Pages

Monday, October 17, 2016

పాపనివారకా మన్త్రాః

దేవకృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |
మనుష్య-కృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |
పితృకృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |
ఆత్మకృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |
అన్యకృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |
అస్మత్‍కృతస్యైనసోఽవయజన-మసి స్వాహా |
యద్దివా చ నక్తం చైనశ్చకృమ తస్యావయజన-మసి స్వాహా |
యథ్స్వపన్తశ్చ జాగ్రతశ్చైనశ్చకృమ తస్యావయజన-మసి స్వాహా |
యథ్సుషుప్తశ్చ జాగ్రతశ్చైనశ్చకృమ తస్యావయజన-మసి స్వాహా |
 యద్విద్వాగ్ంస-శ్చావిద్వాగ్ంస-శ్చైనశ్చకృమ తస్యావయజన-మసి స్వాహా |
ఏనస ఏనసోఽవయజన-మసి స్వాహా ||

పాప నివారక మన్త్రాః అంటే పాపాలు చుట్టుకోకుండా ఆపే మంత్రాలు అని అర్థం. ఈ మంత్రాలు మహానారాయణోపనిషత్తు లో 59వ అనువాకములో వస్తాయి. తాను రకరకాల కర్మలకు సంబంధించి చేసిన అనేక విధములైన పాపముల నుండి తన్ను విముక్తుడ్ని చేయమని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ యజ్ఞగుండం లో ఆజ్యం పోస్తూ చదువుతూన్న మంత్రాలివి. ఈ మంత్రాల్ని పదవిభజన చేసి చూస్తే, ఒక్కొక్క వాక్యం ఈ క్రింది విధంగా కనబడుతుంది.

దేవ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
మనుష్య కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
పితృ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
ఆత్మ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
అన్య కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
అస్మత్ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
యత్ దివా చ నక్తం చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
యత్ స్వపన్తః చ జాగృతః చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
యత్ సుషుప్తః చ జాగృతః చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
యత్ విద్వాంసః చ అవిద్వాంసః చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
ఏనసః ఏనసః అవయజనం అసి స్వాహా

పై వాక్యాల్ని జాగ్రత్తగా గమనిస్తే కొన్ని పదాలు పదేపదే వస్తూన్నట్టు తెలుస్తుంది. అవేంటో, వాటి అర్థాలేంటో ఒకసారి చూద్దాం.
కృతస్య = పనుల సంబంధమైన;
అవయజనం = అగ్నిపునీతం చేయడం,లేదా అగ్ని ప్రక్షాళన చేయడం, లేదా యజ్ఞము ద్వారా వదిలించుకోవడము.
ఏనసః = తప్పు లేదా పాపము; దోషి లేదా పాపి
అసి = ఉన్నావు (అహం అస్మి, త్వం అసి, సః అస్తి )
స్వాహా = దేవతల్ని (ఇక్కడ అగ్నిదేవుడు) అహ్వానించడం

ఇప్పుడు పై పదాల్ని ఒక్కొక్క మంత్రవాక్యానికీ అన్వయించి చూస్తే వచ్చే అర్థాల్ని చూద్దాం.

దేవ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా

  దైవసంబంధ కార్యాలు (పూజలు, మంత్రపఠనం, హోమాలు, వ్రతాలు, మొదలైనవి) చేసేటప్పుడు మేము చేసిన తప్పులను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
సనాతన ధర్మశాస్త్రాలు 32 సేవపరాధాల్ని సూచించాయి. అవేంటంటే,
1. చెప్పులతో గుడి లోపలికి వెళ్ళడం,
2. పర్వదినాలలో దేవదర్శనం చేయకపోవడం,
3. దేవవిగ్రహాలు చూసి నమస్కరించకపోడం,
4. అశుచిగా దేవదర్శనం చెయ్యడం,
5. ఒక్కచేత్తో దేవతా నమస్కారం చెయ్యడం (అర్థంలేని పని),
6.ప్రార్థనారహిత ప్రదక్షిణం చెయ్యడం,
దేవతా విగ్రహం ముందు
  7.కాళ్ళు చాచి కూర్చోడం,
  8.అవిధేయతతో కూర్చోవడం,
  9. పడుకోడం,
 10. అన్నం తినడం,
 11. అబద్ధాలు చెప్పడం,
 12. వ్యర్థప్రసంగాలు (సొల్లు కబుర్లు) చెయ్యడం,
 13. కేకలు పెట్టడం,
14. గట్టిగా మాట్లాడడం,
15. దెబ్బలాడుకోవడం,
16. ఇంకొకరిని బాధపెట్టడం,
17. పక్షపాతం చూపెట్టడం,
18. తిట్టడం,
19. దుప్పటి ముసుగు తన్నడం,
20. పరనింద చెయ్యడం,
21. పరస్తోత్రం చెయ్యడం,
22. అశ్లీల సంభాషణ చెయ్యడం,
23. అపాన వాయువు వదలడం,
24. దేవ విగ్రహం వైపు వీపు పెట్టి కూర్చొడం,
25. ఇతరులకి నమస్కరించడం, మరియు,
26. శక్తికి తగినట్లుగా పూజ చెయ్యకపోవడం,
27. దేవుడికి నైవేద్యం పెట్టకుండా తిన్నెయ్యడం,
28. ఆయాకాలాల్లో దొరికే పళ్ళను తెచ్చి దేవుడికి అర్పించకుండా తినెయ్యడం,
29. తొలిపంట దేవుడికర్పించక పోవడం,
30. గురువుని పూజించక పోవడం,
31. తన్ను తాను పొగుడుకోడం,
32. ఏ దేవతనైనా నిందించడం.
(చూ. పురిపండ అప్పలస్వామిగారి శ్రీమద్భాగవతము 2వ భాగం పుట 54)

