టడం,
17. పక్షపాతం చూపెట్టడం,
18. తిట్టడం,
19. దుప్పటి ముసుగు తన్నడం,
20. పరనింద చెయ్యడం,
21. పరస్తోత్రం చెయ్యడం,
22. అశ్లీల సంభాషణ చెయ్యడం,
23. అపాన వాయువు వదలడం,
24. దేవ విగ్రహం వైపు వీపు పెట్టి కూర్చొడం,
25. ఇతరులకి నమస్కరించడం, మరియు,
26. శక్తికి తగినట్లుగా పూజ చెయ్యకపోవడం,
27. దేవుడికి నైవేద్యం పెట్టకుండా తిన్నెయ్యడం,
28. ఆయాకాలాల్లో దొరికే పళ్ళను తెచ్చి దేవుడికి అర్పించకుండా తినెయ్యడం,
29. తొలిపంట దేవుడికర్పించక పోవడం,
30. గురువుని పూజించక పోవడం,
31. తన్ను తాను పొగుడుకోడం,
32. ఏ దేవతనైనా నిందించడం.
(చూ. పురిపండ అప్పలస్వామిగారి శ్రీమద్భాగవతము 2వ భాగం పుట 54)

వీటికి తోడుగా, ప్రస్తుత కాలంలో దేవుడి ముందు సెల్ ఫోన్లో మాట్లాడడం, ఈమెయిల్ చూసుకోవడం, పూజ మధ్యలో దేవుడి ఫోటోలు తీయడం (ఈ పని చెయ్యాడానికి వేరే మనిషిని ముందుగానే నియమించు కుంటే ఏ గొడవా ఉండదు), ఒకళ్ళనొకళ్ళు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవడం, మొదలైనవి కూడా సేవాపరాధాల లెఖ్ఖలో వస్తాయి.

మనుష్య కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
మనుష్య సంబంధమైన పనులు చేసేటప్పుడు మేము చేసిన తప్పులను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
పితృ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
పితృకార్యాలలో మేము చేసిన తప్పులను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
ఆత్మ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
స్వంత కార్యాలలో మేము చేసిన తప్పులను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
అన్య కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
ఇంకొకళ్ళ విషయంలో మేము చేసిన తప్పులను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
అస్మత్ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
మా స్వంతవారి విషయంలో మేము చేసిన తప్పులను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
యత్ దివా చ నక్తం చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
పగటి పూటకాని, రాత్రిపూట కాని మేము చేసిన పాపములను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
యత్ స్వపన్తః చ జాగృతః చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
యత్ సుషుప్తః చ జాగృతః చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
జాగృత్, స్వప్న, సుషుప్తావస్థలలో చేసిన పాపములను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
యత్ విద్వాంసః చ అవిద్వాంసః చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
తెలిసికాని, తెలియకకాని చేసిన పాపములను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
ఏనసః ఏనసః అవయజనం అసి స్వాహా
ఒక పతితుడితో గాని, పతితురాలితో గాని కలిసి చేసిన భాషణ (మాట్లాడడం), దర్శన (చూడడం), స్పర్శన (ముట్టుకోడం),  ఆసన (కూర్చోవడం), భోజన (తినడం) మొదలైన పాపాల్ని ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.

__________________________________________________________________________
పనికొచ్చిన పుస్తకాలు, ఉపన్యాసాలు: ౧. రామకృష్ణ మఠం వారి మహానారాయణోపనిషత్తు (ఆంధ్రపాఠము); ౨. పురిపండ అప్పలస్వామిగారి శ్రీమద్భాగవతము (౨వ భాగం పుట ౫౪), ౩. శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి గణేశతత్వం మీద ప్రవచనం