Pages

Friday, July 26, 2019

ఉగాది

ఉగాది, యుగాది, గుఢీ పాడవా, పుత్తాండు, విషు, పొహెలా నోబొబోర్షో, పణ సంక్రాంతి, బిఘు, బిఖు, చేతీ చాంద్,..... ఇవన్నీ దేశంలో వివిధ ప్రాంతాలలో సంవత్సరాది పండగకి మారుపేర్లు. అయితే, ఈ సంవత్సరాదిని ఆయా ప్రాంతాలవాళ్ళు వాళ్ళు పాటించే కాలమానం ప్రకారం మార్చి/ఏప్రిల్ నెలల్లో జరుపుకుంటారు. కానీ అందరూ కలసి పాటించే వ్యావహారిక సంవత్సరాది మాత్రం జనవరి ఒకటో తేదిన మాత్రమే. ఆ రోజున దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతంలో ఏ గుడి చూసినా భక్తుల రద్దీతో కిటకిటలాడి పోతుంది. ఆయా దేవస్థానాల వాళ్ళు, భక్తుల రద్దీ తట్టుకోడానికి ప్రత్యేక బస్సులు, రైళ్ళు, ఏర్పాటు చేస్తారు. అయితే, new year అనేది మన సంస్కృతిలో లేని పండగ కదా, మరి ఇదేరోజు విష్ణువూ, శివుడూ, గణపతీ, సుబ్రహ్మణ్యేశ్వరుడూ, అమ్మవారూ, వీళ్ళందరి దేవాలయాలలో ప్రత్యేక పూజలూ, దర్శనాలూ ఎందుకు జరుగుతాయి? ఇది ఏ శాస్త్రంలో ఉంది? ఎవరు చెప్పేరు?
ఆరా తీస్తే... సమాధానాలు తిరుత్తణిలో దొరికేయి.
అరవదేశంలో ఉన్న ఆరు ముఖ్యమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి ఒకటి. ఇది తిరుపతికి దక్షిణంగా 65 కిలోమీటర్ల దూరంలో, కంచికి ఉత్తరంగా 40 కిలోమీటర్ల దూరంలో, ఉన్న పుణ్యక్షేత్రం. ఇక్కడ ఒక చిన్నకొండమీద, విశాలమైన ప్రశాంత ప్రదేశాన పెద్ద సుబ్రహ్మణ్యేశ్వరుడి దేవాలయం ఉంటుంది. తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలలో ఈ దేవాలయం ఒకటి. స్థలపురాణం బట్టి ఇక్కడే కుమారస్వామి బ్రహ్మకి ఓంకార ప్రణవమంత్ర తత్త్వాన్ని బోధించి సుబ్రహ్మణ్యం (సు-బ్రహ్మణ్యం) అనే పేరు గల వాడయ్యేడు. ఇక్కడే ఈయనకి శ్రీవల్లితో పెళ్ళి కూడా అయింది. స్వతంత్ర భారత రెండవ రాష్ట్రపతి అయిన ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మస్థలం కూడా ఈ ఊరే.
విషయానికొస్తే, 18, 19 శతాబ్దాలలో దేశంలో మిగతా ప్రాంతాలలాగే, ఈ తిరుత్తణిలో కూడా బ్రిటిష్ వాళ్ళ పెత్తనం నడిచేది. ప్రతీ ఆఫీసుకీ, ప్రతీ కోర్టుకీ ఒక దొర ఆఫీసరుగా ఉండేవాడు. ఆయనగారికో దొరసాని. అవకాశం వచ్చినప్పుడల్లా స్థానిక భృత్యులు (native subjects) వీళ్ళకి దణ్ణాలు పెడుతూ, బహుమానాలు చదివించుకుంటూ, దొరగారిని ఇంద్రుడూ, చంద్రుడూ అనీ, దొరసానిని రంభా, ఊర్వశీ అనీ పొగుడుతూ ఉండాలి. ఇలా చేసేవాళ్ళు అస్మదీయులు. చెయ్యనివాళ్ళు? తస్మదీయులు! జనవరి ఒకటో తేదీ అయితే ప్రతీ భృత్యుడూ చెయ్యవలసిన మొట్టమొదటి పనే ఇది. ఆ రోజు పొద్దున్నే దొరసానీసమేత దొరవారి దర్శనం చేసుకున్న తర్వాతే వేరే ఏ పనైనా. అసలే వలస పాలకుల దగ్గర ఇష్టంలేని కొలువు. దానికి తోడు శుభమా అని (వ్యావహారికంగా) కొత్త సంవత్సరం ఒక అప్రాచ్యుడి మొహం చూసి మొదలుపెట్టాలి. ఇదెక్కడి శనిరా బాబూ అని స్థానికులు బాధపడుతూన్న సమయాన , అక్కడికి దగ్గర్లోనే ఉన్న వళ్ళిమలై అనే కొండమీద కుటీరంలో ఉండే ఒకానొక యోగీశ్వరుడు స్థానిక ప్రజలకొక మంచి సలహా ఇచ్చేడు. ఏమనంటే, తెల్లవారకముందే లేచి గుడికెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరుడి దర్శనం చేసుకుని అప్పుడు వెళ్ళి దొరని కలవమని. అప్పుడైతే, ఆ అప్రాచ్యుడి మొహం చూసి కొత్త సంవత్సరం మొదలుపెట్టినట్టవదు కదా. ఇదేదో బాగానే ఉంది కదా అని ప్రజలంతా new year's day నాడు సుబ్రహ్మణ్యుడి దర్శనం చేసుకుని దొరని కలవడానికి వెళ్ళడం మొదలు పెట్టేరు. ఈ పద్ధతి మెల్లిగా మిగతా ఊళ్ళకి కూడా ప్రాకింది. ప్రతీ దేవాలయంలో కొత్త సంవత్సరం మొదటిరోజున భక్తుల సందడి మొదలయింది. తర్వాత స్వాతంత్య్రం వచ్చింది. తెల్లదొరలూ, వాళ్ళ దొరసానులూ పోయేరు. కానీ గుళ్ళో దేవుడి దర్శనం చేసుకుని క్రొత్త సంవత్సరం మొదలుపెట్టే పద్ధతి మాత్రం స్థిరంగా ఉండిపోయింది. అదీ సంగతి.
(ఆధారం: పులిగడ్డ వేంకట కుటుంబ వసంతకుమార్ గారి యాత్రికమిత్ర)

No comments:

Post a Comment