వీటికి తోడుగా, ప్రస్తుత కాలంలో దేవుడి ముందు సెల్ ఫోన్లో మాట్లాడడం, ఈమెయిల్ చూసుకోవడం, పూజ మధ్యలో దేవుడి ఫోటోలు తీయడం (ఈ పని చెయ్యాడానికి వేరే మనిషిని ముందుగానే నియమించు కుంటే ఏ గొడవా ఉండదు), ఒకళ్ళనొకళ్ళు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవడం, మొదలైనవి కూడా సేవాపరాధాల లెఖ్ఖలో వస్తాయి.

మనుష్య కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
మనుష్య సంబంధమైన పనులు చేసేటప్పుడు మేము చేసిన తప్పులను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
పితృ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
పితృకార్యాలలో మేము చేసిన తప్పులను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
ఆత్మ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
స్వంత కార్యాలలో మేము చేసిన తప్పులను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
అన్య కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
ఇంకొకళ్ళ విషయంలో మేము చేసిన తప్పులను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
అస్మత్ కృతస్య ఏనసః అవయజనం అసి స్వాహా
మా స్వంతవారి విషయంలో మేము చేసిన తప్పులను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
యత్ దివా చ నక్తం చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
పగటి పూటకాని, రాత్రిపూట కాని మేము చేసిన పాపములను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
యత్ స్వపన్తః చ జాగృతః చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
యత్ సుషుప్తః చ జాగృతః చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
జాగృత్, స్వప్న, సుషుప్తావస్థలలో చేసిన పాపములను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
యత్ విద్వాంసః చ అవిద్వాంసః చ ఏనసః చ కృమతస్య అవయజనం అసి స్వాహా
తెలిసికాని, తెలియకకాని చేసిన పాపములను ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.
ఏనసః ఏనసః అవయజనం అసి స్వాహా
ఒక పతితుడితో గాని, పతితురాలితో గాని కలిసి చేసిన భాషణ (మాట్లాడడం), దర్శన (చూడడం), స్పర్శన (ముట్టుకోడం),  ఆసన (కూర్చోవడం), భోజన (తినడం) మొదలైన పాపాల్ని ప్రక్షాళన చేయమని ప్రార్థిస్తూ నిన్ను ఈ ఆజ్యం ద్వారా ఆహ్వానిస్తున్నాము.

__________________________________________________________________________
పనికొచ్చిన పుస్తకాలు, ఉపన్యాసాలు: ౧. రామకృష్ణ మఠం వారి మహానారాయణోపనిషత్తు (ఆంధ్రపాఠము); ౨. పురిపండ అప్పలస్వామిగారి శ్రీమద్భాగవతము (౨వ భాగం పుట ౫౪), ౩. శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి గణేశతత్వం మీద ప్రవచనం 

Monday, May 30, 2016

మాటే మంత్రం

केयूराणि न भूषयन्ति पुरुषं हाराः न चन्द्रोज्वला:
न स्नानम् न विलेपनम् न कुसुमं नालंकृताः मूर्धजाः |
वाण्येका समलंकरोति पुरुषं या संस्कृता धार्यते
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणम् भूषणम् ||


కేయూరాణి  న భూషయన్తి పురుషం, హారాః న చన్ద్రోజ్వలాః
న స్నానం న విలేపనం న కుసుమం, నాలంకృతాః మూర్ధజా |
వాణ్యేకా సమలంకరోతి పురుషం, యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తే ఖలు భూషణాని సతతం, వాగ్భూషణం భూషణం ॥


చిన్నప్పుడు, అంటే  1970 లలో, ఆకాశవాణి వారి సంస్కృతపాఠం కార్యక్రమ ప్రారంభ శ్లోకం గా చిరపరిచితమైన శ్లోకం ఈ  భర్తృహరి సుభాషితం.


