Pages

Friday, July 26, 2019

అట్నుంచి నరుక్కు రండి

మన ఇంట్లో ఉన్నట్లుండి ఏదో పనిచేయడం మానేస్తుంది. అది టీవీ, ఫ్రిజ్, కుళాయిబుర్ర, టాయ్లెట్ ఫ్లష్, సింకు కింద డ్రైన్ మోటరు, లేదా ఇంకేదైనా. ఏమయిందో, ఎలా బాగుచెయ్యాలో తెలీక బుర్రగోక్కుంటుంటే ఇంట్లో ఎవరో సలహా పారేస్తారు - "అట్నుంచి నరుక్కు రండి" అని. వాళ్ళ ఉద్దేశం రివర్స్ ఇంజినీరింగ్ చెయ్యమని. ఉదా: మిక్సీ పనిచెయ్యట్లేదు. ముందు ప్లగ్గులో కరెంటొస్తోందో లేదో, రాకపోతే ఫ్యూజు పోయిందా, బ్రేకరు ట్రిప్పయ్యిందా, మిక్సీ స్విచ్ ఆన్ పొజిషన్లో ఉందా ఇలాగన్నమాట. అయితే, ఈ అట్నుంచి నరుక్కు రావడమనే నానుడి వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.
తత్కథాప్రారంభంబెట్టిదనిన (ఈ మాట ఆదికవి నన్నయ్యది. భారతకథ మొదలుపెడుతూ అంటాడు. ఆంధ్రభారతం ఆదిపర్వం, 1.27) -
రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారని, 18వ శతాబ్దంలో చింతపల్లి సంస్థానాధీశుడు. అక్కడ్నించి ఆయన తన రాజధానిని ముందు ధరణికోటకీ, తర్వాత అమరావతికీ మార్చుకున్నాడు. ఈరాజు గారు మంచి పాలకుడుగా, కళాపోషకుడుగా, దాతగా చాలామందికి తెలుసు. మంగళగిరి నరసింహస్వామి గుడి గోపురం - 857 అడుగుల ఎత్తు - ఈయన కట్టించినదే. బంగారం పూసిన ధ్వజస్థంభాలు - ఒక్కొక్కటీ ముప్ఫయ్యేసి అడుగులవి - అష్టోత్తర శతం, అంటే నూట ఎనిమిది - ఆంధ్రదేశం దేవాలయాల్లో ప్రతిష్ఠింపజేసేడు. ఈయన నిలువెత్తు శిలావిగ్రహం అమరావతిలో ఇప్పటికీ ఉంది.
నాయుడిగారి రాజ్యంలో ఒకప్పుడు పిండారీలు (ఆటవిక దొంగలు) హఠాత్తుగా ఊళ్ళమీద పడి దోపిడీలు చేసేవారు. అలాగే దారిదోపిడిలు కూడా విపరీతంగా ఉండేవి. తన ప్రజలకి ఈ దొంగలబాధ తప్పించాలనే సదుద్దేశంతో, రాజుగారొకనాడు, చుట్టుపక్కల ఆటవిక గూడేలలో ఉండే సుమారు 600 మంది మగవాళ్ళని విందు భోజనమనే నెపంతో ఒక ప్రదేశానికాహ్వానించి, వాళ్ళొచ్చిన తర్వాత అందర్నీ బంధించి, వరసలో నిలబెట్టించేడు. ప్రజలందరూ చూస్తూండగా తలలు నరికేయమని ఆజ్ఞాపించేడు. ఈ దెబ్బతో ఇంకెవరూ దోపిడిలూ దొంగతనాలూ చెయ్యకూడదు మరి.
సరే, దొంగలందర్నీ వరసలో నిలబెట్టేరు కదా, కొంచం దూరంలో రాజుగారు ఎత్తైన ఆసనం మీద కూర్చున్నారు. ప్రక్కన బంధుమిత్రులూ, మంత్రులూ, ఇతర పరివారమూ కూర్చున్నారు. ప్రజలందరూ కూడా గుమిగూడేరు. తలారి కత్తుల్ని పదును పెట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. ఆఱువందల తలకాయలు వాటంగా నరికెయ్యడానికి. గంట కొట్టేవాడు కూడా సిద్ధమే. రాజుగారు ఆజ్ఞ ఇవ్వడం, గంట కొట్టడం. ఒక్కొక్క గంటకి ఒక్కొక్క తల. తఱుగుడే తఱుగుడు. పాపం కోయవాళ్ళు. వాళ్ళలో కొందరే దొంగలు. మిగతావాళ్ళు ఏ పాపం ఎఱగరు. కానీ అందరూ ఇప్పుడు ప్రాణభయంతో గజగజలాడిపోతున్నారు. కొందరు ఆ భయంతో వణికిపోతూ ఉంటే, ఇంకొందరు దేవుడికి దణ్ణాలు పెట్టుకుంటున్నారు, కళ్ళు గట్టిగా మూసుకుని. కొందరు పూనకం వచ్చినట్లూగిపోతున్నారు. వరసలో మొదట నిలబడ్డ వాడి పరిస్థితి వీళ్ళందరికన్నా కొంచెం భిన్నంగా ఉంది. అతనికి భయపడ్డానికీ, బిక్కచచ్చిపోవడానికీ సమయం లేదు. మొదటితల అతనిదే కదా మరి. రకరకాలైన ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోయింది. ఎలాగైనా బతకాలి. ఒకరికో, ఇద్దరికో, లేదా పదిమందికో శిరచ్ఛేదం అయిన తర్వాత రాజుగారి మనసు మారవచ్చు కదా. మిగతావాళ్ళకి శిక్ష ఆపుచేయించ వచ్చు కదా. కానీ తాను ముందున్నాడే మరి. తన శిక్ష అమలైపోయుంటుందే, అప్పటికి.
ఏదో ఒకటి చేసి కొంచం కాలయాపన చెయ్యాలంతే. చివరికి ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చి తలారితో అన్నాడు - "తలవరి గారూ, ఒక చిన్న విన్నపం. తమరు దయ చేసి వరసకి అట్నుంచి (తను నించున్న చివర కాకుండా, అవతల చివర్నించి) నరుక్కు రండి. తమకొక నమస్కారం" అని. చావు తెలివితేటలంటారు, ఇందుకేనేమో మరి.
మరి ఎంతమంది నరకబడ్డారో, ఈ తెలివైన ఆటవికుడు బతికేడో, లేదో తెలీదు కానీ, "అట్నుంచి నరుక్కు రావడం" అనేది మాత్రం నానుడిగా మిగిలిపోయింది.
అలా రాజావారు శిక్షవేసి తలలు నరికించిన ప్రదేశమే, ఇప్పటి గుంటూరు జిల్లా అమరావతి మండలం "నరుకుళ్ళపాడు". అంతమంది మనుషుల తలలు కళ్ళెదురుగా, వాళ్ళు నిజంగా తప్పుచేసేరో లేదో అని ఎలాంటి విచారణా లేకుండా నరికించిన నాయుడు తర్వాత అంత బాగా బతకలేదు. పశ్చాత్తాపంతో కుమిలిపోయేడు . ఆ తర్వాత తన జీవితమంతా దేవుడిసేవలో గడిపి అరవై సంవత్సరాల వయస్సులోపే తనూ చనిపోయేడు. అదీ సంగతి.
(చూ. తెలుగు చాటువు - పుట్టుపూర్వోత్తరాలు, 2006 - పు.144, పొ.శ్రీ.తెలుగు విశ్వవిద్యాలయం)

No comments:

Post a Comment