Pages

Friday, July 26, 2019

శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణీ...

శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణీ...
ఈ మాటలు చాలామంది అంటూంటారు. ఎప్పుడంటే, ఎక్కడైనా మంచి సంగీతం వినబడుతూంటే, సరిగ్గా సంవత్సరం వయస్సు కూడా లేని ఏ చిన్నపిల్లడో, పిల్లో కేరింతలు కొడుతూంటేనో, లేదా మంచి పాటకి ఏ కుక్కపిల్లో చెవులు రిక్కించితేనో, లేకపోతే ఎవరైనా పాములాడించే మనిషి నాదస్వరం ఊదుతూంటే పాము తలాడించిన సందర్భంలోనో. అంతే కాకుండా "చూసేరా! ఆ సంగీత రసానుభూతి! శిశువులకీ, పశువులకీ, చివరకి పాములక్కూడా అలా తెలిసిపోతోందంతే" అని కూడా అనేస్తారు.
అసలు ఈ వాక్యం ఒక మంచి సంస్కృతశ్లోకంలోనిది. పూర్తి శ్లోకం ఇక్కడ చూడండి.
శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణీ
కోవేత్తి కవితాతత్త్వం, శివో జానాతి వా న వా
పై శ్లోకానికి రెండురకాలుగా అర్థం చెప్పుకోవచ్చు. ఒకటి అర్థం, రెండోది గంభీరార్థం.
మొదటి అర్థం - సంగీతం వల్ల శిశువులకీ, పశువులకీ, చివరకి పాములకి కూడా రసానుభుతి కలుగుతుంది. అయితే, ఆ విన్న సంగీతానికొక సాహిత్యమూ అలా రసాలొలికించిన పాట వెనుక ఒక కవిత్వమూ ఉంటాయి. అది మాత్రం అంత త్వరగా కొరుకుడు పడదు. అసలు ఆ పరమశివుడైనా ఆ కవితాతత్త్వాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతాడో, లేదో!
ఇక రెండవ అర్థం. ఇక్కడ శిశువు అంటే కుమారస్వామి (సు-బ్రహ్మణ్యం, స్వచ్ఛమైన జ్ఞానం కలిగినవాడు), పశువు అంటే నందీశ్వరుడు (నందివిద్య - లలితకళలు. వాటికి అధిపతి), ఫణి అంటే పాములరాజైన వాసుకి, గానం అంటే సామవేదం, లేదా క్లుప్తంగా వేదం -- అనీ అర్థం చేసుకుంటే, అప్పుడు ఈ శ్లోకానికి ఎంత గంభీరమైన అర్థం వస్తుందో చూద్దాం.
వేదం తెలిసినవాళ్ళు (శ్రావ్యంగా శ్రుతి, స్వరాలతో వేదమంత్రాలు చెప్పగలిగినవాళ్ళు) గొప్పవాళ్ళైన కుమారస్వామి, నందీశ్వరుడు, వాసుకి. కానీ ఆ వేదవాజ్ఞ్మయానికి సరైన అర్థం వాళ్ళ ముగ్గురికి పై వాడైన ఆ శివుడికైనా తెలుసో, లేదో. వేదమంత్రాలు అంత గంభీరమైనవీ గుహ్యమైనవీ నిగూఢమైనవీ అని అర్థం.
ఇంతుంది ఈ శిశుర్వేత్తి..... శ్లోకంలో. అదీ సంగతి.

No comments:

Post a Comment