ఒక మనిషికి అలంకారము గా భాసించునది శుద్ధమైన వాక్కు తప్ప చేతికి అలంకరించుకున్న విభూషణాలూ, చంద్రకాంతితో  మెరిసే మెడహారాలూ, సుగంధస్నానాలూ, లేపనాలు, పూవులతో అలంకరించుకున్న చక్కటి జుత్తూ  కాదనీ, ఆభరణాలూ అలంకారాలూ  కాలప్రభావానికి వెలవెల పోతాయనీ, చక్కని వాక్శుద్ధి  మాత్రం ఎల్లకాలమూ భాసిస్తూ ఉంటుందనీ  పై శ్లోకానికి అర్థంగా చెప్పుకోవచ్చు.

Friday, August 23, 2013

అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం



Andame Anandam - Anandame Jeevita Makarandam
అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం

ఇది February 6th, 1953 లో విడుదలైన బ్రతుకు తెరువు అనే సినిమాకి సముద్రాల రామానుజాచార్య (సముద్రాల జూ||) రచించిన పాట. ఈ పాట సినిమాలో ఒకసారి  స్వీయ స్వర రచనలో ఘంటసాల పాడితే  మరొకసారి పి.లీల పాడుతుంది. బ్రతుకుతెరువు సినిమాకి స్ఫూర్తి 1951 లో విడుదలైన  A Place in the Sun అనే హాలీవుడ్చిత్రంఈ ఇంగ్లీషు సినిమాకి మూలం 1931 లో విడుదలైన మరో సినిమా An American Tragedy. ఈ 1931 సినిమాకి ఆధారం 1925 లో Theodore Dreiser రాసిన An American Tragedy అనే నవల.

సరే మన పాట విషయానికి వస్తే, ఇది John Keats' A Thing of Beauty Is A Joy Forever అనే కవిత మకుటంగా తీసుకుని రాసినది. ఈ ఫాట గురించి సముద్రాల జూ ఏమన్నారో వినండి.

అందమె ఆనందం

ఇప్పుడు పాట రచన నొకసారి చూద్దాం.

అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం

పడమట సంధ్యా రాగం
కుడి డమల కుసుమ పరాగం
ఒడిలో చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగం

పడమట సూర్యుడస్తమిస్తూండగా తూండగా చూడడం, ఆడ మగ తానే అయిన పుప్పొడి స్వపరాగ సంపర్కం
(Roles of Stamen and Carpel of pollen in self-pollination)  చేయడం, ప్రియుని ఒడిలో తలనానించిన ప్రియురాలి ఆలాపన వినడం, ఇలాంటి అనుభవాలతో కూడిన జీవితం ఎంతో మధురం.

పడిలేచే కడలి తరంగం
వడిలో జడిసిన సారంగం
సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటకరంగం

జీవితంలో ఒడిదుడుకులతో కూడుకున్న అనుభవాలు కూడా చాలా ఉంటాయి. ఇవి ఎంతో ఎత్తుకి లేచి వెంటనే పడిపోయే సముద్రతరంగాలలాగా, ఉచ్చు(వడి)లో పడి భయంతో బిగుసుకు పోయే లేడి(సారంగం) లాగా, సుడిగాలిలో చిక్కుకున్న గాలిపటం లాగా చాలా నాటకీయమైనవి. 

మొదటి చరణంలో ప్రతీ పాదమూ రాగం తో అంతమవగా, రెండవ చరణం ప్రతీ పాదం రంగం తో అంతమవుతూ, అంత్యప్రాసల పాటల్లో ఎన్నదగిన పాటగా గుర్తింపు పొందిన పాట ఇది. సినిమా పాటల్లో ఛందస్సు చెప్పడం కష్టం కానీ, అక్షరాల అమరిక, పదాల పొందిక ఎంతో ముచ్చటగా ఉండి మంచి ఉత్పలమాలని గుర్తుచేస్తూన్న పాట ఇది.


Saturday, July 13, 2013

అష్టావధానం -- ఒక పరిచయం

అష్టావధానం -- ఒక పరిచయం 

Ashtavadhanam - An Introduction

అవధానం అంటే ఏకాగ్రతహెచ్చరిక అని నిఘంటువు చెబుతుందిసాహిత్యపరంగా చూస్తే ఎంతో జాగరూకతతోఏకాగ్రతని నిలుపుకుంటూ పృచ్ఛకులు(పృచ్ఛ చేసేవారుఅనగా ప్రశ్నవేసేవారు అని అర్ధంఅడిగే ప్రశ్నలకు సమాధానాలిచ్చి వారిని సంతృప్తి పరచే వారిని అవధాని అంటారు.ఇది ఒక గొప్ప సాహిత్యప్రక్రియఅవధానికి ఎంతో ఏకాగ్రతసమయస్ఫూర్తిఓర్పుపాండిత్యం కావాలిమంచి మాటకారితనం ఉండాలిఒక మంచి కవియైఎటువంటి విషయంలోనైనా అడిగిన విషయం మీద కావలసిన ఛందోవృత్తంలో ఆశువుగా పద్యాలు శ్రావ్యంగా వినిపించగలిగి ఉండాలి. విషయం మీదనైనా అనర్గళంగా మాట్లాడే శక్తి కావాలి.  అన్నిటికీ మించి మంచి ధారణశక్తి చాలా అవసరం. ఇది ఏ కొద్దిమందో  తప్ప  ప్రదర్శించలేని విద్య.
అష్టావధానంలో ఎనిమిది అంశములుంటాయి. వీటిలో కనీసం ఐదు సాహితీ పరమైనవైతే మిగతా మూడూ లౌకిక సంబంధమైనవుండొచ్చు. అసలు పూర్వకాలంలో అవధానమంటే శతావధానమే. అష్టావధానం ప్రాచుర్యం పొందినది ఆథునిక కాలంలో తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదరకవులు మొదలైన వారివల్ల. తిరుపతి  వేంకట  కవులు ఈ అష్టావధానానికి కొన్ని లక్షణాలు నిర్దేశించి  క్రింది విధంగా చెప్పేరు.
పౌరాణోక్తి కవిత్వ పుష్పగణనా వ్యస్తాక్షరుల్‌ లౌక్య గం
భీరోక్త్యంచిత కావ్యపాఠన కళావిద్భాషణంబుల్ ముదం
బారంగా చతురంగఖేలనము నీ యష్టప్రచారంబు లొ
ప్పారున్‌ శంకరయేకకాలముననే యష్టావధానమ్మునన్

పై పద్యం ప్రకారం అష్టావధాన ఆంశాలు ఇవి:
పురాణపఠనముకవిత్వముపుష్పగణనమువ్యస్తాక్షరిలోకాభిరామాయణముకావ్యపాఠనముశాస్త్రార్థముమరియు చదరంగము. అంశాలు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయినిషేధాక్షరినిర్దిష్టాక్షరిఅప్రస్తుత ప్రసంగంసమస్యా పూరణందత్తపదిఆంధ్రీకరణఏకసంథాగ్రాహముమొదలైన అంశాలు కూడా చేర్చ బడతాయి. ఉదాహరణకి ఒక అస్టావధానంలో క్రింది అంశాలున్నాయనుకుంటే, వాటి ప్రాముఖ్యత ఏమిటో, అవధాన విధానం ఎలాగుంటుందో చూద్దాం.

1.    వర్ణన లేదా కవిత్వం: పృచ్ఛకుని కోరిక ప్రకారం, వారు ఎన్నుకున్న విషయం లేదా వస్తువు మీద, వారికి నచ్చిన వృత్తంలో, ఒక పద్యం చెప్పడం. అంశం ద్వారా అవధాని ఆశు కవితాధార ఎంత గొప్పదో తెలుస్తుంది
2.    వ్యస్తాక్షరి: పృచ్ఛకుడు తనకు తెలిసిన పద్యాన్ని గానిపాటని గానీశ్లోకాన్ని గానిఅక్షరాలుగా విడగొట్టివాటి స్థానాల సంఖ్యల్ని ఒక్కొక్కటిగా చీటీ మీద వ్రాసి అవధానికి అందిస్తే, వారు వ్యస్తం (తారుమారు) అయిన అక్షరాలని ఒక క్రమంలో కూర్చి పద్యాన్ని చదివి చెప్తారన్నమాట. దీనివలన అవధాని ధారణశక్తి, అస్తవ్యస్తమైన పద్యం తిరిగి కూర్చగల మేథాశక్తి వ్యక్తమౌతుంది. ఉదాహరణకి, క్రింది అక్షరాలు వాటి స్థాన సంఖ్యలతో కలిపి చూపించిన వరుసలో అవధాని గారికి కార్యక్రమం పొడుగునా ఇస్తూ వెళితే, వారు కాగితాన్ని చూసి, సభాసదులకి అందులో ఉన్న అక్షరమూ, స్థానసంఖ్యా ప్రకటించి, చివర్లో పద్యమేమిటో, చెబుతారు. పై(19), ((11), ణి(5), తం(16), వీ(4), (10), (20), పై(7), (15), (3), (12), త్రు(17), (6), (13), ప్రా(1), (18), యూ(14), (8), గ్ది(2), ది(9).
3.    సమస్యాపూరణం:పదాలని ఎక్కడా పొసగని విధంగా ఒక పాదాన్ని అవధానిగారికిస్తే వారు మిగిలిన పాదాలు కూర్చి  పద్యాన్ని అర్ధవంతంగా చేసి వినిపిస్తారుఉదాహరణలు: 1. కుందేలును కోడిపిల్ల గుటుకున మ్రింగెన్‌; 2. సొరపాదున బీరకాయ సొంపుగ గాచెన్‌; 3. అస్ఖలిత బ్రహ్మచారికార్గురు పుత్రుల్‌.
4.    నిషిద్ధాక్షరి: పృచ్ఛకుడు ఇచ్చిన విషయము మీద అవధానిగారు ఒక నిర్దిష్టమైన వృత్తంలో పద్యం చెప్పాలిఅవధానిగారు ఒక పదమనుకుని అందులో ఒక అక్షరం వెల్లడి చేస్తారుపృచ్ఛకుడు  పదాన్ని ఊహించి తర్వాత వచ్చే అక్షరాన్ని నిషేధిస్తాడుఇలాగ నిషేధిస్తూ వచ్చిన అక్షరాలని వదలిపెట్టి అర్ధవంతంగా పద్యం చెప్పగలగాలియతి స్థానంలో మాత్రం అవధాని కి నిషేధాలేవీ కల్పించకూడదు
5.      దత్తపదిపృచ్ఛకుడిచ్చిన పదాలు వచ్చేటట్లుగా  కోరిన వృత్తంలో పద్యం   చెప్పాలి.  అవధాని  గారి  భావ  పరిపుష్టికి అద్దం పట్టే అంశమిదిఉదాహరణకిఇఱుకరాదుకొఱుకరాదునఱుకరాదుపెఱుకరాదు అనే నాలుగు పదాలున్నట్లుగా ఒక పద్యం చెప్పాలి
ఇఱుకరాదుచేత నుసుమంత నిప్పైన
గొఱుకరాదు ఇనుము కొంచమైన
నఱుకరాదు నీరు నడిమికి రెండుగా
బెఱుకరాదు బావి పెల్లగిలగ
6.      ఆకాశపురాణం:  ఏదైనా పురాణము నుండి తీసిచ్చిన కథాంశాన్ని తీసుకుని సొంత పద్యాల్లో వివరిస్తూ పురాణం చెప్పినట్లు వ్యాఖ్యానించడం. దీనివల్ల అవధాని గారి పౌరాణిక పరిజ్ఞానం ఎంతో తెలుసుకోవచ్చు.
7.      అప్రస్తుత ప్రసంగం పృచ్ఛకుడు అవధానిగారికి అడుగడుగునా అడ్డుపడుతూ అసందర్భమైన లౌకిక విషయాల మీద ప్రశ్నలు వేస్తూంటాడుమిగతా అంశాలమీద ఏకాగ్రత చెడకుండా  పృచ్ఛకుడితో సంభాషించాలి.
8.    ఘంటాగణనంఒక పృచ్ఛకుడు అవధానం మొదలు నుండీ చివరి వరకూ అప్పుడప్పుడుగా గంటలు వాయిస్తూంటాడుఅవధానం సమాప్తమైన తరువాత మొత్తం ఎన్నిసార్లు గంట వాయింపబడిందో చెప్పగలగాలి.

పైన చెప్పిన విధంగా అవధానం చేసిన వారికి బుద్ధిబలంఆశుధారధైర్యస్థైర్యాలుశాస్త్రజ్ఞానం, మొదలైనవి ఎంతగా ఉండాలో ఆలోచించుకోవచ్చు.



పనికొచ్చిన గ్రంథములు:

1. బూదరాజు రాధాకృష్ణ గారి తెలుగులో సమస్యాపూరణలు
2. బూదరాజు రాధాకృష్ణ గారి తెలుగు సంగతులు
3. ఆరుద్ర గారి సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 4 సంపుటి 
4. 150 వసంతాల వావిళ్ళ వాజ్ఙయ వైజయంతి
5. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటుపద్య రత్నాకరము

6. బహుజనపల్లి సీతారామాచార్యులుగారి శబ్దరత్నాకరము